quarterfinal
-
సింధు సులువుగా...
న్యూఢిల్లీ: ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిలకడడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సింధు వరుసగా రెండో విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 21–15, 21–13తో ప్రపంచ 46వ ర్యాంకర్ మనామి సుజి (జపాన్)పై గెలిచింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. తొలి గేమ్‌లో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధుకు ఆ తర్వాత కాస్త ప్రతిఘటన ఎదురైంది. జపాన్ ప్లేయర్ వరుస పాయింట్లు సాధించడంతో సింధు ఆధిక్యం 14–13తో ఒక పాయింట్‌కు చేరింది. ఈ దశలో సింధు చెలరేగి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 17–13తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ చేజార్చుకొని ఆ వెంటనే మళ్లీ మూడు పాయింట్లు సాధించింది.అదే జోరులో తొలి గేమ్‌ను 21–15తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. వరు సగా ఐదు పాయింట్లు నెగ్గిన భారత స్టార్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు ఆధిక్యం 13–3కు, 17–5కు పెరిగింది. సింధు స్మాష్‌లకు మనామి వద్ద సమాధానం లేకపోయింది. చివరకు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్ కూడా సింధు వశమైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ సింధు సత్తాకు పరీక్షగా నిలువనుంది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)తో సింధు ఆడనుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–3తో మరిస్కాపై ఆధిక్యంలో ఉంది. అయితే చివరిసారి వీరిద్దరు గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో తలపడగా మరిస్కా విజేతగా నిలిచింది. మరో భారత ప్లేయర్ అనుపమ ఉపాధాŠయ్య్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అనుపమ 6–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని... పురుషుల సింగిల్స్‌లో బరిలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ కిరణ్ జార్జి సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ అలెక్స్ లానీర్ (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ కిరణ్ జార్జి 22–20, 21–13తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కేరళకు చెందిన కిరణ్ తొలి గేమ్‌లో 14–20తో వెనుకబడ్డాడు. ఈ దశలో కిరణ్ అనూహ్యంగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకోవడం విశేషం. తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (ఇండోనేసియా)ను ఓడించిన అలెక్స్ ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను చేజార్చుకున్నాక గాడి తప్పాడు. రెండో గేమ్‌లో కిరణ్ ఆరంభం నుంచే జోరు ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ హాంగ్ యాంగ్ వెంగ్‌తో కిరణ్ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 20–22, 21–14, 21–16తో కెన్యా మిత్సుహాషి–హిరోకి ఒకమురా (జపాన్) జంటపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో 20–19తో ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు సమర్పించుకొని గేమ్‌ను కోల్పోయారు. అయితే రెండో గేమ్ నుంచి భారత జోడీ అతి విశ్వాసం కనబర్చకుండా జాగ్రత్తగా ఆడింది. స్కోరు 15–13 వద్ద సాత్విక్–చిరాగ్ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 19–13తో ముందంజ వేశారు. అదే జోరులో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో భారత జోడీ 1–4తో వెనుకబడ్డా వెంటనే తేరుకుంది. నిలకడగా రాణించి 13–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. మహిళల డబుల్స్‌లో ముగిసిన పోరు మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) 9–21, 21–23తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమితో (జపాన్)లపై, రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) 6–21, 7–21తో హా నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) చేతిలో... అశ్విని భట్–శిఖా గౌతమ్ (భారత్) 7–21, 10–21తో యి జింగ్ లీ–జు మిన్ లువో (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) 18–21, 17–21తో హిరోకి మిదోరికవా–నత్సు సైతో (జపాన్) చేతిలో... అశిత్ సూర్య–అమృత (భారత్) 8–21, 11–21తో పో సువాన్ యాంగ్–లింగ్ ఫాంగ్ యు (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. -
సహజ సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సహజ 5–7, 6–0, 6–2తో మూడో సీడ్ హీన్ షి (చైనా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో సహజ 6–3, 6–4తో కమోన్‌వన్ యోద్పెచ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. -
వారెవ్వా వైశాలి
న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టోర్నీ తొలి రోజు మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ దశలో 11 గేమ్‌లలో కలిపి ఆమె మొత్తం 9.5 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. 8 గేమ్‌లు గెలిచిన వైశాలి 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. తొలి నాలుగు గేమ్‌లను వరుసగా గెలుచుకొని 23 ఏళ్ల వైశాలి శుభారంభం చేసింది. ఐదో గేమ్‌లో ఆమెకు రష్యాకు చెందిన మాజీ బ్లిట్జ్ వరల్డ్ చాంపియన్ కేటరీనా లాగ్నోతో గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీ సమరం తర్వాత ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. ఆ తర్వాత వైశాలి వరుసగా ఆరు, ఏడు, ఎనిమిదో గేమ్‌లలో విజయాలు సొంతం చేసుకుంది. ఎనిమిదో రౌండ్లో ప్రస్తుత వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ వలెంటినా గునీనా (రష్యా)పై గెలవడం ఆమె ముందంజ వేయడంలో కీలకంగా మారింది. 9వ రౌండ్‌ను ‘డ్రా’గా ముగించుకున్న అనంతరం పదో గేమ్‌లో పొలినా షువలోవా (రష్యా)ను ఓడించడంతో వైశాలికి అగ్ర స్థానం ఖాయమైంది. దాంతో అమెరికాకు చెందిన కారిసా ఇప్తో జరిగిన 11వ గేమ్‌ను చకచకా 9 ఎత్తుల్లోనే ‘డ్రా’ చేసుకొని వైశాలి క్వాలిఫయింగ్ దశలో నంబర్‌వన్‌గా నిలిచింది. మొత్తం 8 మంది ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్) దశకు అర్హత సాధించారు. క్వార్టర్ ఫైనల్లో జూ జినర్ (చైనా)తో వైశాలి తలపడుతుంది. మరోవైపు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి నాకౌట్‌కు చేరలేకపోయింది. 11 రౌండ్ల తర్వాత మొత్తం 8 పాయింట్లతో ఆమె 9వ స్థానంతో ముగించింది. 8 గేమ్‌లను గెలిచిన హంపి...మరో 3 గేమ్‌లలో పరాజయం పాలైంది. ఎనిమిదో రౌండ్లో మరో భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చేతిలో అనూహ్యంగా ఓడటం హంపి అవకాశాలను దెబ్బ తీసింది. ఇతర భారత క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్ (7 పాయింట్లు) 18వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ (7 పాయింట్లు) 19వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక (7 పాయింట్లు) 22వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక (5 పాయింట్లు) 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్ (5 పాయింట్లు) 71వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి (4.5 పాయింట్లు) 76వ ర్యాంక్‌లో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరిస్తారు. అర్జున్‌కు నిరాశ... పురుషుల (ఓపెన్) విభాగంలో భారత ఆటగాళ్లలో ఎవరూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మొత్తం 13 రౌండ్ల తర్వాత భారత్ నుంచి అత్యుత్తమంగా ఆర్.ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో 23వ స్థానంతో ముగించగా, రౌనక్ సాధ్వానికి 35వ స్థానం (8 పాయింట్లు) దక్కింది. తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి 7 పాయింట్లు మాత్రమే సాధించి 64వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి 5 గేమ్‌లలో గెలిచి అగ్రస్థానంతో ముందుకు దూసుకుపోయిన అర్జున్‌కు ఆ తర్వాత అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. తర్వాతి 5 రౌండ్లలో 2 ఓడి, 2 ‘డ్రా’ చేసుకున్న అతను ఒకటే గేమ్ గెలవగలిగాడు. ఆఖరి 3 రౌండ్లలో వరుసగా అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డెనిస్ లజావిక్ (రష్యా), కజీబెక్ నొగర్బెక్ (కజకిస్తాన్)ల చేతుల్లో ఓడటంతో రేసులో అర్జున్ పూర్తిగా వెనుకబడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సింధు
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21–10, 12–21, 21–15తో ఐరా శర్మ (భారత్)పై శ్రమించి గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ డాయ్ వాంగ్‌తో సింధు ఆడుతుంది. హైదరాబాద్‌కే చెందిన వలిశెట్టి శ్రియాన్షి సంచలనం సృష్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 21–12, 21–15తో ప్రపంచ 32వ ర్యాంకర్ మాళవిక (భారత్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
FIFA WC: ఎదురులేని ఫ్రాన్స్.. వరుసగా రెండోసారి సెమీస్‌కు
దోహా: యువ, అనుభవజ్ఞులైలైన ఆటగాళ్లతో కూడిన ఫ్రాన్స్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోరీ్నలో ఏడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఫ్రాన్స్ తరఫున చువమెని (17వ ని.లో), ఒలివియర్ జిరూడ్ (78వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ హ్యారీ కేన్ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఇంగ్లండ్ 1–2తో వెనుకబడిన దశలో 84వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ వృథా చేశాడు. కేన్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ పైనుంచి బయటకు వెళ్లిపోయింది. లేదంటే ఇంగ్లండ్ 2–2తో స్కోరును సమం చేసేది. -
Qatar FIFA World Cup 2022: ఫ్రాన్స్ జోరు...
దోహా: ఆద్యంతం దూకుడుగా ఆడిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొమ్మిదోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్‌తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో పోలాండ్ జట్టును ఓడించింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (44వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎంబాపె (74వ, 90+1వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్ జట్టుకు కెప్టెన్ లెవన్డౌస్కీ (90+9వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభంలో ఫ్రాన్స్‌ను నిలువరించిన పోలాండ్ తొలి అర్ధభాగం చివర్లో తడబడింది. ఎంబాపె అందించిన పాస్‌ను జిరూడ్ లక్ష్యానికి చేర్చడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. జిరూడ్ కెరీర్లో ఇది 52వ గోల్. ఈ గోల్‌తో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును జిరూడ్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ ఆడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జోడీ
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్) –లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 86 నిమిషాల్లో 7–5, 7–5తో ఎనిమిదో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–బీట్రిజ్ (బ్రెజిల్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా6–4, 6–3తో మోనికా నికెలెస్కూ (రొమేనియా)–వెరా జ్వొనరేవా (రష్యా)లపై విజయం సాధించారు. -
భారత్, కజకిస్తాన్ క్వార్టర్స్ తొలి మ్యాచ్ ‘డ్రా’
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం కజకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్‌ను భారత్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. జన్సయ అబ్దుమాలిక్తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 80 ఎత్తుల్లో... దినార సదువాకసోవాతో గేమ్‌ను ఆర్ వైశాలి 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. అనంతరం భక్తి కులకర్ణి 52 ఎత్తుల్లో కమలిదెనోవా చేతిలో ఓడింది. చివరగా జరిగిన గేమ్‌లో మేరీఆన్ గోమ్స్ 85 ఎత్తుల్లో గుల్మిరాపై నెగ్గడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చదవండి: టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు.. -
National Boxing Championships: క్వార్టర్స్‌లో తెలంగాణ బాక్సర్
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ సావియో డొమినిక్ మైకేల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 54 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సావియో 4–1తో కృష్ణ జొరా (జార్ఖండ్)పై గెలుపొంది ముందంజ వేశాడు. అయితే 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మరో తెలంగాణ బాక్సర్ వేణు మండల ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. మహారాష్ట్ర బాక్సర్ నిఖిల్ దూబే చేతిలో వేణు ఓడిపోయాడు. ప్రత్యర్థి పంచ్‌కు వేణు కిందపడిపోగా రిఫరీ మ్యాచ్‌ను ఆపి దూబేను విజేతగా ప్రకటించాడు. చదవండి: Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు! -
సెరెనాకు చుక్కెదురు
లెక్సింగ్టన్ (అమెరికా): కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో... ఆరు నెలల విరామం తర్వాత తాను ఆడుతున్న తొలి టోర్నమెంట్లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సెరెనా 6–1, 4–6, 6–7 (5/7)తో అమెరికాకే చెందిన ప్రపంచ 116వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ చేతిలో ఓడిపోయింది. తన 25 ఏళ్ల అంతర్జాతీయ ప్రొఫెషనల్ కెరీర్లో సెరెనా ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో టాప్–100 బయట ఉన్న వారి చేతిలో పరాజయం పాలైంది. టాప్–100లో లేని క్రీడాకారిణి చేతిలో సెరెనా ఓడిపోవడం చివరిసారి 2012లో జరిగింది. -
సౌరాష్ట్రతో ఆంధ్ర సై!
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన ఆంధ్ర ఇప్పుడు సెమీస్ బెర్తుపై కన్నేసింది. నేటి నుంచి స్థానిక సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకర్ భరత్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు గత రన్నరప్ సౌరాష్ట్రతో తలపడుతుంది. సెమీస్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆంధ్రకు సౌరాష్ట్రను ఎదుర్కోవడం అంత సులభం కాదు కానీ... సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో స్థానిక అనుకూలతలతో పైచేయి సాధించాలని ఆంధ్ర భావిస్తోంది. నిజానికి ఈ సీజన్ ఆరంభంలో ఆంధ్ర నిలకడగా రాణించింది. దీంతో ఎలైట్ ‘ఎ అండ్ బి’ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. అయితే లీగ్ దశ సాగేకొద్దీ ప్రతికూల ఫలితాలతో వెనుకబడింది. ఇక ముగింపుకొచ్చేసరికి వరుసగా రెండు పరాజయాలతో ఐదో స్థానానికి పడిపోయింది. టాపార్డర్‌లో జ్ఞానేశ్వర్, ప్రశాంత్‌లతోపాటు రికీ భుయ్, శ్రీకర్ భరత్‌లు రాణిస్తే ఆంధ్ర భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. బౌలింగ్‌లో శశికాంత్, స్టీఫెన్, రఫీ మళ్లీ మెరిపించాలి. గత రన్నరప్ సౌరాష్ట్ర మేటి ఆల్‌రౌండ్ జట్టు. ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ చేతిలో ఓడింది. మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన సౌరాష్ట్ర నాలుగు మ్యాచ్‌ల్ని ‘డ్రా’ చేసుకుంది. -
క్వార్టర్స్‌లో కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం 56 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ 21–17, 11–21, 21–12తో డారెన్ ల్యూ (మలేసియా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో కశ్యప్ 15–10తో ఆధిక్యంలో నిలిచినా డారెన్ పోరాడటంతో స్కోరు 18–17కు చేరింది. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించి కశ్యప్ గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో ఒక దశలో డారెన్ వరుసగా 12 పాయిం ట్లు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ మళ్లీ పుంజుకున్నాడు. 12–2తో ఆధిక్యంలో నిలిచిన హైదరాబాదీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. -
ఫెడరర్ ఖేల్ ఖతం
ఇరవై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ మరో మేజర్ టైటిల్ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ నెగ్గలేకపోయిన స్విస్ స్టార్ పోరాటం ఈ ఏడాదికి ముగిసింది. 2019 చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అతని ఆట క్వార్టర్ ఫైనల్ వరకే పరిమితమైంది. అద్భుత పోరాటపటిమతో ఫెడరర్‌ను చిత్తు చేసి బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ తన కెరీర్లోనే అత్యుత్తమ విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే టోర్నీలో అనామకుడు మిల్మన్ చేతిలో ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన ఫెడెక్స్‌కు 2008 తర్వాత యూఎస్ ఓపెన్ అందని ద్రాక్షే అయింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్‌తో గతంలో ఏడు సార్లు తలపడి ప్రతీసారి ఓడిన దిమిత్రోవ్ ఈసారి మాత్రం గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన ఫెడరర్‌కు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ 78వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 3–6, 6–4, 3–6, 6–4, 6–2తో ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ ఐదు సెట్ల మ్యాచ్‌లో చివరకు ఫెడరర్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో వెన్ను నొప్పి కొంత వరకు ఇబ్బంది పెట్టడం కూడా ఫెడరర్‌కు ప్రతికూలంగా మారింది. మ్యాచ్‌లో ఏకంగా 61 అనవసర తప్పిదాలు చేసి ఫెడరర్ ఓటమిని ఆహ్వానించాడు. 2008లో రైనర్ షట్లర్ (94వ ర్యాంక్) వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరిన తర్వాత ఇంత తక్కువ ర్యాంకర్ (78) ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. దిమిత్రోవ్ గతంలో రెండుసార్లు (2014 వింబుల్డన్, 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరాడు. సెమీస్‌లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు. శుభారంభం చేసినా... గతంలో ఏడుసార్లు ఫెడరర్ చేతిలో ఓడినప్పుడు మొత్తం కలిపి దిమిత్రోవ్ రెండు సెట్లు మాత్రమే గెలవగలిగాడు. ఈ మ్యాచ్‌ను ఫెడరర్ ఆరంభించిన తీరు చూస్తే ఎలాంటి సంచలనానికి అవకాశం ఉండదని అనిపించింది. జోరుగా దూసుకుపోయి 3–0తో ఆధిక్యంలో నిలిచిన ఫెడెక్స్‌కు ప్రత్యర్థి 3 డబుల్ ఫాల్ట్‌లు కూడా చేయడం కలిసొచ్చింది. 29 నిమిషాల్లోనే అతను సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్లో తేరుకున్న దిమిత్రోవ్ 4–2తో ముందంజలో నిలిచాడు. 5–3 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయినా తర్వాతి గేమ్‌ను గెలుచుకోవడంతో సెట్ బల్గేరియన్ వశమైంది. మూడో సెట్లోనూ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ ఆధిక్యం ప్రదర్శిం చాడు. నాలుగో సెట్ ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించిన దిమిత్రోవ్‌కు సెట్‌ను అందుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పదో గేమ్‌లో ఐదుసార్లు బ్రేక్ పాయింట్ సాధించే అవకాశం వచ్చినా ఫెడరర్ విఫలమయ్యాడు. ఈ సెట్ తర్వాత వెన్నునొప్పికి చికిత్స చేయించుకొని తిరిగొచ్చిన స్విస్ దిగ్గజం ప్రభావం చూపలేక చేతులెత్తేశాడు. 4–0తో ముందంజ వేసిన దిమిత్రోవ్‌కు ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఫెడరర్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ కోర్టు బయట పడటంతో దిమిత్రోవ్ గెలుపు ఖాయమైంది. దిమిత్రోవ్ సంబరం సెమీఫైనల్లో మెద్వెదేవ్... రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ 7–6 (8/6), 6–3, 3–6, 6–1తో 2016 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 2 గంటల 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. కాలి గాయంతో ఒక దశలో మ్యాచ్ నుంచి తప్పుకోవాలని భావించిన 23 ఏళ్ల మెద్వెదేవ్ పెయిన్ కిల్లర్స్‌తో ఆటను కొనసాగించి విజయాన్ని అందుకోవడం విశేషం. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–3తో 23వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. నాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే బాగా ఆడుతున్నానని అనిపించింది. అందుకే ఈ ఓటమి కొంత నిరాశ కలిగించింది. ఆధిక్యంలో ఉండి కూడా వెనుకబడటం అంటే ఒక మంచి అవకాశం చేజార్చుకున్నట్లే. అయితే పరాజయాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇదంతా ఆటలో భాగం. వెన్నులో కొంత ఇబ్బందిగా అనిపించడంతో శరీరం తేలికయ్యేందుకు కొంత చికిత్స తీసుకున్నాను. నేను బాగానే ఉన్నాను. నా ఓటమికి ఇది కారణం కాదు. నేను ఎంత పోరాడగలనో అంతా చేశాను. అయినా ఇది దిమిత్రోవ్ విజయం గురించి మాట్లాడాల్సిన సమయమే తప్ప నా గాయం గురించి కాదు. భవిష్యత్తులో మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతానా లేదా చెప్పేందుకు నా దగ్గర మంత్రదండమేమీ లేదు. ఏదైనా జరగొచ్చు కాబట్టి గెలవాలనే ఆశిస్తున్నా. కొంత విశ్రాంతి తీసుకొని తర్వాతి టోర్నీకి సిద్ధమవుతా. –ఫెడరర్ సెరెనా సెంచరీ... అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సొంత గడ్డపై సివంగిలా విరుచుకు పడింది. క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్ వాంగ్ కియాంగ్ (చైనా)ను 6–1, 6–0తో చిత్తుగా ఓడించి 13వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 44 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం ఆమె దూకుడుకు నిదర్శనం. ఆరుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన సెరెనాకు ఈ టోర్నీలో ఇది 100వ విజయం కావడం విశేషం. కియాంగ్‌పై సాధించిన ఈ గెలుపు 2019లో అతి తక్కువ వ్యవధిలో ముగిసిన రెండో మ్యాచ్. మాడ్రిడ్ ఓపెన్‌లో కుజ్మోవాను హలెప్ కూడా 44 నిమిషాల్లోనే చిత్తు చేసింది. గత రౌండ్లో రెండో సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కియాంగ్ ఆటలు సెరెనా ముందు సాగలేదు. సెరెనా 25 విన్నర్లు కొడితే కియాంగ్ ఒక్కటీ కొట్టలేకపోయింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)తో సెరెనా తలపడుతుంది. 38 ఏళ్ల సెరెనా 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్ నెగ్గింది. 20 ఏళ్ల తర్వాత ఆమె తన 24వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు రెండు విజయాల దూరంలో నిలిచింది. -
భారత్ X నమీబియా
నేడు అండర్-19 వరల్డ్‌కప్ క్వార్టర్‌ఫైనల్ ఫతుల్లా: గ్రూప్ దశలో వరుస విజయాలతో హోరెత్తించిన భారత జట్టు.. అండర్-19 వరల్డ్‌కప్‌లో నాకౌట్ పోరుకు సిద్ధమైంది. ఫతుల్లాలో నేడు (శనివారం) జరగనున్న మ్యాచ్‌లో నమీబియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏ విధంగా చూసిన ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో అందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు ఖాయం. ఇక బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్ బంతులకు ఎదురునిలవడం నమీబియాకు శక్తికి మించిన పనే. లోమ్రోర్, మావి, కలీల్‌లు సమయోచితంగా స్పందిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు నమీబియాను తక్కువగా అంచనా వేయలేం. లీగ్ దశలో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీకే దూరం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. నమీబియాకు వచ్చిన నష్టమేమీ లేదు కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్ మిర్పూర్: బ్యాటింగ్‌లో రాణించిన బంగ్లాదేశ్ అండర్-19 వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం జరి గిన క్వార్టరఫైనల్లో 6 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది. ముందు గా నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా 48.2ఓవర్లలో 4వికెట్లకు 215 పరుగులు సాధించింది. -
క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
జ్వాల-అశ్విని జోడి ఔట్ ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన రెండో రౌండ్లో సైనా 21-17, 21-9 తేడాతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో నాలుగో సారి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకేసిన ఎనిమిదో సీడ్ సైనా.. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్, చైనా క్రీడాకారిణి జురుయ్ లీతో తలపడనుంది. జురుయ్ లీ రెండో రౌండ్లో 21-12, 21-19తో అడ్రియంటి ఫిర్దాసరిపై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఇరువురి మధ్య ఇప్పటిదాకా జరిగిన ముఖాముఖి పోరులో సైనాపై 6-2తో జురుయ్ లీదే పైచేయిగా ఉంది. అయితే ఇదే టోర్నీలో 2012 ఫైనల్లో జురుయ్ లీని ఓడించి విజేతగా నిలిచిన రికార్డు సైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. ఇక మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప జోడి పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసింది. కొరియా జంట యీ నా జంగ్-సో యంగ్ కిమ్ చేతిలో జ్వాల-అశ్విని ద్వయం 16-21, 21-15, 12-21 తేడాతో ఓటమిపాలైంది. -
గెలిచి నిలిచిన భారత్
న్యూఢిల్లీ: రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు సత్తాచాటారు. ఆట ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ తర్వాత చెమటోడ్చి గెలిచారు. జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ పూల్ ‘సి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా 3-2తో కెనడాపై విజయం సాధించింది. తాజా విజయంతో యువ భారత్ ఈ పూల్‌లో క్వార్టర్ ఫైనల్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. ఆట మొదలైన మూడో నిమిషంలోనే కెప్టెన్ సుకి పనేసర్ ఫీల్డ్ గోల్‌తో కెనడాకు శుభారంభమిచ్చాడు. దీంతో భారత్ స్కోరు సమం చేసేందుకు తమ దాడులకు పదునుపెట్టింది. ఎట్టకేలకు ఆట 30వ నిమిషంలో మన్దీప్ సింగ్ తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి స్కోరును 1-1తో సమం చేశాడు. అనంతరం ద్వితీయార్ధంలో ఇరు జట్లు మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు చెమటోడ్చాయి. ఈ క్రమంలో గోర్డాన్ జాన్స్టన్ ఆట 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2-1తో మళ్లీ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీనికి ఆరు నిమిషాల వ్యవధిలోనే ఆకాశ్‌దీప్ సింగ్ (57వ ని.) చక్కని ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేశాడు. 2-2తో ఆట డ్రాగా ముగుస్తుందనుకుంటున్న తరుణంలో... 69వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని గుర్జిందర్ సింగ్ గోల్‌గా మలచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ నెల 10న దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే నాకౌట్‌కు అర్హత సంపాదిస్తుంది. మెరుగైన గోల్స్ తేడాతో ఉన్న కొరియా కనీసం డ్రా చేసుకున్నా క్వార్టర్స్‌కు చేరుతుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొరియా 2-3తో ఓడింది. దీంతో ఈ పూల్‌లో నెదర్లాండ్స్ క్వార్టర్స్ బెర్తు సాధించింది. జర్మనీ చేతిలో పాక్ చిత్తు డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ బోణీ చేయగా, యూరోపియన్ చాంపియన్ బెల్జియం వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఎలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 6-1తో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. జర్మనీ తరఫున క్రిస్టోఫర్ రుహుర్ (2, 18, 26వ ని.) మూడు గోల్స్ చేయగా, లుకాస్ విండ్‌ఫెడర్ (10వ ని.), అలెగ్జాండర్ స్కాలకొఫ్ (59వ ని.), నిక్లాస్ బ్రూన్స్ (69వ ని.) తలా ఓ గోల్ చేశారు. పాక్ తరఫున నమోదైన ఒకే ఒక్క గోల్‌ను సాకిల్ అమ్మద్ సాధించాడు. ఇదే పూల్‌లో బెల్జియం 5-0తో ఈజిప్టుపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.