ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత గ్రాండ్‌మాస్టర్
న్యూయార్క్: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్‌లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో 23 ఏళ్ల వైశాలి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో వైశాలి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది.
చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్‌జున్‌తో జరిగిన సెమీఫైనల్లో తమిళనాడుకు చెందిన వైశాలి 0.5–2.5తో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో లె టింగ్‌జీ (చైనా) 3.5–2.5తో కాటరీనా లాగ్నో (రష్యా)పై గెలిచింది. జు వెన్‌జున్‌తో జరిగిన సెమీఫైనల్ తొలి గేమ్‌ను వైశాలి 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో గేమ్‌లో జు వెన్‌జున్ 86 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 36 ఎత్తుల్లో వైశాలిని ఓడించి 2.5–0.5తో విజయాన్ని ఖరారు చేసుకుంది.
ఫలితం తేలిపోవడంతో వీరిద్దరి మధ్య నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్లో ఓడిన వైశాలి, కాటరీనా లాగ్నోలకు కాంస్య పతకాలు లభించాయి. ఫైనల్లో వెన్‌జున్ 3.5–.2.5తో లె టింగ్‌జీపై గెలిచి తొలిసారి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించింది.
3 ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందింది. 2017లో విశ్వనాథన్ ఆనంద్ కాంస్య పతకం... 2022లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రజత పతకం గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment