
అజేయ సెంచరీతో చెలరేగిన ఓపెనర్
దీటుగా బదులిస్తున్న గుజరాత్
తొలి ఇన్నింగ్స్‌లో 222/1
కేరళ తొలి ఇన్నింగ్స్ 457 ఆలౌట్
అహ్మదాబాద్: సీనియర్ ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (200 బంతుల్లో 117 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో అదరగొట్టడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టు దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట కేరళ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా... ఇప్పుడు గుజరాత్ కూడా అదే బాటలో నడుస్తోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది.
ప్రియాంక్ సూపర్ సెంచరీకి ఆర్య దేశాయ్ (118 బంతుల్లో 73; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తోడవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జంట కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పరుగుల రాక సులువైంది. ముఖ్యంగా ఆర్య దూకుడుగా ఆడాడు. తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించిన అనంతరం అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత మనన్ హింగ్‌రాజియా (108 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ప్రియాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
ఈ క్రమంలో ప్రియాంక్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా రంజీ సీజన్‌లో అతడికిది రెండో శతకం. మూడో రోజు 71 ఓవర్లు వేసిన కేరళ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. బాసిల్‌కు ఆ వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 418/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరకు 187 ఓవర్లలో 457 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (341 బంతుల్లో 177 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు.
మూడో రోజు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు మరో 39 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరుస బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ మూడు, చింతన్ గజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 235 పరుగులు వెనుకబడి ఉంది.
స్కోరు వివరాలు
కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్‌సింగ్ 10; సచిన్ బేబీ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (నాటౌట్) 177; సల్మాన్ నిజర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బి) చింతన్ 11; నిదీశ్ (రనౌట్) 5; బాసిల్ (సి) ఆర్య (బి) చింతన్ 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (187 ఓవర్లలో ఆలౌట్) 457. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395, 8–428, 9–455, 10–457, బౌలింగ్: చింతన్ 33–9–75–2; అర్జాన్ 34–9–81–3; ప్రియజీత్ సింగ్ 21–2–58–1; జైమీత్ 13–1–46–0; రవి బిష్ణోయ్ 30–7–74–1; సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0; విశాల్ జైస్వాల్ 22–5–57–1; ఆర్య దేశాయ్ 1–0–3–0.
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బ్యాటింగ్) 117; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 222.
వికెట్ల పతనం: 1–131. బౌలింగ్: నిధీశ్ 10–1–40–0; జలజ్ 25–5–71–0; బాసిల్ 15–1–40–1; ఆదిత్య 17–2–55–0; అక్షయ్ చంద్రన్ 3–0–11–0; ఇమ్రాన్ 1–0–3–0.
Comments
Please login to add a commentAdd a comment