భారత్‌కు పెద్ద దెబ్బ | CWG drops 9 sports | Sakshi
Sakshi News home page

భారత్‌కు పెద్ద దెబ్బ

Published Wed, Oct 23 2024 3:41 AM | Last Updated on Wed, Oct 23 2024 3:41 AM

CWG drops 9 sports

హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్‌ సహా 9 క్రీడాంశాలు తొలగింపు

గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వాహకుల నిర్ణయం

ఆందోళనలో భారత క్రీడాకారులు  

ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో మెగా ఈవెంట్‌ కామన్వెల్త్‌ క్రీడలు. ఇందులో భారత క్రీడాకారులు ప్రతీసారి పెద్ద సంఖ్యలో పతకాలు పట్టుకొస్తున్నారు. పతకాల పట్టికలోనూ క్రమంగా పుంజుకుంటూ టాప్‌–10, టాప్‌–5 స్థానాల్లో పదిలంగా నిలుస్తున్నారు. అలాంటి మెగా ఈవెంట్‌లో ఇకపై పతకాల వేట, పోడియం వద్ద మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం కష్టంగా మారనుంది. 

భారత్‌ అత్యధికంగా గెలిచే అవకాశాలున్న క్రీడాంశాలను ఆతిథ్య దేశం పెద్ద సంఖ్యలో తొలగించడం మన క్రీడాకారులకు నిజంగా గుండెకోతనే మిగల్చనుంది. ఓవరాల్‌గా పతకాల వేటకు పెద్ద దెబ్బ తగలనుంది.  

లండన్‌: మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్‌ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి. భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్‌ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్‌ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్‌ కమిటీ సిద్ధమైంది. 

గత బర్మింగ్‌హామ్‌ 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్‌ వాలీబాల్‌ క్రీడలను తప్పించారు. షూటింగ్‌ను బర్మింగ్‌హామ్‌లోనే పక్కన బెట్టారు. తాజా తొలగింపుతో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారులకు నిరాశే మిగిలింది. 

ఎందుకంటే భారత్‌ కచ్చితంగా ఈ ఐదు ఈవెంట్లలో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. బర్మింగ్‌హామ్‌లో భారత్‌ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 30 పతకాలు ఆ ఈవెంట్లలోనే గెలుపొందడం విశేషం. అంటే దాదాపు సగం పతకాలను ఇకపై భారత్‌ కోల్పోనుండటం ఎదురుదెబ్బగా భావించవచ్చు.  

బడ్జెటే ప్రతిబంధకమా? 
నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్‌ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్‌) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.

అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్‌) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్‌తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్‌ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. 

కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్‌ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్‌లోపే  ఈవెంట్‌ ను నిర్వహించాలనుకుంటుంది.  

ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... 
అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్‌ జిమ్నాస్టిక్స్, ట్రాక్‌ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్,  జూడో, లాన్‌ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్‌బాల్‌ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్‌ జరుగుతుంది.  అథ్లెటిక్స్,  స్విమ్మింగ్, ట్రాక్‌ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, లాన్‌ బౌల్స్‌ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌  2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. 

తొలగించిన క్రీడాంశాలు... 
హాకీ, క్రికెట్‌ టీమ్‌ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ), స్క్వాష్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్‌ వాలీబాల్‌ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.

2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ గెలిచిన పతకాలు 
రెజ్లింగ్‌ (12), వెయిట్‌లిఫ్టింగ్‌ (10), అథ్లెటిక్స్‌ (8), టేబుల్‌ టెన్నిస్‌ (7), బ్యాడ్మింటన్‌ (6), జూడో (3), బాక్సింగ్‌ (7), హాకీ (2), లాన్‌ బౌల్స్‌ (2), స్క్వాష్‌ (2), క్రికెట్‌ (1), పారా పవర్‌లిఫ్టింగ్‌ (1).

బ్యాడ్మింటన్‌ను తొలగించాలనే గ్లాస్గో నిర్ణయం నన్ను కలవరపాటుకు గురిచేసింది. తీవ్ర నిరాశలో ముంచింది. క్రీడల్లో ప్రగతి సాధించే భారత్‌లాంటి దేశాలకు ఇది గొడ్డలిపెట్టు. మన షట్లర్లు ఈ క్రీడాంశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలో సత్తా చాటుకునే అవకాశాన్ని ఇలా కాలరాయడం నిజంగా దురదృష్టకరం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ 

ఇంకెందుకు కామన్వెల్త్‌ గేమ్స్‌? పూర్తిగా ఈవెంట్‌నే పక్కన బెట్టేయండి. కేవలం ఒలింపిక్స్, ఆసియా క్రీడలతోనే సరిపెట్టుకుందాం. ఎందుకంటే కీలకమైన ఆటల్ని తొలగించడం వల్ల కామన్వెల్త్‌ ప్రభ కోల్పోతుంది. వారి నిర్ణయం నన్ను నిర్ఘాంత పరిచింది. ఇక మనం మన జట్టును కామన్వెల్త్‌ గేమ్స్‌కు పంపించాల్సిన అవసరమే లేదు.  –విమల్‌ కుమార్, భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌  

గ్లాస్గో నిర్వహించే పది క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌ లేకపోవడం బాధాకరం. ఇదొక్కటే కాదు, తొలగించిన అన్ని క్రీడాంశాల ఆటగాళ్లకు ఎదురుదెబ్బ. ముఖ్యంగా టీటీలో మనం ఎన్నో స్వర్ణాలు గెలిచాం. –శరత్‌ కమల్, భారత టీటీ దిగ్గజం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement