మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–11, 25–27, 23–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ సితికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.
65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. 19–15తో ఆధిక్యంలో నిలిచిన శ్రీకాంత్ ఒక్కసారిగా వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకోవడంతో థమాసిన్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే శ్రీకాంత్ స్కోరును 20–20తో స్కోరును సమం చేశాడు. ఆ వెంటనే థమాసిన్ మరో పాయింట్ సాధించి 21–20తో ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ శ్రీకాంత్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 23–21తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ (భారత్) 21–16, 18–21, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై, ప్రియాన్షు రజావత్ (భారత్) 18–21, 21–16, 21–11తో విక్టర్ స్వెండ్స్‌న్ (డెన్మార్క్)పై, కిరణ్ జార్జి (భారత్) 21–16, 21–14తో మిథున్ మంజునాథ్ (భారత్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అయాటో ఎండో–యుటా టకె (జపాన్)లతో జరిగిన తొలి రౌండ్‌లో సాతి్వక్–చిరాగ్ తొలి గేమ్‌లో 9–11తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగారు.
సింధు శుభారంభం
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధుతోపాటు వర్ధమాన క్రీడాకారిణిలు ఆకర్షి కశ్యప్, మాళవిక, అషి్మత ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సింధు 21–10, 21–14తో జెన్‌జిరా స్టాడెల్‌మన్ (స్విట్జర్లాండ్)పై, ఆకర్షి 12–21, 21–15, 21–18తో ఆరో సీడ్ మిచెల్లి లీ (కెనడా)పై, మాళవిక 21–19, 16–21, 21–9తో కిసోనా సెల్వదురై (మలేసియా)పై, అష్మిత 21–12, 22–20తో లియోనైస్ హ్యుట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 18–21, 16–21తో రెనా మియారా–అయాకో సకురమాటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment