యూపీ యోధాస్‌ ఘనవిజయం | Pro Kabaddi 2024: UP Yoddhas Beat Tamil Thalaivas 39-22, Bengaluru Bulls Edge Gujarat Giants | Sakshi
Sakshi News home page

యూపీ యోధాస్‌ ఘనవిజయం

Sep 23 2025 7:39 AM | Updated on Sep 23 2025 12:50 PM

Pro Kabaddi League Tamil Thalaivas vs UP Yoddhas

జైపూర్‌: వరుస పరాజయాల పరంపరకు యూపీ యోధాస్‌ జట్టు బ్రేక్‌ వేసి గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 39–22తో తమిళ్‌ తలైవాస్‌పై ఘనవిజయం సాధించింది. ఆరంభం నుంచి యూపీ ఆటగాళ్లు సమష్టిగా పాయింట్లు రాబట్టారు. గగన్‌ గౌడ (7), భవానీ రాజ్‌పుత్‌ (6), శివమ్‌ చౌధరీ (5) రెయిడింగ్‌లో అదరగొట్టారు. 

డిఫెండర్లలో కెపె్టన్‌ సుమిత్‌ (5), మహేందర్‌ సింగ్‌ (4), అశు సింగ్‌ (4), హితేశ్‌ (2)లు ప్రత్యర్థి రెయిడర్లను టాకిల్‌తో కట్టడి చేశారు. తమిళ్‌ తలైవాస్‌ తరఫున డిఫెండర్‌ నితేశ్‌ కుమార్‌ (7) ఆకట్టుకున్నాడు. మిగతావారిలో నరేందర్‌ (4) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ పాయింట్లే సాధించలేకపోయారు. నాలుగు పరాభవాల తర్వాత యూపీ ఈ మ్యాచ్‌ గెలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన యోధాస్‌ మూడు మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. 

మరోవైపు 8 మ్యాచ్‌ల్లో పోటీపడిన తలైవాస్‌ ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 28–24తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. బుల్స్‌ తరఫున రెయిడర్‌ ఆకాశ్‌ షిండే (7), కెపె్టన్, డిఫెండర్‌ యోగేశ్‌ (6) రాణించారు. ఆశిష్‌ మలిక్, దీపక్‌ శంకర్‌ చెరో 4 పాయింట్లు చేశారు. గుజరాత్‌ జట్టులో ఆల్‌రౌండర్‌ విశ్వనాథ్‌ (5), డిఫెండర్‌ లక్కీ శర్మ (5) మెరుగ్గా ఆడారు. మిగతావారిలో ప్రతీక్‌ దహియా (4), శుభమ్‌ కుమార్‌ (4), రాకేశ్‌ (4) ఆకట్టుకున్నారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్‌; జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో యు ముంబా తలపడతాయి.   . 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement