
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ఫెడరర్ 7–5, 6–3తో ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఫెడరర్‌కిది 52వ విజయం కావడం విశేషం. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 14 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్యా యువ సంచలనం డానిల్ మెద్వెదెవ్‌తో ఫెడరర్ ఆడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ మెద్వెదెవ్ 7–6 (7/5), 6–7 (5/7), 7–6 (7/0)తో రీలి ఒపెల్కా (అమెరికా)పై గెలిచాడు. గత ఏడాది కాలంలో మెద్వెదెవ్ మూడు టైటిల్స్ సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
హలెప్ ముందంజ...
ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో హలెప్ 6–3, 6–3తో 38 ఏళ్ల వీనస్ విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఒసాకా (జపాన్)పై నెగ్గిన సు వె సెయి (చైనీస్ తైపీ) మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సు వె సెయి 6–3, 6–7 (0/7), 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3 తో గార్సియా (ఫ్రాన్స్)పై, ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–3, 7–5తో యులియా (కజకిస్తాన్)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment