మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో మరో సంచలనం నమోదైంది. బల్గేరియాకు చెందిన మూడో సీడ్ ఆటగాడు దిమిత్రోవ్.. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన బ్రిటీష్ యువ ఆటగాడు ఎడ్మండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఎడ్మండ్ 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో దిమిత్రోవ్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరాడు. దాంతో గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు చేరిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరొకవైపు గ్రాండ్ స్లామ్ ఓపెన్ ఎరాలో సెమీస్‌కు చేరిన ఆరో బ్రిటీష్ క్రీడాకారుడిగా ఎడ్మండ్ గుర్తింపు సాధించాడు.
ఎడ్మండ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో దిమిత్రోవ్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొలి సెట్‌ను కోల్పోయి వెనుకబడిన దిమిత్రోవ్.. రెండో సెట్‌లో గెలిచి పోరులో నిలిచాడు. అయితే కీలకమైన మూడో సెట్‌ను కాపాడుకోవడంలో విఫలమైన దిమిత్రోవ్ మళ్లీ వెనుకబడ్డాడు. ఆపై నాల్గో సెట్‌లో సైతం బల్గేరియా స్టార్ ఆటగాడు ఆకట్టుకోలేకపోవడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రిక్వార్టర్ ఫైనల్లో దక్షిణకొరియా ఆటగాడు హెయాన్ చుంగ్ చేతిలో జోకర్ ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment