
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ముగిసిన భారత్ పోరు
క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్, గాయత్రి–ట్రెసా జోడీ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వరుసగా 24వ ఏడాది భారత క్రీడాకారులు టైటిల్ లేకుండానే తిరిగి రానున్నారు. భారత్ నుంచి ఐదు విభాగాల్లో కలిపి మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగగా... ఒక్కరు కూడా క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 10–21, 16–21తో ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను ఓడించిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు.
మహిళల డబుల్స్‌లో 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ ఈసారి క్వార్టర్ ఫైనల్లో 14–21, 10–21తో రెండో సీడ్ లియు షెంగ్‌షు–టాన్ నింగ్ (చైనా) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 15–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంటను ఓడించిది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన లక్ష్య సేన్‌కు 7,975 డాలర్లు (రూ. 6 లక్షల 93 వేలు)... గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు (రూ. 7 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
2 గతంలో భారత్ నుంచి ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment