
డబ్ల్యూటీటీ ట్యూనిస్ కంటెండర్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సొంతం
ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీపై విజయం
ట్యూనిస్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నీలో భారత్‌కు చెందిన మనుశ్ షా–దియా చిటాలె జోడీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో మనుశ్–దియా ద్వయం 11–9, 5–11, 14–12, 3–11, 11–6తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ సొరా మత్సుషిమా–మివా హరిమోటో (జపాన్) జోడీని బోల్తా కొట్టించింది. 37 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో కీలకదశలో భారత జోడీ పైచేయి సాధించింది.
సొంత సర్వీస్‌లో 22 పాయింట్లు నెగ్గిన దియా–మనుశ్... ప్రత్యర్థి సర్వీస్‌లోనూ 22 పాయింట్లు సాధించారు. విజేతగా నిలిచిన మనుశ్–దియాలకు 2,500 డాలర్ల (రూ. 2 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్‌లో 11వ స్థానంలో ఉన్న మనుశ్–దియా ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగింది. తొలి రౌండ్‌లో దియా–మనుశ్ 11–6, 11–5, 11–5తో సన్ యాంగ్–హు యి (చైనా)లపై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 2–11, 16–18, 11–2, 11–4తో సత్యన్ జ్ఞానశేఖరన్–ఆకుల శ్రీజ (భారత్)లపై, సెమీఫైనల్లో 11–4, 11–5, 11–6తో వసీమ్ ఇసిద్ (ట్యూనిషియా)–హనా గొడా (ఈజిప్ట్)లపై విజయం సాధించారు.