Table tennis
-
తెలంగాణ టీటీ జట్టుకు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్‌లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు. మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్‌మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
మనిక బత్రాకు నిరాశ
వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్స్ ఫ్రాంక్ఫర్ట్ టోర్నీలో భారత స్టార్ మనిక బత్రా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. జర్మనీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ్రçపపంచ 26వ ర్యాంకర్ మనిక 6–11, 11–13, 6–11తో పదో ర్యాంకర్ షిన్ యుబిన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మనిక తన సర్వీస్‌లో 14 పాయింట్లు్ల గెల్చుకుంది. మనికకు 4,250 డాలర్ల (రూ. 3 లక్షల 57 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత పురుషుల టీటీ జట్టుకు కాంస్యం
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2021, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టుకు కాంస్య పతకాలు లభించాయి. కజకిస్తాన్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 0–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శరత్ కమల్ 7–11, 10–12, 9–11తో లిన్ యున్ జు చేతిలో... రెండో మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 9–11, 11–8, 3–11, 11–13తో చెంగ్ జుయ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 9–11, 7–11తో హువాంగ్ యాన్ చెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. నేటి నుంచి మొదలయ్యే వ్యక్తిగత విభాగంలో శరత్ కమల్, సత్యన్, హర్మీత్, మనుష్ షా, మానవ్ ఠక్కర్, ఆకుల శ్రీజ, మనిక బత్రా, ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ, దియా పరాగ్ పోటీపడతారు. -
వరుసగా మూడోసారి భారత పురుషుల టీటీ జట్టుకు పతకం ఖరారు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1తో ఆతిథ్య కజకిస్తాన్ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది. కజకిస్తాన్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్ 11–9, 11–7, 11–6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌లో కుర్మంలియెవ్ 11–6, 11–5, 11–8తో హర్మత్ దేశాయ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 12–10తో కెంజిగులోవ్పై గెలిచాడు. నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 7–11, 11–8, 11–8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
64 ఏళ్ల తర్వాత...
అస్తానా (కజకిస్తాన్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్íÙప్లో పెను సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, గత ఏడాది రన్నరప్ దక్షిణ కొరియా జట్టును భారత బృందం బోల్తా కొట్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–2తో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘డబుల్స్ స్పెషలిస్ట్’ ఐహిక ముఖర్జీ రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్ బెర్త్ పొందిన భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖరారైంది. భారత మహిళల జట్టు ఏకైకసారి 1960లో ముంబై ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 64 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. ఆసియా టీటీ సమాఖ్య ఆధ్వర్యంలో 1952 నుంచి 1970 వరకు ఆసియా చాంపియన్‌షిప్ జరగ్గా... 1972 నుంచి కొత్తగా ఏర్పడిన ఆసియా టీటీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇద్దరు మేటి ర్యాంకర్లపై గెలిచి... ప్రపంచ 8వ ర్యాంకర్ షిన్ యుబిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 92వ ర్యాంకర్ ఐహిక 11–9, 7–11, 12–10, 7–11, 11–7తో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ మనిక బత్రా 12–14, 13–11, 11–5, 5–11, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీను ఓడించి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ 6–11, 10–12, 8–11తో ప్రపంచ 49వ ర్యాంకర్ లీ యున్‌హై చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 4–11, 11–6, 11–7, 10–12తో షిన్ యుబిన్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 7–11, 11–6, 12–10, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. -
ఫైనల్లో దబంగ్ ఢిల్లీ
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఢిల్లీ 8–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్‌తో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. తొలి పురుషుల సింగిల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 1–2 (4–11, 11–5, 5–11)తో లిలియాన్ బార్డెట్ చేతిలో ఓడిపోగా, మహిళల సింగిల్స్‌లో ఒరవన్ పరనగ్ 3–0 (11–7, 11–9, 11–9)తో బెర్నడెట్ సాక్స్‌పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఒరవన్–సత్యన్ జోడీ 0–3 (9–11, 7–11, 9–11)తో బెర్నడెట్ సాక్స్–మానుశ్ షా ద్వయం చేతిలో ఓడింది. రెండో పురుషుల సింగిల్స్‌లో అండ్రియస్ లెవెంకొ 2–1 (11–8, 10–11, 11–8)తో మానుశ్ షాపై గెలుపొందాడు. గేమ్‌ల పరంగా ఇరుజట్ల స్కోరు 6–6తో సమం కాగా కీలకమైన రెండో మహిళల సింగిల్స్‌లోకి దిగిన ఢిల్లీ ప్లేయర్ దియా చిటాలే వరుస గేమ్‌లు గెలిచి జట్టును గెలిపించింది. ఆమె 2–0 (11–8, 11–4)తో రీత్ రిష్యాపై నెగ్గడంతో దబంగ్ ఢిల్లీ విజయం ఖాయమైంది. -
శరత్ కమల్ గెలిచినా... గోవా చేతిలో చెన్నై ఓటమి
చెన్నై: అల్ట్మేట్లో టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో గోవా చాలెంజర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 9–6తో చెన్నై లయన్స్‌పై గెలుపొందింది. సొంతగడ్డపై శరత్ కమల్ 2–1 (11–6, 11–10, 6–11)తో మిహయి బొబోసికాపై గెలుపొందినప్పటికీ సహచరుల వైఫల్యంతో చెన్నైకి నిరాశ తప్పలేదు.మహిళల సింగిల్స్‌లో సకుర మొరి 2–1 (11–9, 11–9, 9–11)తో యాంగ్జీ లియూ (గోవా)పై గెలిచి చెన్నై ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో చెన్నై ప్లేయర్లు వరుసగా ఓడిపోయారు. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హరి్మత్ దేశాయ్ (గోవా) 2–1 (6–11, 11–7, 11–5)తో జులెస్ రోలండ్పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో శరత్–సకుర జోడీ 0–3 (9–11, 10–11, 7–11)తో హరి్మత్ దేశాయ్–యాంగ్లీ లియూ (గోవా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మహిళల సింగిల్స్‌లో యశస్విని ఘోర్పడే (గోవా) 2–1 (11–5, 11–8, 3–11)తో మౌమ దాస్‌పై గెలుపొందడంతో చెన్నై ఓటమిపాలైంది. మరో పోరులో బెంగళూరు స్మాషర్స్ 9–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్ (బెంగళూరు) 1–2 (9–11, 10–11, 11–10)తో లిలియన్ బార్డెట్ చేతిలో, మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా (బెంగళూరు) 1–2 (11–7, 9–11, 7–11)తో బెర్నడెట్ సాక్స్ చేతిలో కంగుతిన్నారు. తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ అల్వరొ రొబెల్స్–మనిక జోడీ 1–2 (3–11, 11–7, 8–11)తో మనుశ్ షా–బెర్నాడెట్ సాక్స్ జంట చేతిలో ఓడిపోయింది. ఈ దశలో పురుషుల సింగిల్స్‌లో అల్వరో రొబెల్స్ (బెంగళూరు) 3–0 (11–8, 11–7, 11–8)తో మనుశ్ షాపై, మహిళల సింగిల్స్‌లో లిలి జాంగ్ (బెంగళూరు) 3–0 (11–5, 11–8, 11–10)తో క్రిత్విక సిన్హా రాయ్‌లపై ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా గెలుపొందడంతో బెంగళూరు విజయం సాధించింది. -
US Open: ప్రిక్టార్టర్స్లో కోకో గాఫ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ 3–6, 6–3, 6–3తో 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఏడో సీడ్ పౌలా కిన్వెన్ జెంగ్ (చైనా), 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్వెన్ జాంగ్ 6–2, 6–1తో జూలీ నెమియర్ (జర్మనీ)పై, పౌలా బదోసా 4–6, 6–1, 7–6 (10/8)తో ఎలెనా రూస్ (రొమేనియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో గత ఏడాది రన్నరప్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–3, 7–5తో సాండెర్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీపై విజయం సాధించింది. చెన్నైపై యు ముంబా పైచేయి చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో భాగంగా సీనియర్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మానవ్ ఠక్కర్ విజయం సాధించాడు. దీంతో మానవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యు ముంబా టీటీ జట్టు 8–7తో చెన్నై లయన్స్‌పై గెలిచింది. ఈ ఫలితంతో యు ముంబా టీటీ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.‘టై’లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో మానవ్ 6–11, 11–8, 11–9తో శరత్ కమల్‌పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మానవ్–మారియా జంట 11–7, 11–10, 11–4తో శరత్–సకురా మోరీ ద్వయంపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అరునా ఖాద్రి 10–11, 11–9, 11–7తో రోలాండ్పై విజయం సాధించగా.. సుతీర్థ ముఖర్జీ 8–11, 10–11, 7–11 సాకురా మోరీ చేతిలో మారియా 10–11, 8–11, 11–10తో మౌమా దాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
UTT 2024: అహ్మదాబాద్‌కు రెండో విజయం
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో కొత్త జట్టు అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ రెండో విజయం అందుకుంది. యు ముంబా టీటీ జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ జట్టు 9-6 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో మనుశ్ షా (అహ్మదాబాద్) 2-11, 9-11, 11-8తో మానవ్ ఠక్కర్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో రీత్ రిష్యా (అహ్మదాబాద్) 5-11, 11-8, 11-7తో సుతీర్థ ముఖర్జీపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో మనుశ్-బెర్నాడెట్ జాక్స్ ద్వయం 11-4, 11-8, 11-8తో మానవ్-మరియా జియో జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో లిలియన్ బార్డెట్ (అహ్మదాబాద్) 5-11, 11-9, 9-11తో ఖాద్రీ అరునా చేతిలో ఓటమి చవిచూశాడు. ఐదో మ్యాచ్‌లో బెర్నాడెట్ జాక్స్ 9-11, 11-4, 11-6తో మరియా జియోపై గెలిచి అహ్మదాబాద్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం అహ్మదాబాద్ జట్టు 24 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. టేబుల్ టెన్నిస్‌కు అర్చన కామత్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు ఆమె వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని కామత్ కోచ్ అన్షుల్ గార్గ్ ధ్రువీకరించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కామత్ తన కెరీర్ గురుంచి చర్చించినట్లు అన్షుల్ తెలిపాడు. "లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పతకం సాధించడం చాలా కష్టమైన పని నేను కమత్కు చెప్పాను. అందుకోసం తీవ్రంగా శ్రమించివలసి ఉంటుంది. ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు.అయితే గత రెండు నెలల్లో ఆమె చాలా మెరుగుపడింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆమె నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు. అయితే ఏ క్రీడలోనైనా అగ్రశ్రేణి ఆటగాళ్లకు సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. వారికి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది. కానీ యువ ఆటగాళ్లు పరిస్థితి వేరు. వారికి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎవరూ భరోశా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా వారు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కమత్ తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్షుల్ పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో కమత్ పతకం సాధించికపోయినప్పటకి తన పోరాటంతో అందరిని ఆకట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్‌లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే. -
UTT 2024: టీటీ లీగ్‌కు వేళాయె... బరిలో 8 జట్లు
గత నాలుగు సీజన్లుగా భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లకు చక్కని అవకాశాలు కల్పిస్తున్న అల్ట్మేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఫ్రాంచైజీ లీగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో యూటీటీ ఐదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్‌తో పాటు మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్ల మధ్య 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్... 7న జరిగే ఫైనల్స్‌తో ఐదో సీజన్ ముగుస్తుంది. ప్రతి రోజూ రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్‌లను స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సత్తాచాటి మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే పురుషుల కేటగిరీలో హైదరాబాదీ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ సీజన్లో రాణించడం ద్వారా అందరి దృష్టిలో పడేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు.భారత స్టార్ మహిళా ప్లేయర్ మనిక బత్రా బెంగళూరు స్మాషర్స్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైంది. శ్రీజతో పాటు మనిక కూడా పారిస్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌దాకా పోరాడింది. యూటీటీ టోర్నీ సందర్భంగా 29 ఏళ్ల మనిక మాట్లాడుతూ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు ఈ ఫ్రాంచైజీ లీగ్ ఎంతగానో దోహదం చేసిందని చెప్పుకొచ్చింది. ‘వ్యక్తిగతంగా నేను రాణించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడింది. విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడటం ద్వారా మెలకువలు నేర్చుకునేందుకు, దీటుగా పోరాడేందుకు యూటీటీ దోహదం చేసింది. ఈ టోర్నీని ప్లేయర్లంతా ఆస్వాదిస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళల సింగిల్స్‌లో పురోగతికి యూటీటీ కూడా ఒక కారణం. అంతర్జాతీయంగా మన క్రీడాకారిణులు సాధిస్తున్న విజయాలు యూటీటీ చలవే’ అని మనిక తెలిపింది. నిరుటి రన్నరప్ చెన్నై లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట శరత్ కమల్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లు రాటుదేలేందుకు యూటీటీ చక్కని వేదికని అన్నాడు.దీనివల్లే మన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే కాదు... ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాయని చెప్పాడు. మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్, టీమ్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప మైలురాయని శరత్ తెలిపాడు.ఈ టోర్నీలో ఆడటాన్ని అమితంగా ఇష్టపడతానని పేర్కొన్నాడు. పారిస్ మెగా ఈవెంట్లో శరత్‌కు ఊహించని విధంగా తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడిన 42 ఏళ్ల శరత్ రిటైర్మెంట్ అనంతరం అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లే యోచనలో ఉన్నాడు. దీనిపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్యతో పాటు, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. బరిలో ఉన్న జట్లుఅహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్ టీటీ, యూ ముంబా టీటీ. -
యూటీటీ సీజన్‌కు శ్రీజ దూరం
చెన్నై: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్ నుంచి తప్పుకుంది. ఒత్తిడి కారణంగా ఈ నెల 22న ప్రారంభం కానున్న సీజన్‌కు తాను దూరం అవుతున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ టీటీ మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరి ఆకట్టుకున్న 26 ఏళ్ల శ్రీజ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించింది. ‘యూటీటీలో ఆడలేకపోవడం బాధగా ఉంది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రెండుసార్లు జాతీయ చాంపియన్ శ్రీజ పేర్కొంది. లీగ్‌లో శ్రీజ జైపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా ఆమె స్థానంలో ఫ్రాంచైజీ నిత్యశ్రీ మణిని ఎంపిక చేసుకుంది. -
రోబోతో టేబుల్ టెన్నిస్.. ఫిదా చేస్తున్న వీడియో
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టేబుల్ టెన్నిస్ ఆడే రోబోట్ వెలుగులోకి వచ్చింది. ఇది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తోంది. వేగం, సామర్థ్యంలో ఈ రోబోట్.. మనుషులను కూడా మించిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనిస్తే.. టేబుల్ టెన్నిస్ ఆడే రోబో మానవ పోటీదారులు గట్టి పోటీ ఇస్తోంది. సొంతంగా బాల్ పట్టుకోలేదు, సర్వ్ కూడా చేయలేదు. కానీ టేబుల్ టెన్నిస్ ఆడవాళ్లను మాత్రం అవలీలగా ఓడించేస్తోంది. ఈ రోబోట్ మొత్తం 29 మ్యాచ్‌ల సమయంలో 13 మందిని ఓడించి 45 శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఆటగాళ్లతో రోబోట్ కూడా ఓడిపోయింది. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్‌ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
మనిక మెరిసె
పారిస్: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల టీమ్ ఈవెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో రొమేనియా జట్టును బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–అర్చనా కామత్ జోడీ 11–9, 12–10, 11–7తో అదీనా దియకోను–ఎలిజబెటా సమారా (రొమేనియా) జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మనిక 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్టె జాక్స్‌పై గెలిచింది. దాంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమారా చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో అర్చన 5–11, 11–8, 7–11, 9–11తో బెర్నాడెట్టె జాక్స్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మనిక 11–5, 11–9, 11–8తో అదీనా దియకోనుపై గెలిచి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించింది. నేడు అమెరికా, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఆడతుంది. -
Olympics 2024: సరికొత్త చరిత్ర.. క్వార్టర్ ఫైనల్లో భారత్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపె ట్టడం ఇదే తొలిసారి.MANIKA BATRA - The Clutch moment in Table Tennis for India. 🥶 pic.twitter.com/dN3XApe98K— Johns. (@CricCrazyJohns) August 5, 2024ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు గేమ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్‌లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్‌ను లెవెల్ (2-2) చేశారు. చివరి గేమ్‌లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్ఏ, జర్మనీ మధ్య మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాతి రౌండ్లో వీరు ఓడిపోయారు. -
పోరాడి ఓడిన శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌కు చేరిన భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ.. ప్రపంచ నంబర్‌వన్ చేతిలో పోరాడి ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ 10–12, 10–12, 8–11, 3–11తో సన్ యింగ్షా (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్‌ల్లో మొదట ఆధిక్యం కనబర్చిన శ్రీజ.. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయింది. -
మనిక అవుట్... ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 25వ ర్యాంకర్ ఆకుల శ్రీజ 9–11, 12–10, 11–4, 11–5, 10–12, 12–10తో జెంగ్ జియాన్ (సింగపూర్)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజకు గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలక దశల్లో శ్రీజ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో మనిక బత్రా తర్వాత ఒలింపిక్స్ క్రీడల టీటీ పోటీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా తెలంగాణ అమ్మాయి శ్రీజ గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ యింగ్షా (చైనా)తో శ్రీజ తలపడుతుంది. మరోవైపు భారత రెండో ర్యాంకర్ మనిక బత్రా పోరాటం విశ్వ క్రీడల్లో ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారత టీటీ ప్లేయర్‌గా (ఫోటోలు)
-
Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మనిక బత్రా
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు ఆఖర్లో భారత్‌కు ఊరట కలిగించే విజయం దక్కింది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో మనిక బత్రా విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రితిక పవడేపై మనిక 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో గెలుపొంది, రౌండ్ ఆఫ్ 16కు చేరింది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై అయిన తొలి భారత పాడ్లర్‌గా మనిక చరిత్ర సృష్టించింది. రౌండ్ ఆఫ్ 16లో మనిక హాంగ్‌కాంగ్ చైనాకు చెందిన ఝూ చెంగ్ఝూ లేదా జపాన్‌కు చెందిన మియు హిరానోతో తలపడతుంది.HISTORIC MOMENT. 🔥Manika Batra becomes the first Indian Table Tennis player to qualify into R-16 in Olympics history...!!! 👌 pic.twitter.com/Aez0cYRavR— Johns. (@CricCrazyJohns) July 30, 2024కాగా, ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్య సేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత్ కాంస్య పతక రేసులో నిలిచింది. మనూ-సరబ్జోత్ కాంస్య పతకం మ్యాచ్ ఇవాళ (జులై 30) మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగనుంది. -
Paris Olympics 2024: బోణి కొట్టిన మరో తెలుగమ్మాయి
పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ వరుస విజయాలతో శుభారంభం చేసింది. తొలుత బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విజయం సాధించగా.. ఆతర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ బోణి కొట్టింది. సింధు తొలి రౌండ్ మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6 విజయం సాధించగా.. ఆకుల శ్రీజ.. రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన క్రిస్టినా కల్బర్గ్పై 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో నెగ్గి, రౌండ్ ఆఫ్ 32కు క్వాలఫై అయ్యింది. SREEJA AKULA QUALIFIES INTO ROUND OF 32...!!!! 👌- She won the match without losing a single game, What a fantastic performance in Paris Olympics 🔥 pic.twitter.com/uoSxsD6muX— Johns. (@CricCrazyJohns) July 28, 2024సింధు తొలి రౌండ్లో ప్రత్యర్దిపై 29 నిమిషాల్లో జయకేతనం ఎగురవేయగా.. శ్రీజ 30 నిమిషాల్లో ప్రత్యర్దిని చిత్తు చేసింది. సింధు, శ్రీజ తమతమ ప్రత్యర్దులపై వరుస సెట్లలో విజయం సాధించారు. సింధు, శ్రీజ ఇద్దరూ తెలుగమ్మాయిలే కావడం విశేషం. BALRAJ PAWAR INTO QUARTER-FINAL IN ROWING..!!!! 🇮🇳- India continues to have a great time on Day 2 in the Paris Olympics. pic.twitter.com/3y9q7PLWMV— Johns. (@CricCrazyJohns) July 28, 2024మరోవైపు పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో భారత్‌కు చెందిన బల్రాజ్ పన్వర్ విజయం సాధించాడు. ఈ విజయంతో బల్రాజ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్ (631.5) ఫైనల్‌కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా (630.1) ఫైనల్‌కు చేరాడు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన అన్నా హర్సేపై 11-8, 12-10, 11-9, 9-11, 11-5 తేడాతో గెలుపొందింది. పురుషుల టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్లో భారత్‌కు చెందిన శరత్ కమల్ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.పురుషుల టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్‌కు చెందిన సుమిత్ నగాల్ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.భారత మహిళల ఆర్చరీ టీమ్ (అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమార్) క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 0-6 తేడాతో భారత్ ఓటమిపాలైంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో భారత్‌కు చెందిన హెచ్ ఎస్ ప్రణయ్.. జర్మనీకు చెందిన ఫేబియన్ రోథ్పై 21-18, 21-12 తేడాతో గెలుపొందాడు. -
టీటీలో మేటి మనికా..
ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కూల్ దాటి కాలేజ్‌లోకి వచ్చిన తర్వాతా అదే కొనసాగింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం. కానీ టేబుల్ టెన్నిస్ కోసం అర్ధాంతరంగా చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టీనేజ్లోనే పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం ఆమెను సంప్రదించాయి. కానీ టేబుల్ టెన్నిస్ కోసం వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఎందుకంటే ఆమె ధ్యాసంతా ఆటపైనే కాబట్టి! ఒక క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె అన్నింటినీ పక్కన పెట్టింది. కఠిన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఆటలోనే పైకి ఎదిగింది. ఆరంభ అవరోధాలను దాటి కామన్వెల్త్ పతకాల విజేతగా, ఒలింపియన్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో తన పేరు లిఖించుకున్న ఆ ప్యాడ్లరే మనికా బత్రా.29 ఏళ్ల మనికా ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. గత రెండు సందర్భాల్లో తనకు దక్కకుండా పోయిన పతకాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.దాదాపు రెండున్నరేళ్ల క్రితం మనికా బత్రా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా గతంలో ఒలింపిక్స్ ఆడిన భారత ఆటగాళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరచి మూడో రౌండ్ వరకు చేరింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆమెకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ్యాచ్‌లు జరిగే సమయంలో కోర్టు పక్కనుంచి భారత జట్టు కోచ్ సౌమ్యదీప్ రాయ్ సూచనలను తీసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేను అక్కడికి వచ్చేందుకు అధికారులు అంగీకరించకపోగా.. కోచ్ లేకపోయినా ఫర్వాలేదని, అలాగే ఆడతానని ఆమె చెప్పేసింది.అర్జున అవార్డ్ అందుకుంటూ..ఇది టీటీఎఫ్‌ఐకి ఆగ్రహం తెప్పించింది. అందుకే మనికాపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. దాంతో మనికా కోర్టు మెట్లెక్కింది. అంతటితో ఆగిపోకుండా తన నిరసనకు కారణాన్ని కూడా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా సౌమ్యదీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుతీర్థ ముఖర్జీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తనను మ్యాచ్ ఓడిపొమ్మని చెప్పాడంటూ బయటపెట్టింది. షోకాజ్ నోటీసుతో తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది.చివరకు కోర్టు మనికా ఆవేదనను అర్థంచేసుకుంది. టీటీఎఫ్ఐలో పూర్తి ప్రక్షాళన కార్యక్రమం జరిగి అధికారులు మారాల్సి వచ్చింది. సాధారణంగా అగ్రశ్రేణి ప్లేయర్లు ఏ ఆటలోనైనా జాతీయ సమాఖ్యతో గొడవకు దిగరు. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే, రాజీ మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కెరీర్లో అగ్రస్థానానికి ఎదుగుతున్న దశలో ఒక 27 ఏళ్ల ప్లేయర్ అధికారులతో తలపడింది. ఇది టీటీ కోర్టు బయట ఆమె పోరాటానికి, ధైర్యానికి సంకేతం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు మాత్రమే కాదు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తాను నిలబడగలననే ధైర్యాన్ని ఆమె చూపించింది.కుటుంబసభ్యుల అండతో..ఢిల్లీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మనికా. ముగ్గురు సంతానంలో ఆమె చిన్నది. అన్న సాహిల్, అక్క ఆంచల్ టేబుల్ టెన్నిస్ ఆడటం చూసి నాలుగేళ్ల వయసులో తాను కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. చాలామంది ప్లేయర్ల తరహాలోనే ఒకరిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటే ఇతర కుటుంబసభ్యులు వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడపడం, తాము తెర వెనక్కి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే. మనికా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది.తల్లి సుష్మతో..ఆమె ఆటను మొదలుపెట్టినప్పుడు అందరిలాగే సరదాగా ఆడి ముగిస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో దానికి మించి అపార ప్రజ్ఞ ఉన్నట్లు కోచ్‌లు చెప్పడంతోనే కుటుంబ సభ్యులకు అర్థమైంది. ఆ తర్వాత మనికా విషయంలో మరో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. అక్క ఆంచల్ కూడా ఆటపై తనకున్న పరిజ్ఞానంతో చెల్లికి మెంటార్‌గా మారి నడిపించింది. రాష్ట్రస్థాయి అండర్–8 టోర్నీ మ్యాచ్‌లో ఆ చిన్నారి ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా తన మార్గనిర్దేశనంతో శిక్షణకు తీసుకోవడంతో ఆటలో మనికా ప్రస్థానం మొదలైంది.అగ్రస్థానానికి చేరి..‘బ్యాడ్మింటన్‌లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు భారత ఆటగాళ్లు అంతంత మాత్రమే ప్రదర్శన కనబరచారు. కానీ సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో దాని స్థాయిని పెంచారు. మన దేశంలో బ్యాడ్మింటన్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నేనూ అదే చేయాలనుకుంటున్నా. టీటీకి చిరునామాగా మారి మన దేశంలో ఆటకు ఆదరణ పెంచాలనేదే నా లక్ష్యం’ అని మనికా చెప్పింది.నిజంగానే భారత టీటీకి సంబంధించి ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. మరో మహిళా ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. శాఫ్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీల్లో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా 24వ స్థానానికి చేరుకొని ఆమె భారత్ తరఫున కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెకు ముందు ఎవరూ కూడా మహిళల సింగిల్స్‌లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించలేదు.2018, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్‌తో.., 2018, ఐఐటీఎఫ్ ‘ద బ్రేక్‌త్రూ స్టార్’ అవార్డ్‌తో..పతకాల జోరు..అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో మనికా అత్యుత్తమ ప్రదర్శన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కనబడింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేర్వేరు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణం గెలుచుకున్న ఆమె.. మహిళల డబుల్స్‌లో రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం అందుకుంది.అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. డబ్ల్యూటీటీ టోర్నీల్లోనైతే ఆమె ఖాతాలో పలు సంచలన విజయాలు నమోదయ్యాయి. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2, మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)పై సాధించిన గెలుపు వాటిలో అత్యుత్తమైంది.మూడో ప్రయత్నంలో..మనికా బత్రా తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఆమె ఘనతలకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అర్జున, ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఒకప్పుడు మోడలింగ్ వద్దనుకున్న ఆమె ఇప్పుడు టీటీలో స్టార్‌గా ఎదిగిన తర్వాత అలాంటివాటిలో చురుగ్గా భాగమైంది. ప్రఖ్యాత మేగజీన్ ‘వోగ్’ తమ కవర్‌పేజీలో మనికాకు చోటు కల్పించి అటు గేమ్ ప్లస్ ఇటు గ్లామర్ కలబోసిన ప్లేయర్ అంటూ కథనాలు ప్రచురించింది.ఇతర ఫొటోషూట్ల సంగతి సరేసరి. కెరీర్లో ఎన్నో సాధించిన ఆమె ది బెస్ట్ కోసం చివరి ప్రయత్నం చేస్తోంది. 21 ఏళ్ల వయసులో తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మనికా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకుండా అనుభవం మాత్రమే సాధించి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతో మూడో రౌండ్‌కి చేరింది. ఇప్పుడు మరింత పదునెక్కిన ఆటతో చెలరేగితే పారిస్ ఒలింపిక్స్‌లో పతకం దక్కవచ్చు. ఈ లక్ష్యాన్ని మనికా అందుకోవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
జైపూర్ పేట్రియాట్స్ జట్టులో ఆకుల శ్రీజ, స్నేహిత్... ఆగస్టులో యూటీటీ లీగ్...
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ ఐదో సీజన్ కోసం మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 48 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 16 మంది విదేశీ క్రీడాకారులు. భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీజ గత నెలలో నైజీరియా లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆగస్టు 22 నుంచి సెపె్టంబర్ 7 వరకు చెన్నైలో జరిగే యూటీటీ లీగ్‌లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, పీబీజీ బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్, యు ముంబా జట్లు పాల్గొంటాయి. -
Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్‌ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్‌లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్‌కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్‌లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్‌లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్‌లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్‌లో, సత్యన్ 68వ ర్యాంక్‌లో ఉన్నారు -
భారత నంబర్‌వన్‌గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్‌వన్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్‌లో, అర్చన కామత్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆచంట శరత్ కమల్‌తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో శరత్ కమల్ 37వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్‌లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్‌లో నిలిచాడు. -
WTT Champions Tourney 2024: పోరాడి ఓడిన మనిక
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12–10, 9–11, 6–11, 11–8, 8–11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో కీలక తరుణంలో మనిక తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఓడిన మనిక బత్రాకు 3,500 డాలర్ల (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీజకు సింగిల్స్.. మనుష్–మానవ్‌లకు డబుల్స్ టైటిళ్లు
లెబనాన్‌లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్‌కు చెందిన మనుష్ షా–మానవ్ ఠక్కర్ జోడీ డబుల్స్ టైటిల్ సాధించింది. బీరుట్లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మనుష్–మానవ్ ద్వయం 11–7, 11–5, 9–11, 11–6తో భారత్‌కే చెందిన ముదిత్–ఆకాశ్ పాల్ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్–మనిక బత్రా (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆకుల శ్రీజకు సింగిల్స్ టైటిల్.. ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ అకుల 6-11, 12-10, 11-5, 11-9తో లక్సెంబర్గ్‌కు చెందిన సారా డి నట్టేపై గెలిచి, మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. -
చాంపియన్ ఆకుల శ్రీజ
లెబనాన్‌లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ చాంపియన్‌గా అవతరించింది. బీరుట్లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ 6–11, 12–10, 11–5, 11–9తో సారా డి నుట్టె (లక్సెంబర్గ్)పై గెలిచింది. విజేతగా నిలిచిన శ్రీజకు 550 డాలర్ల (రూ. 46 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ విభాగంలో శ్రీజ–దియా చిటాలె (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. -
సత్యన్‌కు తొలి డబ్ల్యూటీటీ టైటిల్
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ ‘డబ్ల్యూటీటీ’ ఫీడర్ సిరీస్‌లో టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఘనతకెక్కాడు. లెబనాన్‌లోని బీరుట్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం అర్ధరాత్రి ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్యే టైటిల్ పోరు జరిగింది. ఈ టోర్నీలో 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సత్యన్ 3–1 (6–11, 11–7, 11–7, 11–4)తో సహచరుడు, తొమ్మిదో సీడ్ మానవ్ ఠక్కర్‌పై విజయం సాధించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సత్యన్ అంతర్జాతీయ ర్యాంకింగ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. 2021 ఆగస్టులో జరిగిన ఐటీటీఎఫ్ చెక్ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో అతను టైటిల్ గెలిచాడు. మరో వైపు భారత జోడీల మధ్యే జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో దియా చిటాలే–మానుష్ షా ద్వయం విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో దియా– మానుష్ 3–1 (11–6, 10–12, 11–6, 11–6)తో అర్చన కామత్–మానవ్ ఠక్కర్‌లపై గెలుపొందారు. పురుషుల డబుల్స్ తుది పోరులో మానవ్ ఠక్కర్–మానుష్ జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్‌లో నెగ్గగా... తన సరీ్వస్‌లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్‌కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్‌కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
రెండో రౌండ్లో శరత్ కమల్.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైన మనిక
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు.. తొలిసారి ఒలింపిక్స్ అర్హత
భారత టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. పురుషులు, మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్‌లో (2024) పాల్గొనే సువర్ణావకాశం దక్కింది. తాజాగా (మార్చి) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌ను.. మహిళల జట్టు 13వ ర్యాంక్‌ను సాధించి ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి. Indian Men's and Women's Table Tennis teams Qualifies for the Olympics for the first tym ever! The TT March World Team Rankings are out. Men's Team remained at WR15 while Women's team made a jump to WR13. This is Huge. Historic Feat!#Paris2024#TableTennis https://t.co/MBqX417KQQ pic.twitter.com/zV4yhhWZUz — Rambo (@monster_zero123) March 4, 2024 ఇటీవల ముగిసిన ITTF వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో భారత జట్లకు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ప్రపంచ ర్యాంకింగ్ కారణంగా ఒలింపిక్స్ బెర్తులు ఖరారు చేసుకోవడం విశేషం. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 16 స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
ప్రిక్వార్టర్స్‌లో భారత జట్ల ఓటమి
బుసాన్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాయి. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్ దశ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి. ఈ మెగా ఈవెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్ ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్‌లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌లో ఉన్నాయి. చైనీస్ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్ చెన్ జు యుపై సంచలన విజయం సాధించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 10–12, 11–13, 7–11తో జాంగ్ వూజిన్ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్ జాంగ్‌హూన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్ హు చేతిలో ఓటమి పాలయ్యారు. -
నాకౌట్ దశకు భారత టీటీ జట్లు
బుసాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షి ప్లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. గ్రూప్–1లోని చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–2తో స్పెయిన్‌పై గెలిచి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్–3లోని చివరి లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో న్యూజిలాండ్‌ను ఓడించి 6 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. నేడు జరిగే నాకౌట్ దశ రెండో రౌండ్ పోటీల్లో ఇటలీతో భారత మహిళల జట్టు... కజకిస్తాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. క్వార్టర్ ఫైనల్ చేరితే భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. స్పెయిన్‌తో జరిగిన పోటీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత బృందం ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గడం విశేషం. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 9–11, 11–9, 11–13, 4–11తో మరియా జియావో చేతిలో... రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 11–6, 11–8, 9–11, 7–11తో సోఫియా జువాన్ జాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 11–8, 11–13, 11–8, 9–11, 11–4తో ఎల్విరా రాడ్‌పై గెలిచి భారత ఆశలను సజీవంగా నిలిపింది. నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–9, 11–2, 11–4తో మరియా జియావోపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11–6, 11–13, 11–6, 11–3తో సోఫియా జువాన్ జాంగ్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేసింది. -
World Table Tennis ontender Tourney: ముగిసిన శ్రీజ పోరాటం
దోహా: వరల్డ్ టేబుల్ టెన్నిస్ దోహా కంటెండర్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీజ రెండో రౌండ్లో 14–12, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. అయితే మూడో రౌండ్లో శ్రీజ 5–11, 10–12, 9–11తో చెన్ జు యు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో శ్రీజ–యశస్విని ద్వయం 6–11, 7–11, 5–11తో జియాన్ టియాని–చెన్ జింగ్టాన్ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
Table Tennis Player Manika Batra Pics: ఆటలోనే కాదు అందంలోనూ తగ్గేదేలే..(ఫొటోలు)
-
జాతీయ టీటీ విజేత శ్రీజ
సాక్షి, విజయవాడ: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్íÙప్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. టోరీ్నలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజ శనివారం జరిగిన ఫైనల్లో 6–11, 9–11, 11–4, 9–11, 11–7, 12–10, 12–10 (4–3) స్కోరుతో అర్చనా కామత్ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్)పై విజయం సాధించింది. తొలి నాలుగు గేమ్‌లలో మూడు ఓడి 1–3తో వెనుకబడిన శ్రీజ...ఆ తర్వాత చెలరేగి వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకోగలిగింది. 3–3తో సమంగా నిలిచిన తర్వాతి చివరి గేమ్‌లో ఒక దశలో 10–8తో అర్చన విజయానికి చేరువైంది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు సాధించి శ్రీజ మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ)కి టైటిల్ దక్కింది. ఫైనల్లో జి.సత్యన్ (పీఎస్‌పీబీ)ని ఠక్కర్ గెలుపొందాడు. ఐదు గేమ్‌ల తర్వాత 2–3తో వెనుకబడిన తర్వాత ఆరో గేమ్‌లో 0–2 స్కోరు వద్ద వెన్నునొప్పితో సత్యన్ మ్యాచ్‌నుంచి వైదొలిగాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్‌కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్‌లో ఉంది. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
సుతీర్థ–ఐహిక జోడీ ఓటమి
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్ 9–11, 10–12, 5–11తో చైనా దిగ్గజం మా లాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సుతీర్థ 9–11, 6–11, 4–11తో ఒరావన్ పరానాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో... ఐహిక ముఖర్జీ 11–2, 11–6, 8–11, 9–11, 3–11తో చెన్ జింగ్టాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ (భారత్) జోడీ 5–11, 11–13, 10–12తో మాన్యు వాంగ్–చెన్ మెంగ్ (చైనా) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మానవ్ ఠక్కర్–మనుష్ షా (భారత్) జంట 5–11, 3–11, 5–11తో ఫాన్ జెన్‌డాంగ్–లిన్ గావోయువాన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టుకు ఆరో స్థానం లభించింది. -
మనికాకు చేదు అనుభవం.. ఒక్క ట్వీట్‌తో తిరిగొచ్చేలా! థాంక్యూ సర్..
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపింది. తన బ్యాగేజ్‌ను ఇంటికి చేర్చేలా చొరవ తీసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. కాగా పెరూ టోర్నమెంట్లో ఆడిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనిక బత్రా డచ్ విమానయాన సంస్థకు చెందిన కేఎల్ఎమ్ ఎయిర్‌లైన్స్‌లో భారత్‌కు చేరుకుంది. అయితే ఈ విమానంలో తన విలువైన బ్యాగేజ్‌ను మరిచిపోయిన మనిక ఇక్కడికి వచ్చాక సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఆమె.. సాయం చేయాలని కోరుతూ జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేసింది. మనికా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్యాలయం.. ‘‘ఢిల్లీకి రానున్న విమానంలో బ్యాగేజీ ఉంది. రేపు ఉదయం 01:55 నిమిషాలకు కలెక్ట్ చేసుకోవచ్చు’’ అని బుధవారం ట్విటర్ వేదికగా మనికాకు రిప్లై ఇచ్చింది. కాగా డచ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన తాను బ్యాగేజీ పోగొట్టుకున్నానని మనిక మంగళవారం ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటూ మనికా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆమెకు ఊరట లభించింది. Thank you so much @JM_Scindia sir and his office for prompt action and helping me in getting my baggage. I have received it this morning. https://t.co/XBVeQIApXO — Manika Batra (@manikabatra_TT) August 9, 2023 -
ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను శుక్రవారం ప్రకటించారు. 10 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లకు ఆచంట శరత్ కమల్, మనిక బత్రా సారథ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్ జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, మహారాష్ట్ర ప్లేయర్ సానిల్ షెట్టి రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్ సెపె్టంబర్ 3 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో... ఆసియా క్రీడల టీటీ ఈవెంట్ చైనాలోని హాంగ్జౌలో సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. భారత టీటీ జట్లు: పురుషుల టీమ్ విభాగం: ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా. రిజర్వ్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, సానిల్ శెట్టి. మహిళల టీమ్ విభాగం: మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియా చిటాలె. రిజర్వ్: అర్చన కామత్, రీత్ రిష్యా. పురుషుల డబుల్స్: శరత్ కమల్–సత్యన్; మానవ్–మనుష్. మహిళల డబుల్స్: సుతీర్థ–అహిక ముఖర్జీ; శ్రీజ–దియా. మిక్స్డ్ డబుల్స్: మనిక– సత్యన్; శ్రీజ–హర్మీత్ దేశాయ్. ఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌధరీ (భారత్) ద్వయం 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్‌టెడ్–మంచాయ సావంగ్కెవ్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సహజ 0–6, 6–1, 6–1తో లీ జాంగ్ సియో (కొరియా)పై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
సంచలనం సృష్టించిన భారత జోడీ.. వరల్డ్ టైటిల్ సొంతం
ట్యూనిస్ (ట్యూనిషియా): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జోడీ సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సుతీర్థ–ఐహిక ద్వయం మహిళల డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. మియు కిహారా–మివా హరిమోటో (జపాన్) జంటతో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సుతీర్థ–ఐహిక జోడీ 11–5, 11–6, 5–11, 13–11తో నెగ్గింది. విజేతగా నిలిచిన సుతీర్థ–ఐహిక జంటకు 1,000 డాలర్ల (రూ. 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత క్రీడాకారులకు డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ టైటిల్ లభించడం ఇది మూడోసారి. 2019లో మనిక బత్రా–అర్చన కామత్ స్లొవేనియా డబ్ల్యూటీటీ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను... 2021లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ ట్యూనిషియాలో జరిగిన డబ్ల్యూటీటీ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్‌లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
ఆకుల శ్రీజ సంచలనం.. ఒకేసారి మూడు టైటిల్స్
జమ్మూ: తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో టైటిల్స్ సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకోగా... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్బీఐ జట్టు టైటిల్ సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది. టీమ్ ఫైనల్లో ఆర్బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మొహమ్మద్ అలీ–వంశ్ సింఘాల్ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్ చంద్ర–అంకుర్ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్ చెన్–యిది వాంగ్ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
WTT Singapore Smash Tourney 2023: ఆకుల శ్రీజకు నిరాశ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్‌కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. బుధవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 12–10, 6–11, 9–11, 3–11తో జూ చెన్హుయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ సూరావజ్జుల 11–4, 7–11, 10–12, 11–6, 11–8తో జేవియర్ డిక్సన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
సింగపూర్ స్మాష్ టోర్నీలో ఆకుల శ్రీజ ముందంజ
సింగపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’ బెర్త్‌కు విజయం దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–5, 8–11, 11–8, 12–10తో చార్లోటి లుట్జ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జూ చెన్హుయ్తో శ్రీజ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీజ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు చేరుకుంటుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్‌లో ఆసియా కప్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్‌లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్‌లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్‌కుమార్‌కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 6 క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో మనికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అసమాన విజయాలతో సెమీస్ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!
బ్యాంకాక్: ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ చెన్ సు యు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. -
శరత్ కమల్‌కు అరుదైన గౌరవం.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా..!
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డీ ఆచంట శరత్ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీటీఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో శరత్ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్ కావడం విశేషం. 2022–2026 మధ్య నాలుగేళ్ల కాలానికిగాను వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు. మొత్తం 283 మంది అథ్లెట్లు ఓటింగ్‌లో పాల్గొనగా, ఆసియా ఖండం ప్రతినిధిగా శరత్‌కు 187 ఓట్లు లభించాయి. మహిళల కేటగిరీలో ఎంపికైన చైనా ప్యాడ్లర్ ల్యూ షీవెన్‌కు 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తనకు లభించిన ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శరత్ కమల్...ఆసియా ఖండం నుంచి తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ 3 స్వర్ణాలు నెగ్గాడు. నేటి నుంచి ఏషియన్ కప్... బ్యాంకాక్ వేదికగా నేటినుంచి ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఏషియన్ కప్ టోర్నీలో శరత్ కమల్‌తో పాటు మరో భారత టాప్ ఆటగాడు సత్యన్ పాల్గొంటున్నారు. అయితే వీరిద్దరికీ కఠిన ‘డ్రా’ ఎదురైంది. తొలి పోరులో తమకంటే మెరుగైన ర్యాంక్‌ల్లో ఉన్న చువాంగ్ చి యువానా (చైనీస్ తైపీ)తో శరత్ తలపడనుండగా, యుకియా ఉడా (జపాన్)ను సత్యన్ ఎదుర్కొంటాడు. -
National Games 2022: తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
పికిల్‌బాల్ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్!
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా క్రీడలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.యూరోపియన్ దేశాల్లో ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ ఉంటే.. ఆసియా ఖండంలో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక అమెరికా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రగ్బీ, బాస్కెట్‌బాల్ క్రీడలకు ఉండే ఆదరణ గురించి చెప్పనవసరం లేదు. మొత్తానికి ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ సహా ఇతర క్రీడలు ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్నాయి. అయితే మనకు తెలియని క్రీడలు చాలానే ఉన్నాయి. ఒక క్రీడాభిమానిగా వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం తప్పకుంటా ఉంటుంది. తాజాగా అమెరికాలో పికిల్‌బాల్ అనే క్రీడకు ప్రస్తుతం యమా క్రేజ్ ఉంది. అక్కడ ఇప్పుడు పికిల్‌బాల్ దూసుకెళ్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఈ పికిల్‌బాల్ క్రీడపై విపరీతమైన ఆదరణ కనబరుస్తున్నారు. పికిల్‌బాల్ చూడడానికి అచ్చం టెన్నిస్ ఆటలాగే ఉన్నప్పటికి ఇందులో ఉండే రూల్స్ వేరు. బంతి కొట్టే విధానం నుంచి బ్యాట్ పట్టుకునే విధానం వరకు.. షాట్స్, సర్వ్ చేసే తీరులో కూడా చాలా మార్పులు ఉన్నాయి. అసలు పికిల్‌బాల్ అంటే ఏంటి? పికిల్‌బాల్ ఇప్పుడు పుట్టిన క్రీడ మాత్రం కాదు. చాలా ఏళ్ల క్రితమే అమెరికాలోని వాషింగ్టన్లో ఉండే బెయిన్‌బ్రిడ్జ్ ఐలాండ్‌కు చెందిన ఒక కుటుంబం పికిల్‌బాల్‌ను కనిపెట్టింది. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కలగలిపి ఆడే క్రీడ పికిల్‌బాల్. కాగా పికిల్‌బాల్ కోర్టు టెన్నిస్ కోర్టు కంటే కాస్త చిన్నగా ఉంటుంది. పాడిల్ రూపంలో రాకెట్.. బంతి చుట్టూ హోల్స్.. పికిల్ బాల్ స్పోర్ట్స్‌ను ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్‌లో ఆడే అవకాశం ఉంటుంది. టెన్నిస్ రాకెట్లా కాకుండా పాడిల్‌ను(చిన్న రాకెట్) ఉపయోగిస్తారు. ఇక ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే పికెల్ బాల్‌పై చుట్టూ హోల్స్ ఉంటాయి. ఈ రెండింటితో పాటు నెట్, మంచి గ్రౌండ్ అందుబాటులో ఉండాల్సిందే. ఇక పికిల్‌బాల్ కోర్ట్ డబుల్స్ బ్యాడ్మింటన్ కోర్ట్‌తో సమానంగా ఉంటుంది. 20×44 అడుగుల కొలతలు కలిగి ఉంటుంది. నికర ఎత్తు సైడ్‌లైన్‌లో 36 అంగుళాలు..మధ్యలో 34 అంగుళాలు పొడవు. కోర్ట్ టెన్నిస్ కోర్ట్ లాగా కుడి, ఎడమ సర్వీస్ కోర్ట్లతో పాటు నెట్ ముందు 7-అడుగుల నాన్-వాలీ జోన్ కలిగి ఉంటుంది. పికిల్‌బాల్ రూల్స్.. ఆడే విధానం: ►అండర్హ్యాండ్ సర్వ్‌ని మాత్రమే ఉపయోగించాలి ►సర్వ్, రిటర్న్ ఆఫ్ సర్వ్ రెండూ తప్పనిసరిగా బౌన్స్ కావాలి. ►సర్వ్ చేజే జట్టు మాత్రమే పాయింట్లను స్కోర్ చేయగలదు. ►పాయింట్ గెలిచిన తర్వాత సర్వ్ చేసే బృందం తప్పనిసరిగా తమ దిశను మార్చుకోవాలి ►సర్వర్ చేయడానికి ముందు సర్వర్ బిగ్గరగా స్కోర్‌ని పిలవాలి ►నాన్-వాలీ జోన్‌తో సంప్రదింపులు జరుపుతున్నప్పుడు వాలీలు అనుమతించబడవు. ►నాన్-వాలీ జోన్లో పికిల్‌బాల్ బౌన్స్ అయిన తర్వాతే షాట్లు కొట్టడానికి అనుమతి ఉంటుంది ►పికిల్‌బాల్ ఎక్కడా తగిలినా (మణికట్టు క్రింద కాకుండా)..అప్పుడు ర్యాలీని కోల్పోయే అవకాశం ఉంటుంది. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు. -
తెలంగాణకు కాంస్య పతకం
సూరత్: అధికారికంగా జాతీయ క్రీడలు ఇంకా ప్రారంభంకాకముందే తెలంగాణ జట్టు పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో జాతీయ సింగిల్స్ చాంపియన్ ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనిక మనోహర్ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో తెలంగాణ 0–3తో పశ్చిమ బెంగాల్ చేతిలో... తమిళనాడు 1–3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 7–11, 11–13, 4–11తో సుతీర్థ ముఖర్జీ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 9–11, 11–7, 11–13, 11–9, 12–14తో ఐహిక ముఖర్జీ చేతిలో... మూడో మ్యాచ్‌లో నిఖత్ బాను 10–12, 8–11, 4–11, 13–11, 9–11తో మౌమా దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ 3–1తో మహారాష్ట్రను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగా, మహారాష్ట్ర రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్, ఫారూఖి, వరుణ్ శంకర్‌లతో కూడిన తెలంగాణ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ 3–0తో ఢిల్లీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. అయితే భారత టీటీ జట్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు చైనాలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో జాతీయ క్రీడల నిర్వాహకులు టీటీ ఈవెంట్‌ను ముందస్తుగా నిర్వహిస్తున్నారు. -
టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లో తెలంగాణ
గుజరాత్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్ సభ్యులుగా ఉన్న తెలంగాణ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. హరియాణా, గుజరాత్ జట్లపై 3–1తో నెగ్గిన తెలంగాణ 0–3తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. జాతీయ క్రీడలు ఈనెల 29 నుంచి జరగనున్నాయి. అయితే అవే తేదీల్లో భారత జట్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో టీటీ ఈవెంట్‌ను ముందుగా నిర్వహిస్తున్నారు. -
భారత జోడీకి స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి సారి స్వర్ణ పతకం లభించింది. లావోస్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో జూనియర్ మిక్స్డ్ డబుల్స్‌లో పాయస్ జైన్–యశస్విని జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాయస్–యశస్విని ద్వయం 11–9, 11–1, 10–12, 7–11, 11–8తో హాన్ జిన్యువాన్–కిన్ యుజువాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. అండర్–19 బాలుర డబుల్స్‌లో, అండర్–19 బాలికల సింగిల్స్‌లో, అండర్–19 బాలుర టీమ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి. -
మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్లకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశ్ ప్లేయర్స్‌పై నిషేధం
కామన్వెల్త్ గేమ్స్ లాంటి కీలకమైన ఈవెంట్లో మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులపై ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేధం విధించింది. సోనమ్ సుల్తానా సోమా, సాదియా అక్తర్ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్ టీటీ ప్లేయర్లు.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆగస్ట్ 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్, మిక్సడ్ డబుల్స్) పాల్గొనాల్సి ఉండింది. అయితే ఈ జోడీ క్యాంప్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్ సమయానికి కనిపించకుండా పోయారు (బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పేర్కొన్నారు). దీంతో ప్రత్యర్ధులకు బై లభించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రీడల సమాఖ్య.. దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు డొమెస్టిక్ సర్క్యూట్‌కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
World table tennis: సింగిల్స్ విజేత హన్సిని
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టీటీ టోర్నీలో భారత క్రీడాకారిణులు అదరగొట్టారు. మూడు సింగిల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకున్నారు. ఈక్వెడార్‌లో జరిగిన ఈ టోర్నీలో తమిళనాడుకు చెందిన హన్సిని మథన్ రాజన్ అండర్–13 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో హన్సిని 11–7, 11–8, 11–7తో మరియానా రోడ్రిగెజ్ (ఈక్వెడార్)పై గెలిచింది. అండర్–19 బాలికల సింగిల్స్ విభాగంలో యశస్విని, అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో సుహానా సైనీ కూడా టైటిల్స్ సాధించారు. -
నైనా జైశ్వాల్‌ను వేధించిన పోకిరి అరెస్ట్
హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ను గత కొంతకాలంగా వేధిస్తున్న శ్రీకాంత్ అనే పోకిరీని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా నైనా జైశ్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య మెసేజ్‌లు పోస్ట్ చేసి శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ మేరకు శ్రీకాంత్ అనే యువకుడ్ని హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే గతంలో సిద్ధిపేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నైనా జైశ్వాల్‌కు మరోసారి అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. దాంతో నైనా జైశ్వాల్ తండ్రి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకుడ్ని అరెస్ట్ చేశారు. -
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్‌కు వేధింపులు
-
నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్న ఆకతాయి
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, విద్యావేత్త నైనా జైస్వాల్ సోషల్ మీడియా నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి పదే పదే మెసేజ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నైనా జైస్వాల్ తండ్రి అశ్విన్ జైస్వాల్ హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. పీజీ పూర్తి చేసిన శ్రీకాంత్ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం నైన జైస్వాల్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో మెసేజ్‌లు చేశాడు. ఆ మెసేజ్‌లు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఆమె శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పలు పేర్లతో ఫేక్ ఖాతాలు సృష్టించి నైనా పోస్ట్ చేసిన పోస్టులకు అసభ్య కామెంట్లు పెడుతున్నాడు. దీనిపై అప్పట్లో తండ్రి అశ్విన్జైస్వాల్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్, అతని తండ్రిని, సోదరుడిని పిలిచిన పోలీసులు రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత ట్విట్టర్ అకౌంట్స్ సుమారు 30–50 క్రియేట్ చేసి కామెంట్ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో మరోమారు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి శ్రీకాంత్ అరెస్టు చేసినట్టు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా.. చదువుల తల్లిగానూ పేరొందింది. 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తద్వారా ఆసియాలోనే పిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఘనత దక్కించుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గానూ రాణిస్తున్న నైనా జైశ్వాల్ ఇటీవలే తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీలో చేరగా.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది. చదవండి: Chess Olympiad 2022: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
కామన్వెల్త్ గేమ్స్ హీరో శరత్ కమల్‌కు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం ఏంటి..?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్‌కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్‌గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్‌హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్‌లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్. మచిలీపట్నంలో జననం తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్‌తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మెరికల్లాంటి శిష్యులు శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్‌ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్‌లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు. మలుపు తిప్పిన చైన్నె శ్రీనివాసరావుకు చైన్నె ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్‌తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్‌గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్ఐఎస్లో కోచ్‌గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు. -
commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’
శరత్ కమల్ తొలి కామన్వెల్త్ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్‌హామ్ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్‌డ్‌లో ఇంకా ఫైనల్ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్ అయిన ఆయన ప్రతీ మ్యాచ్‌లో, ప్రతీ పాయింట్‌కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. చివరకు నేను పాయింట్ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్ అన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడాను. నా కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌కు శరత్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా శరత్ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్డ్ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’ -
Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్’ కాలం
2006 – మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు – టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్జెల్పై విజయంతో స్వర్ణం... 2022 – బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు– సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌పై విజయంతో స్వర్ణం... ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్ ఆటగాడే ఆచంట శరత్ కమల్. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్‌లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే... వరుసగా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని శరత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్ కమల్ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు. కొత్త కుర్రాడిలాగే... సుదీర్ఘ కాలంగా భారత టేబుల్ టెన్నిస్‌ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి శరత్ కమల్ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. -
టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు మరో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్-2022 అఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు. ఇక ఓవరాల్‌గా అఖరి రోజు భారత్‌కు ఇది ఐదో పతకం. అంతకుముందు పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ కాంస్య పతక పోరులో జ్ఞానశేఖరన్ సాతియన్ విజయం సాధించాడు. భారత్ ఇప్పటి వరకు 22 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 60 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ హవా
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్‌హాల్–లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. ఫైనల్లోకి దూసుకెళ్లిన శరత్ కమల్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్ కమల్ 11–8, 11–8, 8–11, 11–7, 9–11, 11–8తో పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 11–4, 8–11, 9–11, 9–11తో లియామ్ పిచ్‌ఫోర్డ్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకపోరుకు సిద్ధమయ్యాడు. పోరాడి ఓడిన శ్రీజ మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో శ్రీజ పోరాడినా తుదకు 11–3, 6–11, 2–11, 11–7, 13–15, 11–9, 7–11తో లియు యాంగ్జీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది. -
రజతంతో సరిపెట్టుకున్న శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అచంట శరత్ కమల్-జ్ఞానశేఖరన్ సతియాన్ ద్వయం.. ఇంగ్లండ్ జోడీ లియామ్ పిచ్‌ఫోర్డ్-పాల్ డ్రింక్‌హాల్ చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లీష్ జోడీ 8-11, 11-8, 11-3, 7-11, 11-4తేడాతో భారత ద్వయంపై విజయం సాధించి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఇంగ్లండ్ జోడీ.. భారత జోడీపై దాదాపు ఇదే తరహాలో విజయం సాధించింది. నాడు డిసైడింగ్ గేమ్‌లో ఇంగ్లండ్ 11-8 తేడాతో నెగ్గగా.. ఇప్పుడు 11-4 తేడాతో విజయం సాధించింది. టీటీలో శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 49కి (17 స్వర్ణాలు, 13 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 9 పతకాలు చేరాయి. చదవండి: పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్ -
CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో శనివారం భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ మహిళల సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై విజయం సాధించి క్వాడ్రినియెల్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇక సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్‌లో 3-5తో కాంస్యం సాధించి భారత్‌కు పతకాన్ని అందించింది. 34 ఏళ్ల భారత ఆటగాడు కాంస్య పతక ప్లే ఆఫ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో విజయం సాధించారు. అయితే, పురుషుల సింగిల్స్ తరగతుల్లో రాజ్ అరవిందన్ అళగర్ 0-3తో నైజీరియాకు చెందిన ఇసౌ ఒగున్‌కున్లే చేతిలో 3-5తో కాంస్య పతక ప్లే-ఆఫ్‌తో ఓడిపోయాడు. కాగా కామన్వెల్త్ గేమ్మ్ తొమ్మిదో రోజు భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. పలు కాంస్య పతకాలు గెలుచుకుంది. మొత్తం ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ 40 మెడల్స్‌తో ఐదో స్థానంలో ఉండగా.. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. Our country is constantly being brought up with the stellar performance of Indian sports talent in #CommonwealthGames2022. In this sequence, in the Para Table-Tennis match, Gujarat's pride, Bhavinaben Patel, won the GOLD🏅medal and made the nation proud. You are a champion 👏 pic.twitter.com/ANWtyMiksA — Sports Authority of Gujarat (@sagofficialpage) August 6, 2022 చదవండి: Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో... -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం.. ఎందులో అంటే..?
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్‌లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత టీమ్.. తాజాగా పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 3-1 తేడాతో విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకుంది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం, ఓవరాల్‌గా 11వ పతకం చేరింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్- జీ సాథియన్ జోడి 13-11, 1-7, 11-5 తేడాతో యంగ్ ఇజాక్ క్వెక్-యో ఎన్ కోన్ పంగ్ ద్వయంపై విజయం సాధించి భారత ఆధిక్యాన్ని 1-0 పెంచగా.. ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు శరత్ కమాల్.. క్లెరెన్స్ చ్యూ చేతిలో 7-11, 14-12, 3-11, 9-11 తేడాతో ఓడిపోయాడు. అనంతరం జీ సాథియన్.. కొన్ పంగ్‌పై 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో గెలుపొంది భారత్‌కు 2-1 ఆధిక్యం అందించగా.. నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్.. జెడ్ చ్యూపై 11-8, 11-5,11-6 వరుస సెట్లలో గెలుపొంది భారత్‌కు గోల్డ్ మెడల్ ఖరారు చేశాడు. చదవండి: CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్ -
CWG 2022: పతకం రేసులో భారత టీటీ జట్టు
కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–8, 11–6, 11–2తో రమిహిమిలన్–అహ్మద్ జంటను ఓడించింది. రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 11–2తో రిఫాత్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్ 11–2, 11–3, 11–5తో అహ్మద్‌పై నెగ్గి భారత విజయాన్ని ఖాయం చేశాడు. -
Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో మొదటి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు అనుగుణంగానే సాగింది. బలహీన జట్లపై భారత బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టీమ్‌లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా... హాకీలోనూ ఘన విజయం దక్కింది. ఊహించినట్లుగానే స్విమ్మింగ్, సైక్లింగ్వంటి క్రీడల్లో మనోళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో రోజును ముగించింది. భారత్ ఫలితాలు మహిళల క్రికెట్: తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పేసర్ రేణుకా సింగ్ (4/18) దెబ్బకు ఆసీస్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్ (35 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును గెలిపించారు. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ 5–0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–7, 21–12తో మురాద్ అలీపై, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–7, 21–6తో మహూర్ షహజాద్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడి 21–12, 21–9 మురాద్ అలీ–ఇర్ఫాన్ సయీద్‌ను, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 21–4, 21–5తో మహూర్ షహజాద్–గజాలా సిద్దిఖ్‌ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–పొన్నప్ప ద్వయం 21–9, 21–12తో ఇర్ఫాన్–గజాలా సిద్ధిక్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ విభాగంలో ముందుగా దక్షిణాఫ్రికాను 3–0తో, ఆపై ఫిజీని 3–0తో భారత్ చిత్తు చేసింది. పురుషుల టీమ్ విభాగంలో ముందుగా 3–0 తేడాతో బార్బడోస్పై నెగ్గింది. ∙ పురుషుల బాక్సింగ్ (63.5 కేజీలు) లో శివ థాపా 5–0తో సులేమాన్ బలూచ్ (పాకిస్తాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్విమ్మింగ్: పురుషుల స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్)లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 54.68 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసిన అతను ముందంజ వేశాడు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. సైక్లింగ్: మూడు ఈవెంట్లలోనూ భారత సైక్లిస్ట్‌లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల స్ప్రింట్ టీమ్ ఈవెంట్లో రొనాల్డో, రోజిత్, బెక్‌హామ్, ఎల్కొటొచొంగో బృందం క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలవగా... శశికళ, త్రియాశ, మయూరి సభ్యులుగా ఉన్న మహిళల స్ప్రింట్ టీమ్ కూడా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వజీత్, వెంకప్ప, దినేశ్ సభ్యులైన 4000 మీటర్ల పర్సా్యట్ టీమ్ కూడా ఆరో స్థానంలో నిలిచింది. ట్రయథ్లాన్: భారత్‌నుంచి పేలవ ప్రదర్శన నమోదైంది. పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ఆదర్శ్ మురళీధరన్ 30వ స్థానంలో, విశ్వనాథ్ యాదవ్ 33 స్థానంలో నిలిచి నిష్క్రమించగా... మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ప్రజ్ఞా మోహన్ 26వ స్థానంతో, సంజన జోషి 28వ స్థానంతో సరిపెట్టుకున్నారు. హాకీ: మహిళల లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనాను చిత్తు చేసింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (3వ నిమిషం, 39వ ని.), నేహ (28వ ని.), సంగీతా కుమారి (36వ ని.), సలీమా టెటె (56వ ని.) గోల్స్ సాధించారు. ఇంగ్లండ్ ఖాతాలో తొలి స్వర్ణం బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. పురుషుల ట్రయాథ్లాన్లో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్ విల్డ్ (న్యూజిలాండ్), మాథ్యూ హాజర్ (ఆస్ట్రేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి. -
తేజస్విన్ పేరును పరిశీలించండి
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ కోసం ఎంపికల రగడ కోర్టుల చుట్టూనే తిరుగుతుంది. టేబుల్ టెన్నిస్‌లో అయితే భారత జట్టులో చోటు కోసం వరుసబెట్టి క్రీడాకారులు హైకోర్టు తలుపు తట్టారు. తాజాగా పురుష అథ్లెట్ తేజస్విన్ శంకర్ కూడా ఎంపిక విషయమై కోర్టు మెట్లెక్కాడు. అతని పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెలక్షన్ కమిటీ ఆ హై జంపర్ మెరిట్స్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ను ఆదేశించింది. తేజస్విన్ శంకర్ హైజంప్‌లో జాతీయ రికార్డు (2.29 మీటర్లు) సాధించాడు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అతను ఇటీవల అక్కడే జరిగిన నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్లో 2.27 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి బంగారు పతకం గెలిచాడు. ఏఎఫ్ఐ అర్హత మార్క్ కూడా 2.27 మీటర్లే! అయితే ఏఎఫ్ఐ అమెరికా పోటీల విషయమై శంకర్ తమను సంప్రదించలేదనే అహంతో... అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొనలేదన్న కారణంతో బర్మింగ్‌హామ్ ఈవెంట్‌కు ఎంపిక చేయలేదు. దీనిపై విచారించిన జస్టిస్ జస్మిత్ సింగ్ ఇలాంటి అహం, భేషజాలను పక్కనబెట్టి అతని ప్రతిభను గుర్తించి కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపిక చేయాలని కేంద్ర క్రీడాశాఖ, ఏఎఫ్‌ఐకు నోటీసులు జారీ చేసింది. -
ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై సత్యన్ విజయం
వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్ తొలి రౌండ్లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జార్జిక్ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్–10 ర్యాంకింగ్స్ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్ కెరీర్లో ఇది రెండోసారి. -
కామన్వెల్త్ బెర్తు కోసం కోర్టుకెక్కిన టీటీ ప్లేయర్లు
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్‌లో మరో క్రీడాకారిణి కామన్వెల్త్ గేమ్స్ బెర్తు కోసం కోర్టుకెక్కింది. డబుల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన అర్చన కామత్ తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక విషయమై కోర్టుకెక్కిన నాలుగో ప్లేయర్ అర్చన. గతంలో దియా, మానుశ్ షా, స్వస్తిక ఘోష్‌లు కూడా కోర్టు తలుపు తట్టారు. ప్రస్తుతం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) వ్యవహారాలను పరిపాలక మండలి (సీఓఏ) పర్యవేక్షిస్తోంది. తొలుత టీటీఎఫ్ఐ సెలక్టర్లు అర్చనను ఎంపిక చేశారు. కానీ ఆమె ఇటీవలి ప్రదర్శన బాగోలేదంటూ బర్మింగ్‌హామ్ ఈవెంట్ నుంచి ఉన్నపళంగా తప్పించారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి'.. మాజీ సైక్లింగ్ కోచ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు