
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ యకుబొయెవ్(Nodirbek Yakubboev) తీరు మార్చుకున్నాడు. ప్రత్యర్థిని గౌరవించి సంస్కారం చూపాడు. ప్రాగ్ చెస్ ఫెస్టివల్‌లో భాగంగా చాలెంజర్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న నొదిర్బెక్ తనకు ఎదురైన భారత ప్రత్యర్థి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh)కి రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నాడు. దీనికి దివ్య కూడా ప్రతి నమస్కారం చేసింది.
కాగా 23 ఏళ్ల యకుబొయెవ్ మూడో రౌండ్‌కు ముందు దివ్యకు నమస్కరించాడు. ఈ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... భారత అమ్మాయిపై విజయం సాధించాడు. మూడు రౌండ్లలో ఒక గేమ్ నెగ్గిన దివ్య రెండు గేముల్లో ఓడింది. ఉజ్బెక్ ప్లేయర్ తాజా వ్యవహారశైలి గతంలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఉదంతాన్ని మరిచిపోయేలా చేసింది.
That moment when Nodirbek Yakubboev greeted Divya Deshmukh with a traditional "Namaste" before the start of their 3rd round game at @PragueChess Festival Challengers 2025! #praguechessfestival pic.twitter.com/07zSR0ymh6
— ChessBase India (@ChessbaseIndia) March 1, 2025

అప్పుడేం జరిగిందంటే...
జనవరిలో టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో (విక్‌ఆన్‌జీ, నెదర్లాండ్స్) నొదిర్బెక్... వైశాలి మధ్య మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆనవాయితీ ప్రకారం భారత అమ్మాయి కరచాలనం కోసం చేయి చాచగా... అదేం అక్కర్లేదన్నట్లుగా ఉజ్బెక్ ఆటగాడు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించాడు. ఈ ‘నో షేక్‌హ్యాండ్’ ఉదంతం సోషల్ మీడియాలో వివాదం రేపింది. నెటిజన్లంతా నొదిర్బెక్ సంస్కారహీనుడంటూ కామెంట్లు పెట్టారు.
ఇది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... కావాలని నిరాకరించలేదని, మతపరమైన కట్టుబాట్లతోనే పరాయి అమ్మాయి చేతిని తాకలేదని... ప్రతిభావంతురాలైన వైశాలీ అన్నా... భారతీయులన్నా తనకెంతో గౌరవమని ‘ఎక్స్’లో వివరణ ఇచ్చాడు. కేవలం ట్వీట్‌తో ఆగకుండా టోర్నీ ఆడేందుకు వచ్చిన అక్కాతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందలతో పాటు తోడుగా వచ్చిన వారి తల్లి నాగలక్ష్మిని వ్యక్తిగతంగా కలిసి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది.
ఇదీ చదవండి:
తెలంగాణ శుభారంభం
పంచ్‌కుల: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ‘బి’ డివిజన్ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 3–1 గోల్స్ తేడాతో అస్సాంపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అస్సాం జట్టే ముందుగా బోణీ కొట్టింది. తొలి క్వార్టర్‌లోనే అస్సాం కెప్టెన్ మున్‌మునీ దాస్ 14వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో జట్టు 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అస్సాం జోరు ఆ క్వార్టర్‌కే పరిమితమైంది.
రెండో క్వార్టర్‌లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ అమ్మాయిలు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో అస్సాం క్రీడాకారిణులు చేష్టలుడిగారు. 23 నిమిషంలో ప్రతివ కిండో, 26వ నిమిషంలో సుమి ముందరి, 28వ నిమిషంలో పూజ రాథోడ్ తలా ఒక గోల్ చేశారు. తర్వాతి క్వార్టర్లలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలంగాణ 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఇదే డివిజన్‌లో జరిగిన పూల్ ‘బి’ పోటీల్లో ఢిల్లీ 1–0తో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందగా... చత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల మధ్య జరిగిన పోరు 1–1తో ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment