
న్యూఢిల్లీ: భారత రైఫిల్ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ‘కోటా’ను అందించిన షూటర్లలో అతనూ ఒకడు.
అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ట్రయల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సందీప్ సింగ్ చేతిలో ఓడి పారిస్ ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఇది అతనిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది. దాని నుంచి కోలుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది.
‘ఆ సమయంలో నేను చాలా బాధపడిన మాట వాస్తవం. కొద్దిరోజుల పాటు అదే వేదనలో ఉండిపోయాను. నాకంటే ఎక్కువగా నా ఆటను దగ్గరి నుంచి చూసిన సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు బాధపడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత నేను సాధారణ స్థితికి వచ్చాను.
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ ద్వారా మాత్రమే భారత జట్టును ఎంపిక చేస్తారనేది వాస్తవమని అర్థమైంది. సెలక్టర్లను ఒప్పించేందుకు నా ప్రయత్నం నేను చేశాను కానీ నిబంధనలు ఉన్నాయి. ఏం చేస్తాం’ అని రుద్రాంక్ష్ వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అతను మళ్లీ తన ఆటపై దృష్టి పెట్టాడు.
బ్యూనస్ ఎయిర్స్‌లో గురువారం ముగిసిన సీజన్ తొలి వరల్డ్ కప్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకంతోపాటు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆర్య బోర్సేతో కలిసి రజతం గెలుచుకున్నాడు. మానసికంగా దృఢంగా మారేందుకు సైకాలజిస్ట్‌ల సహాయం కూడా తీసుకుంటున్నాడు. ‘టోర్నమెంట్‌లు జరిగే సమయంలో ఎలాంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను.
అలాంటి స్థితిలో నిలకడగా రాణిస్తూ నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా. ప్రతీ రెండు నెలలకు ఒకసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. 0.1 పాయింట్ తేడాతో వెనుకబడిపోవచ్చు. ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపర్చుకుంటూనే ఉండాలి.
కాబట్టి సాంకేతికంగానే కాకుండా మానసికంగా కూడా మెరుగ్గా ఉండటంపై దృష్టి పెట్టాలి. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్ ముందున్నాయి. నాపై నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఎంచుకున్న దారిలో నిలకడ కొనసాగిస్తే మంచి ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని బ్యూనస్ ఎయిర్స్‌లో వివరించాడు.