మహిళల విభాగంలో అగ్ర స్థానంతో నాకౌట్‌కు అర్హత
హంపి చేజారిన అవకాశం
వరల్డ్ చెస్ ‘బ్లిట్జ్’ చాంపియన్‌షిప్
న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టోర్నీ తొలి రోజు మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ దశలో 11 గేమ్‌లలో కలిపి ఆమె మొత్తం 9.5 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. 8 గేమ్‌లు గెలిచిన వైశాలి 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. తొలి నాలుగు గేమ్‌లను వరుసగా గెలుచుకొని 23 ఏళ్ల వైశాలి శుభారంభం చేసింది. ఐదో గేమ్‌లో ఆమెకు రష్యాకు చెందిన మాజీ బ్లిట్జ్ వరల్డ్ చాంపియన్ కేటరీనా లాగ్నోతో గట్టి పోటీ ఎదురైంది.
హోరాహోరీ సమరం తర్వాత ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఆ తర్వాత వైశాలి వరుసగా ఆరు, ఏడు, ఎనిమిదో గేమ్‌లలో విజయాలు సొంతం చేసుకుంది. ఎనిమిదో రౌండ్‌లో ప్రస్తుత వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ వలెంటినా గునీనా (రష్యా)పై గెలవడం ఆమె ముందంజ వేయడంలో కీలకంగా మారింది.
9వ రౌండ్‌ను ‘డ్రా’గా ముగించుకున్న అనంతరం పదో గేమ్‌లో పొలినా షువలోవా (రష్యా)ను ఓడించడంతో వైశాలికి అగ్ర స్థానం ఖాయమైంది. దాంతో అమెరికాకు చెందిన కారిసా ఇప్‌తో జరిగిన 11వ గేమ్‌ను చకచకా 9 ఎత్తుల్లోనే ‘డ్రా’ చేసుకొని వైశాలి క్వాలిఫయింగ్ దశలో నంబర్‌వన్‌గా నిలిచింది. మొత్తం 8 మంది ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్) దశకు అర్హత సాధించారు. క్వార్టర్ ఫైనల్లో జూ జినర్ (చైనా)తో వైశాలి తలపడుతుంది.
మరోవైపు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి నాకౌట్‌కు చేరలేకపోయింది. 11 రౌండ్‌ల తర్వాత మొత్తం 8 పాయింట్లతో ఆమె 9వ స్థానంతో ముగించింది. 8 గేమ్‌లను గెలిచిన హంపి...మరో 3 గేమ్‌లలో పరాజయం పాలైంది. ఎనిమిదో రౌండ్‌లో మరో భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చేతిలో అనూహ్యంగా ఓడటం హంపి అవకాశాలను దెబ్బ తీసింది.
ఇతర భారత క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్ (7 పాయింట్లు) 18వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ (7 పాయింట్లు) 19వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక (7 పాయింట్లు) 22వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక (5 పాయింట్లు) 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్ (5 పాయింట్లు) 71వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి (4.5 పాయింట్లు) 76వ ర్యాంక్‌లో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరిస్తారు.
అర్జున్‌కు నిరాశ...
పురుషుల (ఓపెన్) విభాగంలో భారత ఆటగాళ్లలో ఎవరూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మొత్తం 13 రౌండ్‌ల తర్వాత భారత్ నుంచి అత్యుత్తమంగా ఆర్.ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 23వ స్థానంతో ముగించగా, రౌనక్ సాధ్వానికి 35వ స్థానం (8 పాయింట్లు) దక్కింది. తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి 7 పాయింట్లు మాత్రమే సాధించి 64వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
తొలి 5 గేమ్‌లలో గెలిచి అగ్రస్థానంతో ముందుకు దూసుకుపోయిన అర్జున్‌కు ఆ తర్వాత అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. తర్వాతి 5 రౌండ్‌లలో 2 ఓడి, 2 ‘డ్రా’ చేసుకున్న అతను ఒకటే గేమ్ గెలవగలిగాడు. ఆఖరి 3 రౌండ్‌లలో వరుసగా అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డెనిస్ లజావిక్ (రష్యా), కజీబెక్ నొగర్‌బెక్ (కజకిస్తాన్)ల చేతుల్లో ఓడటంతో రేసులో అర్జున్ పూర్తిగా వెనుకబడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment