ఫెడరర్ అలవోకగా...
ఏడాదిలో మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఐదో రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు.అగ్రశ్రేణి ఆటగాళ్లు ముర్రే, ఫెడరర్ అంచనాలకు అనుగుణంగా సునాయాసంగా నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించగా, ముగురుజ, వీనస్ విలియమ్స్ కూడా ముందంజ వేశారు. భారత్‌కు సంబంధించి సానియా దూసుకుపోగా, బొపన్న పురుషుల డబుల్స్ నుంచి నిష్క్రమించాడు.
మెల్‌బోర్న్: కెరీర్‌లో తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ వేటలో ఉన్న వరల్డ్ నంబర్‌న్ ఆండీ ముర్రే (బ్రిటన్) కీలక పోరులో సత్తా చాటి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 6–4, 6–2, 6–4తో స్యామ్ క్వారీ (అమెరికా)ను చిత్తు చేశాడు. 31వ సీడ్ క్వారీని గత ఏడాది వింబుల్డన్ లో జొకోవిచ్‌ను ఓడించిన రికార్డు ఉంది. తాజాగా జొకొవిచ్ కూడా రెండో రౌండ్‌లోనే ఓడిపోవడంతో మరో సంచలనపై అందరి దృష్టి నిలిచింది. కానీ ముర్రే వాటిని పటాపంచలు చేస్తూ అలవోక విజయం అందుకున్నాడు. రెండు గంటల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.
మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్, 17వ సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–2, 6–4, 6–4 తేడాతో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై ఘన విజయం సాధించాడు. గంటన్నరలోనే ముగిసిన ఈ పోరులో ఫెడరర్ ఎనిమిది ఏస్‌లు కొట్టాడు. పురుషుల సింగిల్స్‌లో ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌లలో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 3–6, 6–2, 6–2, 7–6 (7)తో విక్టర్ ట్రోయ్‌కీ (సెర్బియా)పై, నిషికొరి (జపాన్ 6–4, 6–4, 6–4తో ల్యూ కాస్ లాకో (స్లొవేకియా)పై గెలుపొందారు.
కెర్బర్ దూకుడు...
మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో ఆమె 6–0, 6–4తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఏడో సీడ్, స్పెయిన్ కు చెందిన గాబ్రియెలా ముగురుజా కూడా సునాయాసంగా ముందంజ వేసింది. మూడో రౌండ్‌లో ఆమె 6–4, 6–2తో సెవస్తొవా (లాత్వియా)ను ఓడించింది. అమెరికా స్టార్ వీనస్ కూడా నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. ఆమె 6–1, 6–0తో అతి సునాయాసంగా యింగ్ డువాన్(చైనా)ను చిత్తుగా ఓడించింది. ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సొవా(రష్యా) 6–4, 5–7, 9–7తో జెలెనా జంకోవిచ్(సెర్బియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్ చేరింది.
ముర్రే, వావ్రింకా కూడా ముగురుజ, వీనస్ ముందంజ
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరో తీవ్ర సంఘటన జరిగింది. ఈఎస్‌పీఎన్ తరఫున టీవీ కామెంటరీ చేస్తున్న వ్యాఖ్యాత డౌగ్ ఆల్టర్ అమెరికా స్టార్ క్రీడాకారిణి వీనస్‌ను ‘గొరిల్లా’ అంటూ సంబోధించాడు. దాంతో ఆగ్రహం చెందిన ప్రసారకర్తలు అతడిని వెంటనే తప్పించారు. అయితే తాను ఆ పదాన్ని పలికే తీరులో తప్పు చేశానని, తన ఉద్దేశం అది కాదంటూ అతను వివరణ ఇస్తూ క్షమాపణ కోరా డు.
వీనస్ రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2017లోనూ విలియమ్స్ సిస్టర్స్ పై తీవ్ర వ్యాఖ్యలు ఆగడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దూసుకుపోతున్న సానియా జోడి
మహిళల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్), బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడి సునాయాసంగా ముందంజ వేసింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా, స్ట్రికోవా 6–1, 6–4తో సమంతా స్టొసర్ (ఆస్ట్రేలియా), షుయి జాంగ్ (చైనా) జంటను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. గంటా 21 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. అయితే పురుషుల డబుల్స్‌లో మాత్రం భారత ఆటగాడు రోహన్ బొపన్నకు నిరాశే ఎదురైంది. 15వ సీడ్ బొపన్న–పాబ్లో క్వాస్ (ఉరుగ్వే) ద్వయం రెండో రౌండ్‌లో 6–2, 6–7 (2), 4–6 స్కోరుతో ఆస్ట్రేలియా జంట అలెక్స్ బోల్ట్, బ్రాడ్లీ మౌస్లీ చేతిలో పరాజయం పాలైంది.
అయితే తన ఓటమికి అంపైరింగ్ నిర్ణయాలే కారణమని బొపన్న మ్యాచ్ అనంతరం తీవ్రంగా విమర్శించాడు. కీలక సమయంలో వివాదాస్పద రీతిలో పాయింట్ ఇవ్వడమే తమను ఓడించిందని బొపన్న, క్వాస్ ద్వయం వ్యాఖ్యానించింది. వీరిద్దరు దీనిపై చెయిర్ అంపైర్‌తోనే వాగ్వాదానికి కూడా దిగారు. ‘రిఫరీ మ్యాచ్ ఫలితాన్ని శాసించడం జీర్చించుకోలేకపోతున్నాను’ అంటూ ఆ తర్వాత బొపన్న ట్వీట్ చేశాడు.