London marathon
-
విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్
గత ఆదివారం నిర్వహించిన లండన్ మారథాన్ 2022లో విషాదం నెలకొంది. మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్ ట్రాక్‌పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్ మాత్రం సౌత్-ఈస్ట్ ఇంగ్లండ్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు. ''లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్‌కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు. ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్ మారథాన్ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్ లండన్‌లోని గ్రీన్విచ్ నుంచి మాల్ వరకు ఈ మారథాన్ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్‌ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్‌ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
అంతర్జాతీయ మారథాన్లలో వరంగల్ ‘జ్యోతి’
సాక్షి, వరంగల్: పాప జన్మించిన సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య నిర్ధారణ అయింది. మందులతోనే సమస్య తగ్గదన్న వైద్యుడి సూచన మేరకు తొలుత యోగా, వాకింగ్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తరువాత పరుగుపై దృష్టిపెట్టింది. ఆమె ప్రారంభించిన పరుగు 46వ ఏట పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. తొలుత భారత్‌లో జరిగిన మారథాన్లలో పరుగులు పెట్టిన ఆమె కాళ్లు...అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఐదు మారథాన్లను చుట్టివచ్చాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి వయస్సు 51 ఏళ్లు. ఆమె ఇటీవల లండన్ మారథాన్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసి మెడల్ దక్కించుకొని వరంగల్ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమ్మకాన్ని పెంచిన ముంబై మారథాన్ 23 ఏళ్ల వయసులో థైరాయిడ్ వచ్చింది. బరువు పెరిగి ఏ పని చేయాలన్నా శరీరం సహకరించలేదు. మందులతోపాటు వ్యాయామం చేస్తే ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. కొన్నాళ్ల పాటు ఇంటి పరిసరాల్లోనే యోగా, వాకింగ్ చేసేదాన్ని. అయితే కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ కేబీఆర్ పార్కుకు వాకింగ్ వెళ్లా. ఆ సమయంలో మారథాన్ క్లబ్ గురించి తెలుసుకొని వారి వద్ద శిక్షణలో చేరా. ఇందుకోసం అత్యంత కష్టమైన ట్రెక్కింగ్ కూడా చేశాను. వారానికి రెండుసార్లు లాంగ్‌రన్‌లు, నిత్యం వ్యాయామం చేశా. విశాఖపట్నం, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఎక్కడా మారథాన్ నిర్వహించినా వెళ్లి పాల్గొన్నా. 2016 మేలో శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే విశాఖపట్నంలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేశా. 2017 జనవరిలో ముంబైలో జరిగిన 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను 4.55 గంటల్లో పూర్తి చేయగలిగా. అప్పుడు నాకు నమ్మకం బాగా పెరిగింది. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 55 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్‌లో రెండో స్థానం సాధించా. వీటన్నింటి తర్వాత నా దృష్టి విదేశాల్లో జరిగే మారథాన్లపై పడింది. మేజర్ మారథాన్లలో పాల్గొంటూ.. జర్మనీలోని బెర్లిన్, అమెరికాలో బోస్టన్, షికాగో, న్యూయార్క్, లండన్, జపాన్‌లోని టోక్యోలో అంతర్జాతీయ మారథాన్లు జరుగుతాయి. విపరీతమైన వేడి ఉండే దుబాయ్ మారథాన్‌లో ఐదు గంటలపాటు పరిగెత్తాను. ఉక్కపోతతో పరుగు తీయడం కష్టంగా మారినా లక్ష్యాన్ని చేరుకున్నా. 2018 నుంచి 2019లోపు వరల్డ్ మేజర్ మారథాన్‌లైన బెర్లిన్, బోస్టన్, షికాగో, న్యూయార్క్ మారథాన్లలో దిగ్విజయంగా పరుగులు పెట్టా. ఇటీవల లండన్‌లో జరిగిన మారథాన్‌లో 42.6 కిలోమీటర్లను ఐదు గంటల 15 నిమిషాల్లో చేరా. జపాన్‌లోని టోక్యోలో జరిగే మారథాన్‌లో పాల్గొంటే నా కల పూర్తిగా సాకారమవుతుంది. వరంగల్లోనూ మారథాన్ నిర్వహించేలా పరుగు కోసం చాలా సమయం కేటాయించాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు మారథాన్‌లో పాల్గొనడంపై దృష్టి సారించా. హైదరాబాద్ రన్నర్స్ ఏటా మారథాన్ నిర్వహిం చినట్టుగా వరంగల్‌తోపాటు భూపాలపల్లిలోనూ 5కే, 10కే రన్ నిర్వహించాలనుకుంటున్నా. టోక్యో లో మారథాన్ పూర్తిచేశాకే దీనిపై దృష్టిసారించి యువతకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తా. -
అంతరిక్షంలో 42 కిలోమీటర్ల పరుగు పందెం!
లండన్: బ్రిటన్ వ్యోమగామి టిమ్ పీక్ రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో 42 కిలోమీటర్ల మారథాన్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. తాను చేసిన ఈ సాహసాన్ని లండన్‌లో పలువురు ప్రత్యక్షంగా వీక్షించారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ రికార్డు నమోదైంది. బ్రిటిష్ యూరోపియన్ ఎజెన్సీకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. మొత్తం ఆరు నెలల కార్యక్రమం కోసం ఈ స్టేషన్ కు వెళ్లిన టిమ్ ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఒక ట్రెడ్ మిల్ ను ఏర్పాటుచేసుకొని ఈ మారథాన్ ప్రారంభించాడు. మొత్తం 3గంటల 35 నిమిషాల్లో ఈ మారథాన్ పూర్తి చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలో ఈ రికార్డు భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరిట ఉంది. ఆమె బోస్టన్ మారథాన్ పేరిట 2007లో ఇదే లక్ష్యాన్ని 4 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశారు. కాగా, టిమ్ మాత్రం లండన్ మారథాన్ పేరిట ఈ పరుగును పూర్తి చేసి గిన్నిస్ కు చేరారు. అసలు గ్రావిటీ ఏమాత్రం ఉండని కక్షలో ఉండి ఇంత వేగంగా మారథాన్ పూర్తి చేయడం నిజంగా ఒక ప్రపంచ రికార్డు అని గిన్నిస్ వరల్డ్ తెలిపింది. ఈ 44 ఏళ్ల మారథాన్ వీరుడు.. భూమిపై ఉన్న 39 వేలమంది మారథాన్ పోటీ దారుల్లో ఒకరు కూడా.