
భారత డబుల్స్ నంబర్‌వన్‌గా ఖరారు
ఫ్లోరిడా: కెరీర్‌లో ఆడిన రెండో ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలోనూ భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ ఆకట్టుకున్నాడు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన యూకీ... అదే జోరును కొనసాగిస్తూ మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాడు. అయితే క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అతను అధిగమించలేకపోయాడు.
గురువారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–నూనో బోర్జెస్ (పోర్చుగల్) ద్వయం 6–7 (1/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ లాయిడ్ గ్లాస్‌పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. 90 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–బోర్జెస్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా రెండో సెట్‌లో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఒక్కసారి బ్రేక్ చేశారు.
మరోవైపు గ్లాస్‌పూల్–జూలియన్ క్యాష్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో కీలకదశలో పాయింట్లు నెగ్గి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–బోర్జెస్ జోడీకి 65,000 డాలర్ల (రూ. 55 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ ప్రదర్శనతో 33 ఏళ్ల యూకీ బాంబ్రీ వచ్చే సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 26వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా 2019 నుంచి భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న రోహన్ బోపన్నను దాటేసి యూకీ అధికారికంగా భారత డబుల్స్ కొత్త నంబర్‌వన్‌గా అవతరించనున్నాడు.