ఇరవై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ మరో మేజర్ టైటిల్ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ నెగ్గలేకపోయిన స్విస్ స్టార్ పోరాటం ఈ ఏడాదికి ముగిసింది. 2019 చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అతని ఆట క్వార్టర్ ఫైనల్ వరకే పరిమితమైంది. అద్భుత పోరాటపటిమతో ఫెడరర్‌ను చిత్తు చేసి బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే టోర్నీలో అనామకుడు మిల్‌మన్ చేతిలో ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన ఫెడెక్స్‌కు 2008 తర్వాత యూఎస్ ఓపెన్ అందని ద్రాక్షే అయింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్‌తో గతంలో ఏడు సార్లు తలపడి ప్రతీసారి ఓడిన దిమిత్రోవ్ ఈసారి మాత్రం గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన ఫెడరర్‌కు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ 78వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 3–6, 6–4, 3–6, 6–4, 6–2తో ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ ఐదు సెట్‌ల మ్యాచ్‌లో చివరకు ఫెడరర్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో వెన్ను నొప్పి కొంత వరకు ఇబ్బంది పెట్టడం కూడా ఫెడరర్‌కు ప్రతికూలంగా మారింది. మ్యాచ్‌లో ఏకంగా 61 అనవసర తప్పిదాలు చేసి ఫెడరర్ ఓటమిని ఆహ్వానించాడు. 2008లో రైనర్ షట్లర్ (94వ ర్యాంక్) వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరిన తర్వాత ఇంత తక్కువ ర్యాంకర్ (78) ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. దిమిత్రోవ్ గతంలో రెండుసార్లు (2014 వింబుల్డన్, 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరాడు. సెమీస్‌లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు.
శుభారంభం చేసినా...
గతంలో ఏడుసార్లు ఫెడరర్ చేతిలో ఓడినప్పుడు మొత్తం కలిపి దిమిత్రోవ్ రెండు సెట్‌లు మాత్రమే గెలవగలిగాడు. ఈ మ్యాచ్‌ను ఫెడరర్ ఆరంభించిన తీరు చూస్తే ఎలాంటి సంచలనానికి అవకాశం ఉండదని అనిపించింది. జోరుగా దూసుకుపోయి 3–0తో ఆధిక్యంలో నిలిచిన ఫెడెక్స్‌కు ప్రత్యర్థి 3 డబుల్ ఫాల్ట్‌లు కూడా చేయడం కలిసొచ్చింది. 29 నిమిషాల్లోనే అతను సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్‌లో తేరుకున్న దిమిత్రోవ్ 4–2తో ముందంజలో నిలిచాడు. 5–3 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయినా తర్వాతి గేమ్‌ను గెలుచుకోవడంతో సెట్ బల్గేరియన్ వశమైంది. మూడో సెట్‌లోనూ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ ఆధిక్యం ప్రదర్శిం చాడు. నాలుగో సెట్ ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించిన దిమిత్రోవ్‌కు సెట్‌ను అందుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పదో గేమ్‌లో ఐదుసార్లు బ్రేక్ పాయింట్ సాధించే అవకాశం వచ్చినా ఫెడరర్ విఫలమయ్యాడు. ఈ సెట్ తర్వాత వెన్నునొప్పికి చికిత్స చేయించుకొని తిరిగొచ్చిన స్విస్ దిగ్గజం ప్రభావం చూపలేక చేతులెత్తేశాడు. 4–0తో ముందంజ వేసిన దిమిత్రోవ్‌కు ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఫెడరర్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ కోర్టు బయట పడటంతో దిమిత్రోవ్ గెలుపు ఖాయమైంది.
దిమిత్రోవ్ సంబరం
సెమీఫైనల్లో మెద్వెదేవ్...
రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ 7–6 (8/6), 6–3, 3–6, 6–1తో 2016 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 2 గంటల 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. కాలి గాయంతో ఒక దశలో మ్యాచ్ నుంచి తప్పుకోవాలని భావించిన 23 ఏళ్ల మెద్వెదేవ్ పెయిన్ కిల్లర్స్‌తో ఆటను కొనసాగించి విజయాన్ని అందుకోవడం విశేషం. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–3తో 23వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది.
నాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే బాగా ఆడుతున్నానని అనిపించింది. అందుకే ఈ ఓటమి కొంత నిరాశ కలిగించింది. ఆధిక్యంలో ఉండి కూడా వెనుకబడటం అంటే ఒక మంచి అవకాశం చేజార్చుకున్నట్లే. అయితే పరాజయాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇదంతా ఆటలో భాగం. వెన్నులో కొంత ఇబ్బందిగా అనిపించడంతో శరీరం తేలికయ్యేందుకు కొంత చికిత్స తీసుకున్నాను. నేను బాగానే ఉన్నాను. నా ఓటమికి ఇది కారణం కాదు. నేను ఎంత పోరాడగలనో అంతా చేశాను. అయినా ఇది దిమిత్రోవ్ విజయం గురించి మాట్లాడాల్సిన సమయమే తప్ప నా గాయం గురించి కాదు. భవిష్యత్తులో మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతానా లేదా చెప్పేందుకు నా దగ్గర మంత్రదండమేమీ లేదు. ఏదైనా జరగొచ్చు కాబట్టి గెలవాలనే ఆశిస్తున్నా. కొంత విశ్రాంతి తీసుకొని తర్వాతి టోర్నీకి సిద్ధమవుతా.
–ఫెడరర్
సెరెనా సెంచరీ...
అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సొంత గడ్డపై సివంగిలా విరుచుకు పడింది. క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్ వాంగ్ కియాంగ్ (చైనా)ను 6–1, 6–0తో చిత్తుగా ఓడించి 13వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 44 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం ఆమె దూకుడుకు నిదర్శనం. ఆరుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన సెరెనాకు ఈ టోర్నీలో ఇది 100వ విజయం కావడం విశేషం. కియాంగ్‌పై సాధించిన ఈ గెలుపు 2019లో అతి తక్కువ వ్యవధిలో ముగిసిన రెండో మ్యాచ్. మాడ్రిడ్ ఓపెన్‌లో కుజ్మోవాను హలెప్ కూడా 44 నిమిషాల్లోనే చిత్తు చేసింది. గత రౌండ్‌లో రెండో సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కియాంగ్ ఆటలు సెరెనా ముందు సాగలేదు. సెరెనా 25 విన్నర్లు కొడితే కియాంగ్ ఒక్కటీ కొట్టలేకపోయింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)తో సెరెనా తలపడుతుంది. 38 ఏళ్ల సెరెనా 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్ నెగ్గింది. 20 ఏళ్ల తర్వాత ఆమె తన 24వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు రెండు విజయాల దూరంలో నిలిచింది.
ఫెడరర్ ఖేల్ ఖతం
Published Thu, Sep 5 2019 3:08 AM | Last Updated on Thu, Sep 5 2019 5:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment