కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగు తేజం సింధు ఖాతాలో సింగిల్స్ విభాగం పసిడి పతకమే బాకీ ఉంది. గత ఈవెంట్‌లో స్వర్ణం గెలిచినప్పటికీ అది మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వచ్చింది. సింగిల్స్‌లో గ్లాస్గో (2014) లో కాంస్యం, గోల్డ్‌కోస్ట్ (2018)లో రజతం నెగ్గిన ఆమెకు ఇప్పుడు స్వర్ణావకాశం మళ్లీ వచ్చింది. బర్మింగ్‌హామ్ ఈవెంట్‌లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆమె 21–19, 21–17తో యో జియా మిన్ (సింగపూర్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సంపాదించింది.
పురుషుల సింగిల్స్‌లో స్టార్ లక్ష్య సేన్ కూడా పసిడి వేటకు సిద్ధమవగా... కిడాంబి శ్రీకాంత్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 21–18తో జియా హెంగ్ తె (సింగపూర్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 51కి చేరింది. సెమీఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 18–21, 21–16తో జియా హెంగ్ టె (సింగపూర్)పై గెలుపొందగా, శ్రీకాంత్ 21–13, 19–21, 10–21తో తే యంగ్ ఎంజ్ (మలేసియా) చేతిలో ఓడాడు.
పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–6, 21–15తో చెంగ్ పెంగ్ సున్–టియాన్ కియన్ మెన్ (మలేసియా) జంటపై గెలిచి పసిడి పోరుకు సిద్ధమైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 18–21తో తాన్ కూంగ్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment