
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)కు మరో ఫ్రాంచైజీ గుడ్‌బై చెప్పేసింది. లక్నో ఫ్రాంచైజీ యూపీ రుద్రాస్ లీగ్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. నిర్వహణ సవాళ్ల కారణంగా లీగ్‌లో కొనసాగలేమని యాజమాన్యం వెల్లడించింది. భరించలేని
ఆరి్థకభారం వల్లే లీగ్ నుంచి తప్పుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇది చాలా కఠినమైన నిర్ణయమని యూపీ రుద్రాస్ టీమ్ డైరెక్టర్ సెడ్రిక్ డిసౌజా తెలిపారు. ‘హాకీ ఇండియా మొదలుపెట్టిన హెచ్‌ఐఎల్ మేం ఎంతో విలువిచ్చాం.
ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాం. కానీ ఆర్థిక సవాళ్లు మమ్మల్ని లీగ్‌లో కొనసాగేందుకు అసాధ్యంగా మార్చాయి. దీర్ఘ కాలిక లక్ష్యాలతో పనిచేసే అవకాశం లేకపోవడంతో తప్పుకుంటున్నాం. అయితే భారత్‌లో హాకీ ఉన్నత శిఖరాల్లో నిలువాలని ఆకాంక్షిస్తున్నాం’ అని సెడ్రిక్ డిసౌజా అన్నారు. ఈ జట్టుకు ఆడిన భారత హాకీ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ మాట్లాడుతూ యూపీ రుద్రాస్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
అభిమానులు సైతం మా జట్టును ఆదరించారని అన్నాడు. కానీ ఇప్పుడా అధ్యాయం ముగిసిపోవడం విచారకరమన్నాడు. లీగ్‌కు దూరమైన మూడో జట్టు రుద్రాస్. ఇదివరకే మహిళల చాంపియన్ జట్టు ఒడిశా వారియర్స్ సహా పురుషుల్లో గోనాసిక టీమ్ లీగ్‌కు రాంరాం చెప్పాయి. దీంతో వచ్చే సీజన్ కోసం రాంచీ రాయల్ టస్కర్స్ (ఇరు విభాగాల్లో)తో రెండు జట్లను భర్తీ చేసుకోగా... తాజాగా హాకీ ఇండియా (హెచ్‌ఐ)కి రుద్రాస్ షాకిచ్చింది.