మళ్లీ శ్రమించి...
రెండో రౌండ్‌లోనూ ఐదు సెట్‌లలో గట్టెక్కిన ఫెడరర్
⇒ ఏడో సీడ్ దిమిత్రోవ్‌కు షాక్
⇒ యూఎస్ ఓపెన్ టోర్నీ
డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా, మాజీ విజేతలు జొకోవిచ్, ఆండీ ముర్రే గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్స్‌లో ఒకరిగా ఉన్న రోజర్ ఫెడరర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. మిఖాయిల్ యూజ్నీతో జరిగిన రెండో రౌండ్‌లో ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఐదు సెట్‌లలో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి రౌండ్‌లో ఫెడరర్‌ను 19 ఏళ్ల అమెరికా కుర్రాడు ఫ్రాన్సిస్ టియాఫో హడలెత్తించగా... రెండో రౌండ్‌లో 35 ఏళ్ల యూజ్నీ ఈ స్విస్ స్టార్‌కు చుక్కలు చూపించాడు. అయితే పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 71 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన 36 ఏళ్ల ఈ అపార అనుభవజ్ఞుడు రెండు మ్యాచ్‌ల్లోనూ పైచేయి సాధించడం విశేషం.
న్యూయార్క్: తన 18 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌లో ఫెడరర్ ఒక్కసారి మాత్రమే ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఐదు సెట్‌లు ఆడి గెలుపొందాడు. అదీ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌లో వావ్రింకాపై, ఫైనల్లో నాదల్‌పై ఐదు సెట్‌లు పోరాడి విజయం సాధించడం జరిగింది. ఏడు నెలల తర్వాత ఫెడరర్ మరోసారి ఈ విన్యాసాన్ని పునరావృతం చేశాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్ చేరుకోవడానికి తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చింది. మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 36 ఏళ్ల ఫెడరర్ 6–1, 6–7 (3/7), 4–6, 6–4, 6–2తో గెలుపొందాడు.
3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నెగ్గిన ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో 70వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. యూజ్నీతో ఆడిన 17 సార్లూ ఫెడరరే గెలుపొందడం విశేషం. మూడో రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన 35 ఏళ్ల ఫెలిసియానో లోపెజ్‌తో ఫెడరర్ ఆడతాడు. లోపెజ్‌తో ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 12–0తో ఆధిక్యంలో ఉన్నాడు. యూజ్నీతో జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 63 విన్నర్స్ కొట్టిన ఈ స్విస్ స్టార్ 68 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. ‘తొలి రౌండ్‌లో కంటే బాగా ఆడినందుకు సంతృప్తిగా ఉంది. అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కష్టంగా అనిపించింది. చివరకు గట్టెక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మూడో రౌండ్ చేరుకునే వరకు నేను అంచనా వేసినదానికంటే ఎక్కువగా అలసిపోయాను.
అయితే గతంలో ఇలాంటి సందర్భాలు చాలా ఎదుర్కొన్నాను. ఈ విషయంలో నాకెలాంటి ఆందోళన లేదు’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్‌లో 4–6, 6–3, 6–2, 6–2తో ప్రపంచ 121వ ర్యాంకర్ తారో డానియల్ (జపాన్)పై కష్టపడి గెలిచాడు. ‘అన్ని మ్యాచ్‌లు క్లిష్టంగానే ఉంటాయి. అయితే గ్రాండ్‌స్లామ్ స్థాయి టోర్నీల్లో అందరూ తమ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు చూస్తారు’ అని నాదల్ వ్యాఖ్యానించాడు.
మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 3–6, 7–6 (7/5), 6–7 (2/7), 7–6 (7/4), 6–3తో 4 గంటల 19 నిమిషాల్లో గిడో పెల్లా (అర్జెంటీనా)పై నెగ్గగా.. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 7–5, 7–6 (7/3), 6–3తో ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)ను బోల్తా కొట్టించడం విశేషం. 2009 చాంపియన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–2, 6–3, 7–6 (7/3)తో అడ్రియన్ మెనెడెజ్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 4–6, 7–5తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచారు. అన్‌సీడెడ్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్) 3–6, 6–1, 7–6 (7/5), 6–2తో 15వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... 18వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 6–7 (3/7), 6–4, 2–6, 7–5తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)పై కష్టపడి గెలిచాడు.
ప్రిక్వార్టర్స్‌లో క్విటోవా
మహిళల సింగిల్స్ విభాగంలో 13వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో క్విటోవా 6–0, 6–4తో 18వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది.
కుజ్‌నెత్సోవా ఇంటిముఖం...
మరోవైపు ఎనిమిదో సీడ్, 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 3–6, 6–3, 3–6తో కురుమి నారా (జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో టాప్–8 సీడింగ్స్ క్రీడాకారిణుల్లో ఐదుగురు మూడో రౌండ్‌లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఆరో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఏడో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) తొలి రౌండ్‌లోనే ఓడిపోగా... ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్‌లో పరాజయం పాలైంది. ప్రపంచ నంబర్‌వన్, గతేడాది రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–3, 6–4తో క్వాలిఫయర్ నికోల్ గిబ్స్ (అమెరికా)పై శ్రమించి గెలిచింది.
షెల్బీ రోజర్స్, గావ్రిలోవా రికార్డు...
మహిళల సింగిల్స్ విభాగంలో షెల్బీ రోజర్స్ (అమెరికా), దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) ‘రికార్డు’లో భాగస్వాములయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. 3 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షెల్బీ 7–6 (8/6), 4–6, 7–6 (7/5)తో గావ్రిలోవాను ఓడించి మూడో రౌండ్‌లోకి చేరుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు జొహనా కొంటా (బ్రిటన్), ముగురుజా (స్పెయిన్) పేరిట ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఆ మ్యాచ్‌లో ముగురుజాపై కొంటా గెలిచింది.