
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్‌హాల్–లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది.
ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్..
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్‌ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు.
పోరాడి ఓడిన శ్రీజ
మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.