
ఉగ్రదాడికి నిరసనగా శాంతి ప్రదర్శన
పాడేరు: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు అతి కిరాతంగా దాడులు జరిపి, వారి ప్రాణాలను బలిగొనడం అత్యంత హేయమైన చర్య అని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా, మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ బుధవారం సాయంత్రం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై, భారత పౌరులపై ఉగ్రవాదుల దాడులను ఖండిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో భారత పౌరులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రక్షణ రంగానికి అధిక మొత్తంలో నిధులను కేటాయించి భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జోనల్ ఇన్‌చార్జి నర్సింగరావు, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వత మ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండంనాయుడు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఊర్వశీరాణి, అధిక సంఖ్యలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.