గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు

Published Thu, Apr 17 2025 1:37 AM | Last Updated on Thu, Apr 17 2025 1:37 AM

గ్రామ

గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు

మహారాణిపేట (విశాఖ): గ్రామాలు, మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు కొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మోకాలడ్డుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి ఎక్కువగా యలమంచిలి నియోజకవర్గంలో ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. యలమంచిలి నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇతర జిల్లా పరిషత్‌ నిధుల వినియోగంలో జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు పూర్తి హక్కులు ఉంటాయని, కానీ ఎమ్మెల్యే చెప్పిన పనులే అధికారులు చేస్తున్నారని, తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలామని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ అన్నారు. తాము కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని, కానీ ఇక్కడ ఆపరిస్థితి లేదని, ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయకపోతే బిల్లులు ఎలా వస్తా యో చూస్తామని బెదరించడం తగదని సభ్యులు వాపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి లేదని, యలమంచిలిలో విచిత్రమైన ధోరణి ఉందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అన్నారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.

గడువు పూర్తయిన మందుల విక్రయం : మందుల షాపుల్లో గడువు పూర్తయిన మందులు విక్రయిస్తున్నారని, దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట సభ్యుడు దొండ రాంబాబు మాట్లాడుతూ.. తాను మందుల కోసం ఔషధ నియంత్రణ ఏడీకి ఎన్నోసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని, ఒక ప్రజాప్రతినిధి ఎందుకు ఫోన్‌ చేస్తున్నారోనన్న కనీస ఆలోచన, స్పందన అధికారుల నుంచి లేదన్నారు. వచ్చే సమావేశానికి ఉమ్మడి జిల్లాలో ఎన్ని షాపులు ఉన్నాయో, ఎన్ని తనిఖీలు చేశారో, ఎన్నింటిపై చర్యలు తీసుకొస్తున్నారో తెలియజేయాలని చైర్‌పర్సన్‌ సుభద్ర ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్‌ పనులు, రూరల్‌ వాటర్‌ సప్లై, ఇరిగేషన్‌, రోడ్లు, భవనాల శాఖ, తదితర అంశాలపై చర్చ జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగిన అనంతరం చేపడుతున్న తక్షణ సహాయ కార్యక్రమాల కంటే ప్రమాదాల నివారణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు.

అందరికీ ఒకే రకమైన ఎక్స్‌గ్రేషియా

ముందుగా అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కై లాసపట్నంలో బాణసంచా పేలుడులో మృతి చెందిన ఎనిమిది మంది కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీలలో, ఇతర ప్రమాదాలలో ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఒకే రకమైన ఎక్స్‌గ్రేషియా అందించాలని శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అందుకు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించేందుకు చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్‌ తెలిపారు. అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, విశాఖ, అల్లూరి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కె.మయూర్‌ అశోక్‌, డాక్టర్‌ అభిషేక్‌ గౌడ, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, పంచకర్ల రమేష్‌బాబు,కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.వి.జి.కుమార్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ నారాయణమూర్తి సమావేశంలో పాల్గొన్నారు.

పవన్‌ వ్యాఖ్యలు అవాస్తవం

ఏజెన్సీలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 98 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అరకు ఎంపీ డాక్టర్‌ తనూజరాణి అన్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ అరకులో పర్యటించిన సమయంలో గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పడం మంచిదన్నారు. కానీ రోడ్లకు సంబంధించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ పనిచేయలేదని చెప్పడం సంబంధిత మంత్రిగా ఆయనకు తగదన్నారు. విశాఖ మన్యంలో గత ఐదేళ్లలో 498 కిలో మీటర్ల మేర రోడ్లు వేసినట్లు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మన్యం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. మన్యంలో అన్ని పీహెచ్‌సీలు, పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించినట్లు తెలిపారు. నాడు–నేడు పనులతో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. వీటిని చెప్పకుండా రోడ్లు బాగులేవని ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ఎమ్మెల్యేలు, అధికారులపై జెడ్పీటీసీలు, ఎంపీపీల ధ్వజం

యలమంచిలి ఎమ్మెల్యే వైఖరిపై

తీవ్ర అభ్యంతరం

గరంగరంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం

వైఎస్సార్‌సీపీ హయాంలోనే మన్యం అభివృద్ధి

98 కాదు.. 498 కి.మీ రోడ్లు వేశాం: అరకు ఎంపీ తనూజరాణి

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, వేదికపై అనకాపల్లి కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జేసీలు అభిషేక్‌ గౌడ, మయూర్‌ అశోక్‌

గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు 1
1/2

గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు

గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు 2
2/2

గ్రామీణ ప్రగతికి మోకాలడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement