ఆసియా టీటీ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు
క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాపై 3–2తో సంచలన విజయం
రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి భారత్‌ను గెలిపించిన ఐహిక ముఖర్జీ
అస్తానా (కజకిస్తాన్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్íÙప్‌లో పెను సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, గత ఏడాది రన్నరప్ దక్షిణ కొరియా జట్టును భారత బృందం బోల్తా కొట్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–2తో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
‘డబుల్స్ స్పెషలిస్ట్’ ఐహిక ముఖర్జీ రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్ బెర్త్ పొందిన భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖరారైంది. భారత మహిళల జట్టు ఏకైకసారి 1960లో ముంబై ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
64 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. ఆసియా టీటీ సమాఖ్య ఆధ్వర్యంలో 1952 నుంచి 1970 వరకు ఆసియా చాంపియన్‌షిప్ జరగ్గా... 1972 నుంచి కొత్తగా ఏర్పడిన ఆసియా టీటీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
ఇద్దరు మేటి ర్యాంకర్లపై గెలిచి...
ప్రపంచ 8వ ర్యాంకర్ షిన్ యుబిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 92వ ర్యాంకర్ ఐహిక 11–9, 7–11, 12–10, 7–11, 11–7తో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ మనిక బత్రా 12–14, 13–11, 11–5, 5–11, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీను ఓడించి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది.
మూడో మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ 6–11, 10–12, 8–11తో ప్రపంచ 49వ ర్యాంకర్ లీ యున్‌హై చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 4–11, 11–6, 11–7, 10–12తో షిన్ యుబిన్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 7–11, 11–6, 12–10, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
Comments
Please login to add a commentAdd a comment