Vaishali Rameshbabu
-
వెల్డన్ వైశాలి
న్యూయార్క్: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో 23 ఏళ్ల వైశాలి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన ఈ మెగా ఈవెంట్లో వైశాలి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్జున్తో జరిగిన సెమీఫైనల్లో తమిళనాడుకు చెందిన వైశాలి 0.5–2.5తో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో లె టింగ్జీ (చైనా) 3.5–2.5తో కాటరీనా లాగ్నో (రష్యా)పై గెలిచింది. జు వెన్జున్తో జరిగిన సెమీఫైనల్ తొలి గేమ్‌ను వైశాలి 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో గేమ్‌లో జు వెన్జున్ 86 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 36 ఎత్తుల్లో వైశాలిని ఓడించి 2.5–0.5తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో వీరిద్దరి మధ్య నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్లో ఓడిన వైశాలి, కాటరీనా లాగ్నోలకు కాంస్య పతకాలు లభించాయి. ఫైనల్లో వెన్జున్ 3.5–.2.5తో లె టింగ్జీపై గెలిచి తొలిసారి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించింది. 3 ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందింది. 2017లో విశ్వనాథన్ ఆనంద్ కాంస్య పతకం... 2022లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రజత పతకం గెలిచారు. -
వారెవ్వా వైశాలి
న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టోర్నీ తొలి రోజు మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ దశలో 11 గేమ్‌లలో కలిపి ఆమె మొత్తం 9.5 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. 8 గేమ్‌లు గెలిచిన వైశాలి 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. తొలి నాలుగు గేమ్‌లను వరుసగా గెలుచుకొని 23 ఏళ్ల వైశాలి శుభారంభం చేసింది. ఐదో గేమ్‌లో ఆమెకు రష్యాకు చెందిన మాజీ బ్లిట్జ్ వరల్డ్ చాంపియన్ కేటరీనా లాగ్నోతో గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీ సమరం తర్వాత ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఆ తర్వాత వైశాలి వరుసగా ఆరు, ఏడు, ఎనిమిదో గేమ్‌లలో విజయాలు సొంతం చేసుకుంది. ఎనిమిదో రౌండ్లో ప్రస్తుత వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ వలెంటినా గునీనా (రష్యా)పై గెలవడం ఆమె ముందంజ వేయడంలో కీలకంగా మారింది. 9వ రౌండ్‌ను ‘డ్రా’గా ముగించుకున్న అనంతరం పదో గేమ్‌లో పొలినా షువలోవా (రష్యా)ను ఓడించడంతో వైశాలికి అగ్ర స్థానం ఖాయమైంది. దాంతో అమెరికాకు చెందిన కారిసా ఇప్తో జరిగిన 11వ గేమ్‌ను చకచకా 9 ఎత్తుల్లోనే ‘డ్రా’ చేసుకొని వైశాలి క్వాలిఫయింగ్ దశలో నంబర్‌వన్‌గా నిలిచింది. మొత్తం 8 మంది ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్) దశకు అర్హత సాధించారు. క్వార్టర్ ఫైనల్లో జూ జినర్ (చైనా)తో వైశాలి తలపడుతుంది. మరోవైపు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి నాకౌట్‌కు చేరలేకపోయింది. 11 రౌండ్ల తర్వాత మొత్తం 8 పాయింట్లతో ఆమె 9వ స్థానంతో ముగించింది. 8 గేమ్‌లను గెలిచిన హంపి...మరో 3 గేమ్‌లలో పరాజయం పాలైంది. ఎనిమిదో రౌండ్లో మరో భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చేతిలో అనూహ్యంగా ఓడటం హంపి అవకాశాలను దెబ్బ తీసింది. ఇతర భారత క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్ (7 పాయింట్లు) 18వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ (7 పాయింట్లు) 19వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక (7 పాయింట్లు) 22వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక (5 పాయింట్లు) 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్ (5 పాయింట్లు) 71వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి (4.5 పాయింట్లు) 76వ ర్యాంక్‌లో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరిస్తారు. అర్జున్‌కు నిరాశ... పురుషుల (ఓపెన్) విభాగంలో భారత ఆటగాళ్లలో ఎవరూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మొత్తం 13 రౌండ్ల తర్వాత భారత్ నుంచి అత్యుత్తమంగా ఆర్.ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 23వ స్థానంతో ముగించగా, రౌనక్ సాధ్వానికి 35వ స్థానం (8 పాయింట్లు) దక్కింది. తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి 7 పాయింట్లు మాత్రమే సాధించి 64వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి 5 గేమ్‌లలో గెలిచి అగ్రస్థానంతో ముందుకు దూసుకుపోయిన అర్జున్‌కు ఆ తర్వాత అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. తర్వాతి 5 రౌండ్లలో 2 ఓడి, 2 ‘డ్రా’ చేసుకున్న అతను ఒకటే గేమ్ గెలవగలిగాడు. ఆఖరి 3 రౌండ్లలో వరుసగా అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డెనిస్ లజావిక్ (రష్యా), కజీబెక్ నొగర్బెక్ (కజకిస్తాన్)ల చేతుల్లో ఓడటంతో రేసులో అర్జున్ పూర్తిగా వెనుకబడిపోయాడు. -
కొత్త క్వీన్ వైశాలి: తోబుట్టువుతో పోటీపడి.. తమ్ముడి నీడను దాటి
‘మీ తమ్ముడు నీకంటే నాలుగేళ్లు చిన్నవాడు. కానీ గ్రాండ్‌మాస్టరై నాలుగేళ్లు దాటిపోయింది. మరి మీరెప్పుడు గ్రాండ్‌మాస్టర్ అవుతారు?’ ఏడాది కాలంగా ఎక్కడికి వెళ్లినా వైశాలిని వెంటాడుతున్న ప్రశ్న అది. ఒక్కోసారి తోబుట్టువు ఘనత కూడా తెలీకుండానే అనవసరపు అసహనాన్ని కలిగిస్తుంది. నిజానికి క్రీడల్లో ఒకరి ప్రదర్శనకు మరొకరి ఆటతో పోలికే ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వైశాలికి మాత్రం ఇంట్లోనే పోటీ ఉండటంతో పోలిక సహజమైంది. దాంతో ఆమెపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. కానీ చదరంగంలో ఒత్తిడిని అధిగమించడమే అన్నింటికంటే పెద్ద సవాల్ కదా! వైశాలి కూడా అలాగే ఆలోచించింది. జీఎం కావడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో వరుసగా ఒక్కో గేమ్‌లో, ఆపై ఒక్కో టోర్నీలో గెలుపుపై మాత్రమే దృష్టి పెట్టి దూసుకుపోయింది. క్యాండిడేట్స్లాంటి మెగా టోర్నీకి కూడా అర్హత సాధించింది. అక్కడా ఆమె తన ప్రశాంతతను కొనసాగించింది. ఫలితంగా విజయాలు వైశాలిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ల వయసులో చెస్ గ్రాండ్‌మాస్టర్ల జాబితాలో తన పేరును రాసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి చిచ్చరపిడుగు అయిన తమ్ముడి నీడను దాటి ఇప్పుడు సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. మున్ముందు ఆమె సాధించబోయే ఘనతల్లో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇకపై మరిన్ని సంచలనాలు ఈ చెన్నై అమ్మాయి నుంచి రావడం ఖాయం. ఎప్పుడో 2002.. భారత్ నుంచి చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తొలి మహిళగా కోనేరు హంపి గుర్తింపు.. ఆపై మరో 9 ఏళ్లు.. 2011లో రెండో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ద్రోణవల్లి హారిక.. ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల తర్వాత భారత చెస్‌లో మహిళలకు సంబంధించి ఒక తరహా శూన్యం ఆవరించింది. ఒక వైపు పురుషుల విభాగంలో ఆటగాళ్లు దూసుకుపోతుండగా, మహిళల వైపు నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనే రాలేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా అవి తాత్కాలికమే. పైగా దిగువ స్థాయికే పరిమితమయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ లేదా విమెన్ గ్రాండ్‌మాస్టర్ స్థాయికి మించి కొందరు ముందుకు సాగలేకపోయారు. అలాంటి స్థితిలో వైశాలి ప్రదర్శన గురించి ఎంత పొగిడినా తక్కువే. అక్కడే మొదలు.. 2013లో వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడేందుకు చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చెన్నైకి వచ్చాడు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అసలు ఆటకు ముందు 20 మంది జూనియర్ ప్లేయర్లతో ఒకేసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు కార్ల్సన్ సిద్ధమయ్యాడు. ఈ పోరులో 12 ఏళ్ల వైశాలి మాత్రమే కార్ల్‌సన్‌ను ఓడించడంలో సఫలమైంది. ఆ ఫలితం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా కార్ల్‌సన్‌పై గెలుపు అంటే ఆషామాషీ కాదు. అప్పుడు వైశాలి అందరి దృష్టిలో పడింది. ఆరేళ్ల వయసులో చాలా ఎక్కువ సమయం టీవీ చూడటంలోనే గడుపుతున్న కూతురు దృష్టి మళ్లించేందుకు తండ్రి రమేశ్‌బాబు చెస్ నేర్పించాడు. తర్వాతి రోజుల్లో అదే ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. స్థానికంగా పోటీ పడిన తొలి ఈవెంట్లోనే వైశాలి గెలిచి రావడంతో ఆమె పూర్తి స్థాయిలో ఆట వైపు మళ్లింది. తండ్రితో పాటు తల్లి నాగలక్ష్మి ప్రోత్సాహం, సహకారం కూడా ఆమె వేగంగా దూసుకుపోవడంలో ఉపకరించాయి. చెన్నైలోని వేలమ్మ స్కూల్, ఆ తర్వాత కాలేజ్‌లో.. వైష్ణవ్ ఇన్స్టిట్యూట్ కూడా వైశాలి చదరంగ ప్రదర్శనను గుర్తించి ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన తండ్రి పోలియో కారణంగా ఎక్కడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. అయినా ఇతరత్రా ఒక తండ్రిగా కూతురికి అండగా నిలవడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన అక్కను ఆడనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టిన తమ్ముడు ప్రజ్ఞానంద.. తర్వాత రోజుల్లో సాధనలో ఆమెకు భాగస్వామిగా మారడమే కాదు గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి అక్క గేమ్‌లను విశ్లేషించి తప్పొప్పులతో ఆమె ఆటకు సహాయకారిగా వ్యవహరించడం విశేషమే! తొలిసారి గుర్తింపుతో.. 2012.. వైశాలి చెస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. స్లొవేనియాలో అండర్–12 బాలికల వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. 11 ఏళ్ల వైశాలి యూరోప్‌లో పర్యటించడం అదే తొలిసారి. టైమ్ జోన్ భిన్నంగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కి గేమ్‌లు ప్రారంభం అయ్యేవి. దాంతో ఒక్కసారిగా అలవాటు తప్పిన సాధనతో పాటు ఇతరత్రా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఇలాంటివాటిని అధిగమించి∙ఆమె చాంపియన్‌గా నిలవడం అద్భుతం! మూడేళ్ల తర్వాత గ్రీస్‌లో ఇదే తరహాలో వరల్డ్ అండర్–14 చాంపియన్‌షిప్ జరిగింది. ఈసారి మాత్రం ఆమె పూర్తి సన్నద్ధతతో వెళ్లింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె దానికి న్యాయం చేస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ అండర్–10 విభాగంలో తమ్ముడు ప్రజ్ఞానంద కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. దాంతో రమేశ్‌బాబు కుటుంబంలో ఆనందం రెట్టింపయింది. ఒలింపియాడ్‌లో సభ్యురాలిగా.. కోవిడ్ సమయం ప్రపంచవ్యాప్త క్రీడా ఈవెంట్లపై కూడా ప్రభావం చూపించింది. అయితే ఆన్లైన్ గేమ్‌ల తర్వాత చెస్ ఆటగాళ్లు కొంత వరకు తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు. ఈ క్రమంలో వైశాలి ఆన్లైన్లో విమెన్స్ స్పీడ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సత్తా చాటింది. తుది ఫలితం అనుకూలంగా రాకపోయినా రెండు సంచలన విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. తనకంటే ఎంతో ఎక్కువ రేటింగ్ ఉన్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారిణులు అసబయెయెవా, ద్రోణవల్లి హారికలను వైశాలి ఓడించగలిగింది. ప్రపంచ చెస్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఒలింపియాడ్ ఆమె కెరీర్లో మరో చెప్పుకోదగ్గ ఘనతగా నిలిచింది. ఇందులో విజేతైన భారత జట్టులో వైశాలి కూడా ఉంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలి సోదర, సోదరి ద్వయంగా అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధించినా గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకోవడమే వైశాలికి కీలకంగా మారింది. భారత చెస్ చరిత్రలోని 83 మంది గ్రాండ్మాస్టర్లలో ఇద్దరు మాత్రమే మహిళలు. అయితే వైశాలి శ్రమ, పోరాడేతత్వం, ఓటమిని అంగీకరించని నైజం ఆమెను కొత్త జీఎంగా నిలిపాయి. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా పట్టుదలతో సాగి ఈ చెన్నై అమ్మాయి.. తన లక్ష్యాన్ని చేరింది. 2019లో ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్‌లో ఆమె తొలి జీఎం నార్మ్ సాధించింది. పది మంది ప్రత్యర్థులతో తలపడగా వారిలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు. రెండో జీఎం సాధించేందుకు ఆమెకు కొంత సమయం పట్టింది. హెరాక్లియోన్‌లో జరిగిన ఫిషర్ ఓపెన్‌లో ఆమె రెండో నార్మ్ సొంతం చేసుకుంది. ఇదే జోరులో మూడో నార్మ్ వేట సాగింది. ఏడాదిన్నర లోపే ఖతర్ ఓపెన్‌లో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి ఎనిమిది గేమ్‌లలోనూ నార్మ్ సాధించడంతో ఇక జీఎం లాంఛనమే అయింది. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు మారియా ముజీచుక్, స్టెఫనోవా, జోంగి తాన్లను ఓడించడంతో పాటు 2600 రేటింగ్ దాటడంతో ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో వైశాలి జీఎం ఖాయమైంది. ప్రపంచ చెస్‌లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వైశాలి, ప్రజ్ఞానంద నిలిచారు. ఇకపై కూడా తమ్ముడి నీడలో కాకుండా తన ఆటతో, ఎత్తుకు పైఎత్తులతో చదరంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని వైశాలి ధ్యేయంగా పెట్టుకుంది. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
వైశాలి సరికొత్త చరిత్ర.. తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి ప్రపంచ రికార్డు
Vaishali- R Praggnanandhaa: చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్ చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన మూడో మహిళగా రికార్డు సాధించింది. IV Elllobregat- 2023 ఓపెన్‌లో భాగంగా శనివారం నాటి గేమ్‌తో రేటింగ్ పాయింట్లలో 2500 మార్కును దాటి ఈ ఫీట్ నమోదు చేసింది. ఇక గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించడంతో పాటు తన సోదరడు ఆర్. ప్రజ్ఞానందతో కలిసి మరో ప్రపంచ రికార్డును కూడా వైశాలి తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకి చెందిన వైశాలికి చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద సొంత తమ్ముడు. తమ్ముడితో కలిసి ప్రపంచ రికార్డు ఇప్పటికే గ్రాండ్‌మాస్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గానూ నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్ కావడం, క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడంతో చెస్ చరిత్రలో.. ఈ ఘనత సాధించిన తొలి సోదర-సోదరీ(తోబుట్టువులు) ద్వయంగా వీళ్లిద్దరు అరుదైన రికార్డు సాధించారు. సీఎం స్టాలిన్ అభినందనలు ఇక చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, దివ్యేందు బరువా, ఆర్. ప్రజ్ఞానంద తదితర గ్రాండ్మాస్టర్లతో పాటు వైశాలి కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైశాలికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు నుంచి తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించారంటూ ప్రశంసించారు. అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారని.. మిమ్మల్ని చూసి తామంతా గర్విస్తున్నామని ఎక్స్ వేదికగా స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. చదవండి: ప్రజ్ఞానంద కుటుంబం గురించి తెలుసా?! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! చదవండి: వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్ మాజీ బౌలర్ Huge congrats, @chessvaishali, on becoming the third female Grandmaster from India and the first from Tamil Nadu! 2023 has been splendid for you. Alongside your brother @rpragchess, you've made history as the first sister-brother duo to qualify for the #Candidates tournament.… pic.twitter.com/f4I89LcJ5O — M.K.Stalin (@mkstalin) December 2, 2023