
ఏప్రిల్ 27న ముహూర్తం
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ పరుగు ప్రపంచ రికార్డు కొల్లగొట్టనుంది. రికార్డు స్థాయిలో అథ్లెట్లు లండన్ మారథాన్ రేసును పూర్తి చేస్తారనే అంచనాలు అమాంతం పెరిగాయి. వచ్చే నెల 27న లండన్ నగరంలో జరిగే ఈ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పరుగులో పోటీపడేందుకు ఇప్పటికే 8 లక్షల 40 వేల మందికిపైగా ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ ఈవెంట్‌లో 5,78,304 రన్నర్లకంటే ఇది చాలా అధికం. పురుషులతో దీటుగా మహిళా రన్నర్లు ఆసక్తి చూపడం విశేషం.
8 లక్షల 40 వేల ఔత్సాహికుల్లో 49 శాతం మహిళలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సున్న యువతులు ఏకంగా 105 శాతం పెరగడం విశేషం! ఇప్పటివరకు పూర్తి మారథాన్ పరుగు దూరాన్ని 55,646 మంది పూర్తి చేశారు. గత నవంబర్‌లో న్యూయార్క్ మారథాన్‌లో ఈ రికార్డు నమోదైంది.
అయితే ఈసారి సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది బరిలో దిగడానికి ఆసక్తి చూపడంతో పూర్తి చేసేవారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే పెరుగుతుందని నిర్వాహకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఏప్రిల్ 27న జరిగే 45వ లండన్ మారథాన్ కొత్త మైలురాయికి చేరుకోబోతోంది. అత్యధిక సంఖ్యలో పరుగును పూర్తిచేసే రికార్డు సాకారం కానుంది. ఇదే జరిగితే ముమ్మాటికి మా మారథాన్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది’ అని లండన్ మారథాన్ ఈవెంట్స్ సీఈఓ హ్యూజ్ బ్రాషెర్ తెలిపారు.
నగరంలోని గ్రీన్‌విచ్ నుంచి ద మాల్ వరకు సాగే 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఈసారి 56 వేల పైచిలుకు మంది పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. 1981లో లండన్ మారథాన్ మొదలైంది. ఆ ఏడాది తొలి మారథాన్‌లో ఏకంగా 13 లక్షల మంది బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment