Dimitrov
-
2017 తర్వాత మళ్లీ టైటిల్...
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బల్గేరియా టెన్నిస్ స్టార్ దిమిత్రోవ్ తన కెరీర్లో తొమ్మిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 32 ఏళ్ల దిమిత్రోవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 14వ ర్యాంకర్ దిమిత్రోవ్ 7–6 (7/5), 6–4తో 8వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 95,340 డాలర్ల (రూ. 79 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దిమిత్రోవ్ చివరిసారి 2017 నవంబర్ 17న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. -
దిమిత్రోవ్‌కు కరోనా.. జొకోవిచ్‌లో ఆందోళన
జాగ్రెబ్(క్రోయేషియా): అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాను యూఎస్ గ్రాండ్ స్లామ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇటీవల స్పష్టం చేసిన సెర్బియా టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఇప్పుడు అదే భయం వెంటాడుతోంది. క్రోయేషియాలో జరిగిన ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ ఈవెంట్లో భాగంగా తనతో ఆడిన బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో జొకోవిచ్‌లో భయం రెట్టింపు అయ్యింది. గతవారం ఎగ్జిబిషన్ టోర్నమెంట్లో భాగంగా జొకోవిచ్- దిమిత్రోవ్‌లు కలిసి డబుల్స్ ఆడారు. ఆ తర్వాత సెకండ్ లెగ్‌లో మరో మ్యాచ్ ఆడిన దిమిత్రోవ్‌కు జ్వరం రావడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. (నీకేంటి.. ఈజీగానే వదిలేస్తావ్!) ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దిమిత్రోవ్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సన్నిహితులకు, ఫ్యాన్స్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉందన్న దిమిత్రోవ్..ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. రెండో లెగ్‌లో శనివారం బోర్నా కారిక్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత దిమిత్రోవ్‌లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆ మ్యాచ్‌ను దిమిత్రోవ్ కోల్పోయిన అనంతరం టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, గత కొన్ని రోజుల నుంచి తనతో ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారి పేర్లు కూడా వెల్లడించిన దిమిత్రోవ్.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తనతో ఆడిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. ‘నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను. నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఇంట్లోనే కోలుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ థాంక్స్’అని ప్రపంచ 19వ ర్యాంకర్ దిమిత్రోవ్ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. దిమిత్రోవ్‌కు కరోనా అని తేలడంతో ఆ ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్-ఆండ్రీ రూబ్లెవ్‌లు తలపడాల్సి ఉండగా, దాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. View this post on Instagram Hi Everyone-I want to reach out and let my fans and friends know that I tested positive back in Monaco for Covid-19. I want to make sure anyone who has been in contact with me during these past days gets tested and takes the necessary precautions. I am so sorry for any harm I might have caused. I am back home now and recovering. Thanks for your support and please stay safe and healthy. GD A post shared by Grigor Dimitrov (@grigordimitrov) on Jun 21, 2020 at 10:36am PDT -
ఫెడరర్ ఖేల్ ఖతం
ఇరవై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ మరో మేజర్ టైటిల్ కల నెమ్మదిగా చెదిరిపోతోంది. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ నెగ్గలేకపోయిన స్విస్ స్టార్ పోరాటం ఈ ఏడాదికి ముగిసింది. 2019 చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అతని ఆట క్వార్టర్ ఫైనల్ వరకే పరిమితమైంది. అద్భుత పోరాటపటిమతో ఫెడరర్‌ను చిత్తు చేసి బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ తన కెరీర్లోనే అత్యుత్తమ విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే టోర్నీలో అనామకుడు మిల్మన్ చేతిలో ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన ఫెడెక్స్‌కు 2008 తర్వాత యూఎస్ ఓపెన్ అందని ద్రాక్షే అయింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్‌తో గతంలో ఏడు సార్లు తలపడి ప్రతీసారి ఓడిన దిమిత్రోవ్ ఈసారి మాత్రం గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన ఫెడరర్‌కు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రపంచ 78వ ర్యాంకర్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 3–6, 6–4, 3–6, 6–4, 6–2తో ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 3 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ ఐదు సెట్ల మ్యాచ్‌లో చివరకు ఫెడరర్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో వెన్ను నొప్పి కొంత వరకు ఇబ్బంది పెట్టడం కూడా ఫెడరర్‌కు ప్రతికూలంగా మారింది. మ్యాచ్‌లో ఏకంగా 61 అనవసర తప్పిదాలు చేసి ఫెడరర్ ఓటమిని ఆహ్వానించాడు. 2008లో రైనర్ షట్లర్ (94వ ర్యాంక్) వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరిన తర్వాత ఇంత తక్కువ ర్యాంకర్ (78) ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. దిమిత్రోవ్ గతంలో రెండుసార్లు (2014 వింబుల్డన్, 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరాడు. సెమీస్‌లో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు. శుభారంభం చేసినా... గతంలో ఏడుసార్లు ఫెడరర్ చేతిలో ఓడినప్పుడు మొత్తం కలిపి దిమిత్రోవ్ రెండు సెట్లు మాత్రమే గెలవగలిగాడు. ఈ మ్యాచ్‌ను ఫెడరర్ ఆరంభించిన తీరు చూస్తే ఎలాంటి సంచలనానికి అవకాశం ఉండదని అనిపించింది. జోరుగా దూసుకుపోయి 3–0తో ఆధిక్యంలో నిలిచిన ఫెడెక్స్‌కు ప్రత్యర్థి 3 డబుల్ ఫాల్ట్‌లు కూడా చేయడం కలిసొచ్చింది. 29 నిమిషాల్లోనే అతను సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్లో తేరుకున్న దిమిత్రోవ్ 4–2తో ముందంజలో నిలిచాడు. 5–3 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయినా తర్వాతి గేమ్‌ను గెలుచుకోవడంతో సెట్ బల్గేరియన్ వశమైంది. మూడో సెట్లోనూ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ ఆధిక్యం ప్రదర్శిం చాడు. నాలుగో సెట్ ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించిన దిమిత్రోవ్‌కు సెట్‌ను అందుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పదో గేమ్‌లో ఐదుసార్లు బ్రేక్ పాయింట్ సాధించే అవకాశం వచ్చినా ఫెడరర్ విఫలమయ్యాడు. ఈ సెట్ తర్వాత వెన్నునొప్పికి చికిత్స చేయించుకొని తిరిగొచ్చిన స్విస్ దిగ్గజం ప్రభావం చూపలేక చేతులెత్తేశాడు. 4–0తో ముందంజ వేసిన దిమిత్రోవ్‌కు ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఫెడరర్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్ కోర్టు బయట పడటంతో దిమిత్రోవ్ గెలుపు ఖాయమైంది. దిమిత్రోవ్ సంబరం సెమీఫైనల్లో మెద్వెదేవ్... రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో మెద్వెదేవ్ 7–6 (8/6), 6–3, 3–6, 6–1తో 2016 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. 2 గంటల 34 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. కాలి గాయంతో ఒక దశలో మ్యాచ్ నుంచి తప్పుకోవాలని భావించిన 23 ఏళ్ల మెద్వెదేవ్ పెయిన్ కిల్లర్స్‌తో ఆటను కొనసాగించి విజయాన్ని అందుకోవడం విశేషం. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (7/5), 6–3తో 23వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. నాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే బాగా ఆడుతున్నానని అనిపించింది. అందుకే ఈ ఓటమి కొంత నిరాశ కలిగించింది. ఆధిక్యంలో ఉండి కూడా వెనుకబడటం అంటే ఒక మంచి అవకాశం చేజార్చుకున్నట్లే. అయితే పరాజయాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇదంతా ఆటలో భాగం. వెన్నులో కొంత ఇబ్బందిగా అనిపించడంతో శరీరం తేలికయ్యేందుకు కొంత చికిత్స తీసుకున్నాను. నేను బాగానే ఉన్నాను. నా ఓటమికి ఇది కారణం కాదు. నేను ఎంత పోరాడగలనో అంతా చేశాను. అయినా ఇది దిమిత్రోవ్ విజయం గురించి మాట్లాడాల్సిన సమయమే తప్ప నా గాయం గురించి కాదు. భవిష్యత్తులో మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గుతానా లేదా చెప్పేందుకు నా దగ్గర మంత్రదండమేమీ లేదు. ఏదైనా జరగొచ్చు కాబట్టి గెలవాలనే ఆశిస్తున్నా. కొంత విశ్రాంతి తీసుకొని తర్వాతి టోర్నీకి సిద్ధమవుతా. –ఫెడరర్ సెరెనా సెంచరీ... అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సొంత గడ్డపై సివంగిలా విరుచుకు పడింది. క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్ వాంగ్ కియాంగ్ (చైనా)ను 6–1, 6–0తో చిత్తుగా ఓడించి 13వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 44 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగియడం ఆమె దూకుడుకు నిదర్శనం. ఆరుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన సెరెనాకు ఈ టోర్నీలో ఇది 100వ విజయం కావడం విశేషం. కియాంగ్‌పై సాధించిన ఈ గెలుపు 2019లో అతి తక్కువ వ్యవధిలో ముగిసిన రెండో మ్యాచ్. మాడ్రిడ్ ఓపెన్‌లో కుజ్మోవాను హలెప్ కూడా 44 నిమిషాల్లోనే చిత్తు చేసింది. గత రౌండ్లో రెండో సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కియాంగ్ ఆటలు సెరెనా ముందు సాగలేదు. సెరెనా 25 విన్నర్లు కొడితే కియాంగ్ ఒక్కటీ కొట్టలేకపోయింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)తో సెరెనా తలపడుతుంది. 38 ఏళ్ల సెరెనా 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్ నెగ్గింది. 20 ఏళ్ల తర్వాత ఆమె తన 24వ గ్రాండ్‌స్లామ్ సాధించేందుకు రెండు విజయాల దూరంలో నిలిచింది. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం..!
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్‌సీడెడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఐదు సెట్లపాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో దిమిత్రోవ్ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ డానియెల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు. 28 ఏళ్ల అనంతరం బల్గేరియా ఆటగాడు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించడం ఇదే ప్రథమం. ఇక ఫెదరర్‌తో గతంలో జరిగిన ఏడు మ్యాచుల్లో దిమిత్రోవ్ పరాజయం పాలయ్యాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతైన ఫెదరర్ అనూహ్య రీతిలో ఇంటిదారి పట్టడంతో అభిమానులు నిరాశలో మునిగారు. మూడు గంటల 12 నిముషాల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ 61 తప్పిదాలు చేయడం గమనార్హం. 39 ఏళ్ల ఫెదరర్ ఆటమధ్యలో వీపు నొప్పికి ట్రీట్మెంట్ కోసం విరామం తీసుకున్నాడు. స్విస్ దిగ్గజం ఐదుసార్లు యూఎస్ ఓపెన్ సాధించిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మరో సంచలనం నమోదైంది. బల్గేరియాకు చెందిన మూడో సీడ్ ఆటగాడు దిమిత్రోవ్.. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన బ్రిటీష్ యువ ఆటగాడు ఎడ్మండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఎడ్మండ్ 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో దిమిత్రోవ్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరాడు. దాంతో గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు చేరిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరొకవైపు గ్రాండ్ స్లామ్ ఓపెన్ ఎరాలో సెమీస్‌కు చేరిన ఆరో బ్రిటీష్ క్రీడాకారుడిగా ఎడ్మండ్ గుర్తింపు సాధించాడు. ఎడ్మండ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో దిమిత్రోవ్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొలి సెట్‌ను కోల్పోయి వెనుకబడిన దిమిత్రోవ్.. రెండో సెట్లో గెలిచి పోరులో నిలిచాడు. అయితే కీలకమైన మూడో సెట్‌ను కాపాడుకోవడంలో విఫలమైన దిమిత్రోవ్ మళ్లీ వెనుకబడ్డాడు. ఆపై నాల్గో సెట్లో సైతం బల్గేరియా స్టార్ ఆటగాడు ఆకట్టుకోలేకపోవడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రిక్వార్టర్ ఫైనల్లో దక్షిణకొరియా ఆటగాడు హెయాన్ చుంగ్ చేతిలో జోకర్ ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. -
మళ్లీ శ్రమించి...
రెండో రౌండ్లోనూ ఐదు సెట్లలో గట్టెక్కిన ఫెడరర్ ⇒ ఏడో సీడ్ దిమిత్రోవ్‌కు షాక్ ⇒ యూఎస్ ఓపెన్ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా, మాజీ విజేతలు జొకోవిచ్, ఆండీ ముర్రే గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్స్‌లో ఒకరిగా ఉన్న రోజర్ ఫెడరర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. మిఖాయిల్ యూజ్నీతో జరిగిన రెండో రౌండ్లో ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఐదు సెట్లలో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి రౌండ్లో ఫెడరర్‌ను 19 ఏళ్ల అమెరికా కుర్రాడు ఫ్రాన్సిస్ టియాఫో హడలెత్తించగా... రెండో రౌండ్లో 35 ఏళ్ల యూజ్నీ ఈ స్విస్ స్టార్‌కు చుక్కలు చూపించాడు. అయితే పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 71 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన 36 ఏళ్ల ఈ అపార అనుభవజ్ఞుడు రెండు మ్యాచ్‌ల్లోనూ పైచేయి సాధించడం విశేషం. న్యూయార్క్: తన 18 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో ఫెడరర్ ఒక్కసారి మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఐదు సెట్లు ఆడి గెలుపొందాడు. అదీ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌లో వావ్రింకాపై, ఫైనల్లో నాదల్‌పై ఐదు సెట్లు పోరాడి విజయం సాధించడం జరిగింది. ఏడు నెలల తర్వాత ఫెడరర్ మరోసారి ఈ విన్యాసాన్ని పునరావృతం చేశాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్ చేరుకోవడానికి తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చింది. మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 36 ఏళ్ల ఫెడరర్ 6–1, 6–7 (3/7), 4–6, 6–4, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నెగ్గిన ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో 70వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. యూజ్నీతో ఆడిన 17 సార్లూ ఫెడరరే గెలుపొందడం విశేషం. మూడో రౌండ్లో స్పెయిన్‌కు చెందిన 35 ఏళ్ల ఫెలిసియానో లోపెజ్‌తో ఫెడరర్ ఆడతాడు. లోపెజ్‌తో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 12–0తో ఆధిక్యంలో ఉన్నాడు. యూజ్నీతో జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 63 విన్నర్స్ కొట్టిన ఈ స్విస్ స్టార్ 68 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. ‘తొలి రౌండ్లో కంటే బాగా ఆడినందుకు సంతృప్తిగా ఉంది. అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కష్టంగా అనిపించింది. చివరకు గట్టెక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మూడో రౌండ్ చేరుకునే వరకు నేను అంచనా వేసినదానికంటే ఎక్కువగా అలసిపోయాను. అయితే గతంలో ఇలాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నాను. ఈ విషయంలో నాకెలాంటి ఆందోళన లేదు’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్లో 4–6, 6–3, 6–2, 6–2తో ప్రపంచ 121వ ర్యాంకర్ తారో డానియల్ (జపాన్)పై కష్టపడి గెలిచాడు. ‘అన్ని మ్యాచ్‌లు క్లిష్టంగానే ఉంటాయి. అయితే గ్రాండ్‌స్లామ్ స్థాయి టోర్నీల్లో అందరూ తమ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు చూస్తారు’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 3–6, 7–6 (7/5), 6–7 (2/7), 7–6 (7/4), 6–3తో 4 గంటల 19 నిమిషాల్లో గిడో పెల్లా (అర్జెంటీనా)పై నెగ్గగా.. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–5, 7–6 (7/3), 6–3తో ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను బోల్తా కొట్టించడం విశేషం. 2009 చాంపియన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–2, 6–3, 7–6 (7/3)తో అడ్రియన్ మెనెడెజ్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 4–6, 7–5తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచారు. అన్‌సీడెడ్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్) 3–6, 6–1, 7–6 (7/5), 6–2తో 15వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... 18వ సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 6–7 (3/7), 6–4, 2–6, 7–5తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై కష్టపడి గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో క్విటోవా మహిళల సింగిల్స్ విభాగంలో 13వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో క్విటోవా 6–0, 6–4తో 18వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. కుజ్నెత్సోవా ఇంటిముఖం... మరోవైపు ఎనిమిదో సీడ్, 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) 3–6, 6–3, 3–6తో కురుమి నారా (జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో టాప్–8 సీడింగ్స్ క్రీడాకారిణుల్లో ఐదుగురు మూడో రౌండ్‌లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఆరో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఏడో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఓడిపోగా... ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్లో పరాజయం పాలైంది. ప్రపంచ నంబర్‌వన్, గతేడాది రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–3, 6–4తో క్వాలిఫయర్ నికోల్ గిబ్స్ (అమెరికా)పై శ్రమించి గెలిచింది. షెల్బీ రోజర్స్, గావ్రిలోవా రికార్డు... మహిళల సింగిల్స్ విభాగంలో షెల్బీ రోజర్స్ (అమెరికా), దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) ‘రికార్డు’లో భాగస్వాములయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షెల్బీ 7–6 (8/6), 4–6, 7–6 (7/5)తో గావ్రిలోవాను ఓడించి మూడో రౌండ్లోకి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు జొహనా కొంటా (బ్రిటన్), ముగురుజా (స్పెయిన్) పేరిట ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఆ మ్యాచ్‌లో ముగురుజాపై కొంటా గెలిచింది.