Federer
-
నిష్క్రమించిన దిగ్గజం
బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్ కప్‌తో ఇక గ్రౌండ్‌నుంచి నిష్క్రమించబోతున్నానని ఆ ప్రకటన సారాంశం. నిజానికి ఇది ఊహిం చని పరిణామ మేమీ కాదు. ఆయన రేపో, మాపో ఆటకు గుడ్‌బై చెబుతాడని మూడు నాలుగేళ్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో ఫెదరర్‌కు గాయాలూ, శస్త్ర చికిత్సలూ రివాజయ్యాయి. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆటకు విరామం ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నిరుడు జూలైకి ముందు 14 నెలలుగా అతను ఆడింది లేదు. ఆ నెలలో జరిగిన వింబుల్డన్ క్వార్టర్స్‌లో దారుణమైన ఓటమి చవిచూశాడు. అందుకే ఫెదరర్ ఏం చెబుతాడోనన్న సందేహం అభిమానులను నిత్యం వేధించేది. అలాగని టెన్నిస్‌లో అతనేమీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన మేటి ఆటగాడు కాదు. టెన్నిస్ దిగ్గజ త్రయంలో ఫెదరర్తోపాటున్న రాఫెల్ నాదల్, జోకోవిచ్లిద్దరూ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ రేస్‌లో అతన్నెప్పుడో అధిగమించారు. ఆ త్రయంలో అతనిది మూడో స్థానమే. కానీ ఎప్పుడూ అంకెలే వీక్షకుల్ని చకితుల్ని చేయలేవు. తన ఆటకు సృజనాత్మకతను జోడించడం, అందరూ కొట్టే షాట్లే అయినా ప్రతిసారీ తన ప్రత్యేకతను ప్రదర్శించడం, చురుకైన తన కదలికలతో వీక్షకుల్ని కట్టిపడేయడం ఫెదరర్‌కే సాధ్యం. ఆ కదలికల్లో ఒక్కటైనా అనవసరమైనది కనబడదు. తనవైపు దూసుకొచ్చిన బంతిని ప్రత్యర్థి అంచనాకు అందని రీతిలో కొట్టి వారితో తప్పులు చేయించడం, పాయింట్ సాధించడం అతనికి అలవోకగా అబ్బిన విద్య. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లు రెండింటికీ అతనే కేరాఫ్ అడ్రస్. ఫుట్‌వర్క్, అటాకింగ్ గేమ్ అతనికే సొంతం. ఒక్కోసారి కొన్ని షాట్లు విఫలం కావొచ్చుగాక... గెలుపోటములతో నిమిత్తం లేకుండా అవి మళ్లీ మళ్లీ నెమరేసుకునే దృశ్యాలుగానే ఎప్పటికీ మిగిలాయి. అందుకే ఆటలో ప్రత్యేక ప్రతిభ తన సొంతమని అతను చేసిన ప్రకటన ఎవరికీ అతిశయోక్తి అనిపించలేదు. 2002లోనే అతను టాప్–50 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది జూన్ వరకూ చెక్కు చెదరకుండా అక్కడే నిలిచాడు. పురుషుల టెన్నిస్‌లో 2004లో నంబర్ వన్ ప్లేయర్ అయ్యాడు. 2008 వరకూ నిరంతరాయంగా కొనసాగాడు. అనేకసార్లు మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఎదురయ్యే అవరోధాలను అధిగ మించేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం ఫెదరర్ ఆటలో కనబడుతుంది. ఈ లక్షణమే అతన్ని ఇప్పటికీ యోధుడిగా నిలిపింది. ఓడిన సందర్భాల్లో సైతం క్రీడాభిమానులు అతనికి నీరాజనాలు పట్టేలా చేసింది. 41 ఏళ్ల వయసంటే... దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవమంటే... 1,500కు మించిన మ్యాచ్‌లంటే ఏ క్రీడాకారుడికైనా నిష్క్రమించక తప్పని సమయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త తారలు దూసుకొస్తుంటాయి. ఆటను కొత్తపుంతలు తొక్కిస్తుంటాయి. నాదల్, జోకోవిచ్ల సంగతలా ఉంచి హ్యూబర్ట్ హుర్కజ్లాంటి సరికొత్త మెరుపు ముందు ఫెదరర్ తలవంచక తప్పని సందర్భమూ వచ్చింది. అందుకే కావొచ్చు... తన శరీర సామర్థ్యంపై మదింపు వేసుకున్నాడు. తన పరిమితులేమిటో తెలుసుకున్నాడు. ఫెదరర్ వదిలిపోతున్న వారసత్వం అత్యుత్తమమైనది. ఒక ఆటగాడు వ్యక్తిగా ఎలా ఉండాలో, ఎలాంటి ప్రమాణాలు పాటించాలో తన సద్వర్తన ద్వారా అతను చూపాడు. ఓటమి ఎదురైతే ప్రత్యర్థులపై నిప్పులు కక్కడం ఏ ఆటలోనైనా ఇప్పుడు రివాజు. గెలుపు సాధించినవారు విర్రవీగుతున్న ఉదంతాలూ లేకపోలేదు. ఇక టెన్నిస్‌లో ఓటమి ఎదురైతే సహనం కోల్పోయి రాకెట్లు విరగ్గొడుతున్నవారూ ఉంటున్నారు. ఎన్నడో కెరీర్ మొదట్లో ఫెదరర్ కూడా సహనం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ అతి త్వరలోనే తన ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడితే సత్ఫలితం సాధించడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన పేరిట ఉన్న ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించే నిస్సహాయ పిల్లలకు చేయూతనందించడం, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడినప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో విరాళాలు సేకరించి ఆపన్న హస్తం అందించడం అతని ప్రత్యేకత. ఆటాడుతున్నప్పుడు నాదల్, జొకోవిచ్‌లతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడటం షరా మామూలే అయినా ఎప్పుడూ అవి వ్యక్తిగత వివాదాలుగా ముదరలేదు. చెప్పాలంటే ఆ ముగ్గురూ కలిసి టెన్నిస్‌కు కనీవినీ ఎరుగని జనాదరణను తెచ్చారు. ఆ ఆట స్థాయిని పెంచారు. జోకోవిచ్‌పై ఒక సందర్భంలో డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా ఆటంకాలెదురయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కాలికి సమస్య ఏర్పడటంతో కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానని నాదల్ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఇలాంటి వివాదాలేవీ ఫెదరర్‌కు ఎదురుకాలేదు. టెన్నిస్ ప్రపంచంలో చివరంటా ధ్రువతారగా కొనసాగిన ఫెదరర్ మిగిల్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెక్కుచెదరనివి. అభిమానులకు ఎప్పటికీ అపురూపమైనవి. -
యూఎస్ ఓపెన్: పునరాగమనంపై ఫెడరర్ క్లారిటీ
గ్రాస్ కోర్ట్ సీజన్ సందర్భంగా దురదృష్టవశాత్తు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ మోకాలికి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో ఈ ఆటగాడు మళ్లీ రాకెట్ పట్టలేదు. అయితే తాజాగా తన పునరాగమనంపై ఫెడరర్ స్పందించాడు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఫెడరర్ తాను యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ ఇటీవల చేసుకున్న శస్త్రచికిత్స కారణంగా వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఫెడరర్ మాట్లాడుతూ.. ఇటీవల గాయం కారణంగా చాలా నెలలు ఆటకు దూరంగా ఉన్నాను. ఇది కొన్ని విధాలుగా కష్టంగా ఉంటుంది, కానీ అదే సమయంలో నేను ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటున్నా. "నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, నన్ను తప్పుగా భావించవద్దు. ఈ వయసులో ఇప్పుడు మరొక శస్త్రచికిత్స చేసి ప్రయత్నించడం ఎంత కష్టమో నాకు తెలుసు, ”అని తెలిపాడు. ఇప్పటికే నేను రిహాబిలిటేషన్ ప్రారంభించాను. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకం ఉందంటూ ఫెడరర్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Roger Federer (@rogerfederer) -
పునరాగమనంపై అనిశ్చితి: ఫెడరర్
ఈనెల 30న మొదలయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ వింబుల్డన్ టోర్నీ తర్వాత ఆటకు విరామం ఇచ్చాడు. ‘వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో మళ్లీ రాకెట్ పట్టలేదు. ఈ వారంలో డాక్టర్లను కలవాల్సి ఉంది. ఇప్పటికైతే నా పునరా గమనంపై అనిశ్చిత నెలకొని ఉంది’ అని ఫెడరర్ వివరించాడు. -
తదుపరి లక్ష్యం ఫెడరర్ రికార్డు
మెల్బోర్న్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును అధిగమించడమే తన తదుపరి లక్ష్యమని సెర్బియా స్టార్ జొకోవిచ్ తెలిపాడు. రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 32 ఏళ్ల జొకోవిచ్ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో... 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్పెయిన్ స్టార్ నాదల్ రెండో స్థానంలో ఉన్నారు. ‘నా జీవితంలోని ఈ దశలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ మెగా టోర్నీల కోసమే నేను పూర్తి సీజన్లో ఆడుతున్నాను. ఫెడరర్ రికార్డును అందుకోవడం, దానిని అధిగమించడమే నా తదుపరి లక్ష్యం. గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో సీజన్‌ను ప్రారంభించినందుకు అమితానందంతో ఉన్నాను. ఇదే ఉత్సాహంతో మిగిలిన సీజన్లో మంచి ఫలితాలు సాధిస్తాను’ అని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
సెరెనా సాధించేనా?
మెల్బోర్న్: టెన్నిస్‌లో ఆ్రస్టేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ పేరు మీదున్న ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డు (24)ను సమం చేయడానికి సెరెనా విలియమ్స్ ఒకవైపు... పురుషుల విభాగంలో ఫెడరర్ (20 టైటిల్స్) సరసన చేరడానికి ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ దూరంలో ఉన్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మరోవైపు... నేటి నుంచి ఆరంభమయ్యే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్, ఏడుసార్లు విజేత జొకోవిచ్ (సెర్బియా), 38 ఏళ్ల వయసులోనూ తన బ్యాక్ హ్యాండ్ పవర్ ఏమాత్రం తగ్గలేదంటూ రోజర్ ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గని సెరెనాను మార్గరెట్ కోర్ట్ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తోంది. తల్లి అయ్యాక... సెరెనా నాలుగు గ్రాండ్‌స్లామ్ (2018–వింబుల్డన్, యూఎస్; 2019–వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోరీ్నలలో ఫైనల్స్ చేరినా... టైటిల్‌ను గెలవడంలో మాత్రం విఫలమైంది. అయితే ఆక్లాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సెరెనా ఆత్మవిశ్వాసంతో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో బరిలో దిగుతోంది. నేటి తొలి రౌండ్ మ్యాచ్‌లో పొటపోవా (రష్యా)తో సెరెనా ఆడుతుంది. -
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం...
మెల్బోర్న్: ఆ్రస్టేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు బాధితులకు సాంత్వన పలికేందుకు టెన్నిస్ హేమాహేమీలు బరిలోకి దిగనున్నారు. టెన్నిస్ సూపర్‌స్టార్స్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్), సెరెనా (అమెరికా) తదితర దిగ్గజాలు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు సై అన్నారు. విరివిగా నిధులు సేకరించేందుకు ఈ చారిటీ మ్యాచ్‌లు దోహదం చేస్తాయని టెన్నిస్ ఆ్రస్టేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ వెల్లడించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ టోరీ్నకి సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ నెల 15న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో దిగ్గజాలు తలపడతారు. నయోమి ఒసాకా (జపాన్), వొజి్నయాకి (డెన్మార్క్), కిరియోస్ (ఆ్రస్టేలియా), సిట్సిపాస్ (గ్రీస్)లు విరాళాల సేకరణ కోసం హేమాహేమీలతో కలిసి ఆడనున్నారు. ఈ ఎగ్జిబిషన్ చారిటీ మ్యాచ్‌ల ద్వారా సుమారు 1.2 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.5.88 కోట్లు) సేకరించి బాధితులకు ఇవ్వనున్నారు. -
శభాష్ సుమీత్
కెరీర్లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ ఆడిన భారత యువ ప్లేయర్ సుమీత్ నాగల్ సంచలన ప్రదర్శన చేశాడు. 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత ఫెడరర్‌పై ఏకంగా తొలి సెట్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఫెడరర్ వెంటనే తేరుకొని ఆ తర్వాతి మూడు సెట్లను సాధించి విజయాన్ని అందుకున్నాడు. మొత్తానికి మ్యాచ్ ఓడినా... తన ఆటతో సుమీత్ మనసులు గెల్చుకున్నాడు. న్యూయార్క్: ఊహించిన ఫలితమే వచ్చినా... భారత యువ ఆటగాడు సుమీత్ నాగల్ పరాజయంలోనూ గౌరవాన్ని పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్, ప్రపంచ 190వ ర్యాంకర్ సుమీత్ నాగల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్, 38 ఏళ్ల రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమీత్ 6–4, 1–6, 2–6, 4–6తో ఓడిపోయాడు. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ కళ్లు చెదిరే ఇన్సైడ్ అవుట్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ సాగుతున్నకొద్దీ ఫెడరర్ దూకుడు పెంచగా... అంతర్జాతీయ అనుభవం అంతగా లేకున్నా సుమీత్ ప్రతీ పాయింట్‌కు తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ఫెడరర్‌కు సులువుగా పాయింట్లు ఇవ్వకుండా పోరాడాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి 7 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 57 అనవసర తప్పిదాలు చేసిన స్విస్ దిగ్గజం ఏడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరోవైపు సుమీత్ మూడుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఫెడరర్‌లాంటి దిగ్గజంతో నా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్ ఆడినందుకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఫెడరర్ ఆటను చూశాక ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను’ అని 22 ఏళ్ల సుమీత్ వ్యాఖ్యానించాడు. ‘సుమీత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఈ మ్యాచ్‌లో అతను చాలా నిలకడగా ఆడాడు. అంతర్జాతీయస్థాయిలో సక్సెస్ సాధించాలంటే ఈ రకమైన ఆటతీరును కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఫెడరర్ అన్నాడు. తొలి రౌండ్లో ఓడిన సుమీత్కు 35 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–1, 6–4తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–1, 6–1తో షరపోవా (రష్యా)పై గెలిచింది. గత రెండు దశాబ్దాల్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మ్యాచ్‌లో ఒక సెట్ గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో సోమ్‌దేవ్, యూకీ బాంబ్రీ, సాకేత్ ఈ ఘనత సాధించారు. ఫెడరర్‌పై మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లో సెట్ గెలిచిన ఏకైక భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో ఫెడరర్‌తో రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ మ్యాచ్‌లు ఆడినా వరుస సెట్లలో ఓడిపోయారు. -
జొకోవిచ్ X ఫెడరర్
లండన్: ఈ సీజన్లో తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 4–6, 6–3, 6–2తో 23వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో జొకోవిచ్ తలపడతాడు. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/3), 1–6, 6–3, 6–4తో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై గెలిచాడు. వరుసగా 21వ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్ 12వసారి ఫైనల్‌కు చేరాడు. 8 సార్లు టైటిల్ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఏడాది బాటిస్టా అగుట్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన జొకోవిచ్ మూడోసారి మాత్రం విజయాన్ని రుచి చూశాడు. 27వ ప్రయత్నంలో కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన అగుట్ ఆ అడ్డంకిని మాత్రం దాటలేకపోయాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పోరులో జొకోవిచ్‌కు రెండో సెట్ మినహా అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన అతను 42 సార్లు పాయింట్లు సాధించడం విశేషం.అగుట్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ రెండో సెట్లో ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయాడు. 42 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అగుట్ కేవలం ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అగుట్పై విజయంతో జొకోవిచ్ తన కెరీర్లో 25వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరాడు. 15 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతను 9సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. వింబుల్డన్ ట్రోఫీని నాలుగుసార్లు (2011, 2014, 2015, 2018) సొంతం చేసుకున్న జొకోవిచ్ ఒకసారి (2013లో) రన్నరప్‌గా నిలిచాడు. -
ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 7–5, 6–2, 7–6 (7/4)తో లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–3, 6–2తో సోంగా (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–4తో జులియా జార్జెస్ (జర్మనీ)పై, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–1తో హరియెట్ డార్ట్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. -
రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలిగిన ఫెడరర్
గతవారం మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్... రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్లో వైదొలిగాడు. గ్రీస్ యువతార సిట్సిసాస్తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అతను కుడి కాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ‘నేను వంద శాతం ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను’ అని 2015 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఆడనున్న ఫెడరర్ వ్యాఖ్యానించాడు. -
మయామి ఓపెన్ సెమీస్‌లో ఫెడరర్
మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6–0, 6–4తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. సెమీస్‌లో కెనడా యువ సంచలనం డెనిస్ షపోవలోవ్‌తో ఫెడరర్ ఆడతాడు. క్వార్టర్ ఫైనల్లో షపోవలోవ్ 6–7 (5/7), 6–4, 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. -
ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఫెడరర్ 7–5, 6–3తో ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఫెడరర్‌కిది 52వ విజయం కావడం విశేషం. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 14 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్యా యువ సంచలనం డానిల్ మెద్వెదెవ్‌తో ఫెడరర్ ఆడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ మెద్వెదెవ్ 7–6 (7/5), 6–7 (5/7), 7–6 (7/0)తో రీలి ఒపెల్కా (అమెరికా)పై గెలిచాడు. గత ఏడాది కాలంలో మెద్వెదెవ్ మూడు టైటిల్స్ సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. హలెప్ ముందంజ... ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 6–3, 6–3తో 38 ఏళ్ల వీనస్ విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ ఒసాకా (జపాన్)పై నెగ్గిన సు వె సెయి (చైనీస్ తైపీ) మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సు వె సెయి 6–3, 6–7 (0/7), 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3 తో గార్సియా (ఫ్రాన్స్)పై, ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–3, 7–5తో యులియా (కజకిస్తాన్)పై గెలిచారు. -
చాంప్స్ థీమ్, బియాంక
కాలిఫోర్నియా: టైటిల్ ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్స్ అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)... మహిళల సింగిల్స్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన బియాంక ఆండ్రీస్కు (కెనడా) టైటిల్స్ సొంతం చేసుకొని సంచలనం సృష్టించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్ 3–6, 6–3, 7–5తో నాలుగో సీడ్, గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బియాంక ఆండ్రీస్కు 6–4, 3–6, 6–4తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది. చాంపియన్స్‌గా నిలిచిన థీమ్, బియాంకాలకు 13,54,010 డాలర్ల (రూ. 9 కోట్ల 29 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 22 ఏళ్ల తర్వాత... గతంలో రెండుసార్లు మాస్టర్స్ ఫైనల్స్ (మాడ్రిడ్ ఓపెన్) ఆడి రెండుసార్లూ ఓడిపోయిన డొమినిక్ థీమ్‌కు మూడో ఫైనల్ కలిసొచ్చింది. దిగ్గజ ప్రత్యర్థి ముందున్నా... తొలి సెట్‌ను కోల్పోయినా... ఏదశలోనూ నిరాశకు లోనుకాకుండా ఆడిన థీమ్ ఆఖరికి అనుకున్న ఫలితం సాధించాడు. చెరో సెట్ గెలిచాక... నిర్ణాయక మూడో సెట్లోని 11వ గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన థీమ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 22 ఏళ్ల తర్వాత మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఆస్ట్రియా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా తరఫున చివరిసారి థామస్ ముస్టర్ (1997లో మయామి ఓపెన్) మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచాడు. -
సెరెనా జంటపై ఫెడరర్ జోడీ గెలిచింది
పెర్త్: హాప్‌మన్ కప్‌లో అరుదైన సమరం ఆవిష్కృతమైంది. ‘ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్’ ఫెడరర్ (స్విట్జర్లాండ్), సెరెనా విలియమ్స్ (అమెరికా) తొలిసారి కోర్టులో ‘ఢీ’కొన్నారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన ఈ పోరు హాప్‌మన్ కప్‌కే హైలైట్‌గా నిలిచింది. దేశాల మధ్య జరిగే ఈ టీమ్ ఈవెంట్లో తొలి సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్విట్జర్లాండ్ తరఫున ఫెడరర్ 6–4, 6–1తో టియాఫో (అమెరికా)పై నెగ్గాడు. తర్వాత మహిళల సింగిల్స్‌లో సెరెనా 4–6, 6–4, 6–3తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించడంతో స్కోరు 1–1తో సమమైంది. ఇక నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్‌లో ఫెడరర్–బెన్సిచ్ జంట 4–2, 4–3 (5/3) సెరెనా–టియాఫొ జోడీపై గెలిచింది. కోర్టులో రాకెట్లు దూసిన దిగ్గజాలు మ్యాచ్ ముగిశాక తమ స్మార్ట్ఫోన్లతో సెల్ఫీ ముచ్చట తీర్చుకున్నారు. ఆటతో పాటు ఈ హేమాహేమీల ‘స్వీయచిత్రం’ అందర్నీ ఆకట్టి పడేసింది. అన్నట్లు వెంటనే ఇద్దరు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తమదైన శైలి క్యాప్షన్లతో పోస్ట్ చేయడంతో లెక్కలేనన్ని లైక్‌లు వస్తున్నాయి. -
యూరోప్ జట్టుదే లేవర్ కప్
షికాగో (అమెరికా): పురుషుల టెన్నిస్‌లో యూరోప్ ఆటగాళ్ల ఆధిపత్యాన్ని చాటుకుంటూ వరుసగా రెండో ఏడాది రాడ్ లేవర్ కప్‌ను యూరోప్ జట్టు దక్కించుకుంది. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), జ్వెరెవ్ (జర్మనీ), దిమిత్రోవ్ (బల్గేరియా), గాఫిన్ (బెల్జియం), ఎడ్మండ్ (బ్రిటన్)లతో కూడిన యూరోప్ జట్టు 13–8తో ప్రపంచ జట్టుపై గెలుపొందింది. ప్రపంచ జట్టుకు అండర్సన్ (దక్షిణాఫ్రికా), ఇస్నెర్ (అమెరికా), కిరియోస్ (ఆస్ట్రేలియా), జాక్ సోక్ (అమెరికా), ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా), టియాఫో (అమెరికా) ప్రాతినిధ్యం వహించారు. చివరి రోజు మూడు మ్యాచ్‌లు జరుగగా... రెండింటిలో యూరోప్ ఆటగాళ్లు గెలిచి కప్‌ను సొంతం చేసుకున్నారు. డబుల్స్ మ్యాచ్‌లో ఇస్నెర్–జాక్ సోక్ (వరల్డ్ టీమ్) ద్వయం 4–6, 7–6 (7/2), 11–9తో ఫెడరర్–జ్వెరెవ్ (యూరోప్) జోడీని ఓడించింది. ఆ తర్వాత సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–7 (5/7), 7–6 (8/6), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇస్నెర్ (వరల్డ్ టీమ్)పై గెలిచాడు. చివరి మ్యాచ్‌లో జ్వెరెవ్ 6–7 (3/7), 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో అండర్సన్ (వరల్డ్ టీమ్)పై విజయం సాధించి యూరోప్ విజయాన్ని ఖాయం చేశాడు. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో యూరోప్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో... వరల్డ్ టీమ్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. -
ఫెడరర్ అలవోకగా...
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్స్టార్లంతా తొలిరౌండ్‌ను సులభంగానే అధిగమించారు. స్విట్జర్లాండ్ దిగ్గజం, ఐదు సార్లు యూఎస్ విజేత అయిన ఫెడరర్ 6–2, 6–2, 6–4తో జపాన్‌కు చెందిన యోషిహితో నిషిఒకాపై విజయం సాధించగా, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7–5, 6–1, 1–1తో ఆధిక్యంలో ఉన్న దశలో మారియస్ కొపిల్ (రొమేనియా) వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6–3, 6–2తో స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా, నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7–6 (7/5), 6–3తో గాస్పర్యాన్ (రష్యా)ను ఓడించింది. మరో వైపు భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఆట తొలిరౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 96వ ర్యాంకర్ యూకీ 3–6, 6–7 (3/7), 5–7తో పీర్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ఎండతో పోరాడలేక... సెర్బియన్ స్టార్ నోవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ లో ఒంటిని పిండేసే ఎండతో విలవిల్లాడాడు. 38డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తాళలేక రెండు సెట్లయ్యాక చివరకు జొకో, అతని ప్రత్యర్థి మార్టన్ ఫుక్సోవిక్స్ (హంగేరి) మాకో పది నిమిషాల విశ్రాంతి కావాల్సిందేనంటూ కోర్టు బయటికొచ్చారు. అప్పుడు ఇద్దరు చెరో సెట్ గెలిచివున్నారు. కోర్టు పక్కనే జొకో, ఫుక్సోవిక్స్ చొక్కాలిప్పి ఐస్‌బాత్‌తో సేదతీరాకే మళ్లీ రాకెట్ పట్టారు. చివరకు సెర్బియన్ స్టార్ 6–3, 3–6, 6–4, 6–0తో ఫుక్సోవిక్స్పై నెగ్గాడు. -
సై అంటే సై అంటున్న ‘బిగ్ ఫోర్’
న్యూయార్క్: ఈ ఏడాది ‘బిగ్ ఫోర్’తో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరం కానుంది. గాయంతో చాన్నాళ్లుగా ఆటకు దూరమైన మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) పునరాగమనంతో పాటు ఈ ఏడాది ‘గ్రాండ్’ చాంపియన్లు ఫెడరర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్), నాదల్ (ఫ్రెంచ్), జొకోవిచ్ (వింబుల్డన్) బరిలోకి దిగనుండటంతో యూఎస్ ఓపెన్‌లో హోరాహోరీకి రంగం సిద్ధమైంది. టాప్ స్టార్లంతా ఆడుతున్న సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీకి నేడు తెరలేవనుంది. భారత్ నుంచి యూకీ బాంబ్రీ పురుషుల సింగిల్స్‌లో... రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ డబుల్స్‌లో దిగుతున్నారు. ‘24’ కోసం సెరెనా... మహిళల సింగిల్స్ బరిలో ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ సెరెనా ఈసారి విజేతగా నిలిస్తే అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. జోరుమీదున్న ‘జోకర్’... వింబుల్డన్ చాంపియన్, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) న్యూయార్క్‌లోనూ టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది భుజం గాయంతో యూఎస్‌కు దూరమైన ‘జోకర్’ ఇక్కడ మూడో టైటిల్ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. 2011, 2015లలో విజేతగా నిలిచిన జొకో ఐదుసార్లు రన్నరప్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో ఫెడరర్‌పై టైటిల్ గెలిచిన జొకోవిచ్ మొత్తం తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జోరు మీదున్న ఈ సెర్బియన్ స్టార్ తన ఫామ్ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్), రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. -
‘రాజు’ కూలె పచ్చికపై...
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. వింబుల్డన్ పచ్చిక కోర్టులపై అద్వితీయ రికార్డు కలిగిన ఈ డిఫెండింగ్ చాంపియన్ ప్రస్థానం ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఎనిమిదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ 6–2, 7–6 (7/5), 5–7, 4–6, 11–13తో ఓడిపోయాడు. 4 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 8 అంగుళాల పొడవు, 92 కేజీల బరువున్న అండర్సన్ 28 ఏస్‌లు సంధించి, 65 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు తొలి రెండు సెట్లు గెలిచి... మూడో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి... అండర్సన్ సర్వీస్‌లో మ్యాచ్ పాయింట్ సంపాదించిన ఫెడరర్ బ్యాక్‌హ్యాండ్ షాట్ బయటకు కొట్టి విజయం సాధించే సువర్ణావకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత అండర్సన్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. అనంతరం ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని మూడో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్లో ఒకసారి ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అండర్సన్ అదే జోరులో ఈ సెట్‌నూ దక్కించుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌కూ హోరాహోరీగా పోరాడారు. చివరకు ఫెడరర్ సర్వీస్ చేసిన 23వ గేమ్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించాడు. అనంతరం తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని సంచలన విజయం దక్కించుకున్నాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్ మ్యాచ్ పాయింట్ సంపాదించాక ఓడిపోవడం ఇదే తొలిసారి. కెవిన్ కరెన్ (1983లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా అండర్సన్ గుర్తింపు పొందాడు. జొకోవిచ్ జోరు... మరో క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 3–6, 6–2, 6–2తో నిషికోరి (జపాన్)పై గెలిచి 2015 తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
థీమ్ నిష్క్రమణ వింబుల్డన్ టోర్నీ
లండన్: గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ వింబుల్డన్ టోర్నమెంట్లో మాత్రం తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఆస్ట్రియా ఆటగాడు మార్కోస్ బగ్ధాటిస్ (సైప్రస్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 4–6, 5–7తో రెండు సెట్లను చేజార్చుకొని మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో థీమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4–6, 3–6, 4–6తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో నాదల్ 6–3, 6–3, 6–2తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై, జ్వెరెవ్ 7–5, 6–2, 6–0తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, డెల్‌పొట్రో 6–3, 6–4, 6–3తో గొజోవిక్ (జర్మనీ)పై గెలిచారు. క్విటోవా ఇంటిముఖం... మహిళల సింగిల్స్‌లో 2011, 2014 చాంపియన్, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బెలారస్ అమ్మాయి సస్నోవిచ్ 6–4, 4–6, 6–0తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 7–5తో బ్రాడీ (బ్రిటన్)పై, టాప్ సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా) 6–2, 6–4తో కురిమి (జపాన్)పై గెలిచారు. ఫెడరర్ రికార్డు బద్దలు వరుసగా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు ఆడిన ప్లేయర్‌గా స్పెయిన్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (వరుసగా 65) పేరిట ఉన్న ఈ రికార్డును వరుసగా 66వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న లోపెజ్ బద్దలు కొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో లోపెజ్ 6–3, 6–4, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై గెలిచాడు. -
రాఫెల్ నాదలే మహా గొప్ప...
రోమ్: టెన్నిస్ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరంటే ప్రస్తుతానికి అందరూ ఠక్కున చెప్పే పేరు రోజర్ ఫెడరర్. కానీ... మహిళల మాజీ నం.1 మరియా షరపోవా మాత్రం రాఫెల్ నాదల్ అంటోంది. ఈ మేరకు ఆమె సోమవారం ట్విట్టర్లో పెట్టిన వీడియో వివాదాస్పదమైంది. ఇటాలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా నాదల్‌తో కలిసి ఇక్కడ సాధనలో పాల్గొంటున్న షరపోవా... ‘కోర్టులో రెండు నిమిషాల సాధనలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీవోఏటీ) ఆటగాడి ముందు తేలిపోయాను’ అంటూ పోస్ట్ చేసింది. ఇందులో ‘మట్టి కోర్టులపై గ్రేటెస్ట్ ఆటగాడు’ అని నొక్కి చెప్పకపోవడంతో... ఫెడరర్ అభిమానులకు మరోలా అనిపించింది. గెలిచిన 16 గ్రాండ్‌స్లామ్స్‌లో పది మట్టి కోర్టులపై ఆడే ఫ్రెంచ్ ఓపెనే కాగా... నాదల్ గ్రేటెస్ట్ ఎలా అవుతాడంటూ వారు మండిపడ్డారు. ఇది ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చకు దారి తీసింది. మరోవైపు కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ ఖాతాలో ఒక ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఉంది. ముఖాముఖిలో మాత్రం ఫెడరర్‌పై నాదల్ (23–15)దే పైచేయి కావడం విశేషం. -
ఫెడరర్... మళ్లీ నంబర్‌వన్
పారిస్: రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నప్పటికీ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. గతవారం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాఫెల్ నాదల్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో నాదల్ ఓడిపోయాడు. దాంతో అతని పాయింట్లలో కోత పడింది. మరోవైపు గత ఏడాది మాదిరిగా ఈసారీ ఫెడరర్ క్లే కోర్టు సీజన్లో ఆడటం లేదు. ఫలితంగా ఫెడరర్ అదనంగా పాయింట్లు కోల్పోయే అవకాశం లేదు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడరర్ 8,670 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా... గత వారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న నాదల్ 7,950 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఈ వారంలో రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్‌లో గనుక నాదల్ విజేతగా నిలిస్తే మళ్లీ నంబర్‌వన్ అవుతాడు. 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న ఫెడరర్ 2008 ఆగస్టు 17 వరకు ఆ స్థానంలో కొనసాగాడు. కొంతకాలంపాటు నాదల్, జొకోవిచ్‌లకు టాప్ ర్యాంక్ కోల్పోయిన అనంతరం ఫెడరర్ 2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు మళ్లీ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు అగ్రస్థానంలో కొనసాగాడు. ఆ తర్వాత నాదల్, జొకోవిచ్ ధాటికి వెనుకబడిపోయిన ఫెడరర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి ఫిబ్ర వరిలో ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టాప్ ర్యాంక్ అందుకున్న పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. -
‘డెవిల్’ పొట్రో...
కాలిఫోర్నియా: ఈ ఏడాది వరుసగా 17 విజయాలతో ఊపు మీదున్న నంబర్‌వన్ రోజర్ ఫెడరర్‌కు షాక్. గతంలో ఐదు సార్లు ఇదే టైటిల్ సాధించి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ స్విస్ స్టార్‌కు ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఊహించని పరాజయం. అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో సంచలన ప్రదర్శన ముందు ఫెడెక్స్ తలవంచాల్సి వచ్చింది. ఫైనల్లో డెల్‌పొట్రో 2 గంటల 42 నిమిషాల్లో 6–4, 6–7 (8/10), 7–6 (7/2)తో ఫెడరర్‌ను ఓడించి తొలిసారి మాస్టర్స్–1000 స్థాయి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి తన సర్వీస్‌లో ఫెడరర్ 40–15తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే ఇదే గేమ్‌లో అతను మూడు సార్లు మ్యాచ్ పాయింట్లను కోల్పోవడం అనూహ్యం! ఫెడరర్ సర్వీస్ చేసిన పదో గేమ్‌లో డెల్‌పొట్రో బ్రేక్ సాధించడం... ఆ తర్వాత ఇద్దరు తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో ఆట టైబ్రేక్‌కు చేరింది. ఈ దశలో చెలరేగిన డెల్‌పొట్రో మరో అవకాశం ఇవ్వలేదు. తాజా ప్రదర్శనతో డెల్‌పొట్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. రెండేళ్ల పాటు గాయాలతో ఆటకు దూరమై ఒక దశలో 1,045 ర్యాంక్‌కు పడిపోయిన అతను 2016లో పునరాగమనం చేసి ఇటీవలే టాప్–10లోకి అడుగు పెట్టాడు. ఫెడరర్, డెల్‌పొట్రో మధ్య ఈ ఫైనల్‌కు ముందు 24 మ్యాచ్‌లు జరగ్గా... 18 సార్లు విజయం రోజర్నే వరించింది. విజేతగా నిలిచిన డెల్‌పొట్రోకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు) దక్కగా... ఫెడరర్ ఖాతాలో 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) చేరాయి. ఇది నిజంగా చాలా పెద్ద విజయం. ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించి నేను ఈ టైటిల్‌ను గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. నా ఎడమ చేతి మణికట్టుకు మూడో శస్త్రచికిత్స తర్వాత ఆటను మానేయాల్సిన స్థితిలో నిలిచిన నేను ఈ క్షణాన్ని అసలు ఊహించలేదు. పునరాగమనం కోసం నేను చాలా కష్టపడ్డాను. ప్రస్తుతం నేను చాలా అద్భుతంగా ఆడుతున్నాననేది వాస్తవం. ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తా. – డెల్ పొట్రో 4 ఫైనల్స్‌లో ఫెడరర్‌పై డెల్ పొట్రో సాధించిన విజయాల సంఖ్య. 2009 యూఎస్ ఓపెన్, 2012, 2013 బాసెల్ ఓపెన్ ఫైనల్స్‌లో ఫెడరర్‌ను ఓడించాడు. వారెవ్వా...ఒసాకా ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన 20 ఏళ్ల జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా విజేతగా అవతరించింది. ఫైనల్లో ఒసాకా 6–3, 6–2తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా–1999లో), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం–2005లో) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు), రన్నరప్ కసత్‌కినాకు 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఎదురులేని ఫెడరర్
తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో ఫెడరర్ తొలిసారి ఓ సీజన్‌ను వరుసగా 17 విజయాలతో ప్రారంభించాడు. 2006 సీజన్ ఆరంభంలో వరుసగా 16 విజయాలు నమోదు చేయడమే ఇప్పటిదాకా అతని అత్యుత్తమ ప్రదర్శన. కానీ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఈ స్విట్జర్లాండ్ స్టార్ తన జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. రికార్డుస్థాయిలో ఆరో టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. కాలిఫోర్నియా: తన ప్రత్యర్థి నుంచి ఊహిం చని ప్రతిఘటన ఎదురైనా... అనుభవాన్నంతా రంగరించి పోరాడిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 49వ ర్యాంకర్ బోర్నా కొరిక్ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 5–7, 6–4, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌కు గట్టిపోటీనే లభించింది. తొలి సెట్ కోల్పోయిన ఈ డిఫెండింగ్ చాంపియన్ రెండో సెట్లో 2–4తో వెనుకబడ్డాడు. అయితే 20 ఏళ్లుగా అంతర్జాతీయ టెన్నిస్ ఆడుతోన్న ఫెడరర్ ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడుతూ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి రెండో సెట్ 6–4తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ ఓ దశలో ఫెడరర్ 3–4 తో వెనుకబడ్డాడు. ఈసారీ ఎలాంటి ఒత్తిడి కి లోనుకాకుండా వరుసగా మూడు గేమ్‌లు సాధించి సెట్‌తోపాటు మ్యాచ్ దక్కించుకున్నాడు. ఫైనల్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డెల్ పొట్రో (అర్జెంటీనా)తో ఫెడరర్ ఆడతాడు. ‘సెమీస్‌లో విజయం అంత సులువుగా లభించలేదు. కీలక సందర్భాల్లో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఈ తరహా మ్యాచ్‌లు నా కెరీర్లో చాలాసార్లు ఆడాను. ఓ సీజన్లో వరుసగా 17 విజయాలు దక్కడం నా కెరీర్లో ఇదే తొలిసారి. ఇదే జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తాను’ అని 36 ఏళ్ల ఫెడరర్ వ్యాఖ్యానించాడు. -
ఫెడరర్ మరింత జోరుగా...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మరో అడుగు వేశాడు. ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అతను సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ), టాప్‌సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) సెమీస్ చేరారు. పురుషుల విభాగంలో ఫెడరర్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ హైన్ చుంగ్ కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న జోడీ సెమీఫైనల్ పోరుకు అర్హత సంపాదించింది. రోజర్ 43వ సారి... రెండో సీడ్ ఫెడరర్ తన గ్రాండ్‌స్లామ్ కెరీర్లో 43వ సారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే అతను సెమీస్ చేరడం ఇది 14వ సారి కావడం విశేషం. బుధవారం ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రోజర్ 7–6 (7/1), 6–3, 6–4తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కొరియన్ సంచలనం హైన్ చుంగ్ 6–4, 7–6 (7/5), 6–3తో టినిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై గెలుపొందాడు. శుక్రవారం సెమీస్‌లో ఫెడరర్... హైన్ చుంగ్‌తో తలపడతాడు. హలెప్ అలవోకగా..: మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ హలెప్, జర్మనీ స్టార్ కెర్బర్ అలవోక విజయాలతో సెమీఫైనల్ చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–3, 6–2తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. మరో పోరులో 21వ సీడ్ కెర్బర్ ధాటికి అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ చేతులేత్తేసింది. జర్మనీ స్టార్ వరుస సెట్లలో 6–1, 6–2తో 17వ సీడ్ కీస్ (అమెరికా)ను చిత్తు చేసింది. 2016 ఆస్టేలియన్ ఓపెన్ చాంపియన్ అయిన కెర్బర్ 51 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. సెమీస్ మ్యాచ్‌ల్లో కెర్బర్తో హలెప్, ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)తో వోజ్నియాకి (డెన్మార్క్) పోటీపడతారు. సెమీస్‌లో బోపన్న జోడి మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–తిమియా బాబోస్ (హంగేరి) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ భారత్–హంగేరి జోడీ 6–4, 7–6 (7/5)తో సెబాస్టియన్ కెబల్ (కొలంబియా)– అబిగెల్ స్పియర్స్ (అమెరికా) జంటను కంగుతినిపించింది. -
17 ఏళ్ల తర్వాత...
పెర్త్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ ఏడాదిలోనూ శుభారంభం చేశాడు. ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో సహచరురాలు బెలిండా బెన్సిచ్తో కలిసి అతను 17 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌కు టైటిల్ అందించాడు. శనివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2–1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. 30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు. శనివారం జరిగిన ఫైనల్లో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–7 (4/7), 6–0, 6–2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6–4, 6–1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్–బెన్సిచ్ జోడీ 4–3 (5/3), 4–2తో కెర్బర్–జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ను ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ ఫాస్ట్4 టెన్నిస్ సెట్స్ పద్ధతిలో నిర్వహించారు. సెట్లో తొలుత నాలుగు గేమ్‌లు గెలిచిన వారికి సెట్ దక్కుతుంది. స్కోరు 3–3తో సమంగా నిలవడంతో నిబంధనల ప్రకారం ఎనిమిది పాయింట్లున్న టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలుత ఐదు పాయింట్లు గెలిచిన ఫెడరర్ జంటకు తొలి సెట్ దక్కింది. రెండో సెట్లో ఫెడరర్ జోడీ నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.