
పెర్త్: హాప్‌మన్ కప్‌లో అరుదైన సమరం ఆవిష్కృతమైంది. ‘ఆల్‌టైమ్ గ్రేట్ స్టార్స్’ ఫెడరర్ (స్విట్జర్లాండ్), సెరెనా విలియమ్స్ (అమెరికా) తొలిసారి కోర్టులో ‘ఢీ’కొన్నారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన ఈ పోరు హాప్‌మన్ కప్‌కే హైలైట్‌గా నిలిచింది. దేశాల మధ్య జరిగే ఈ టీమ్ ఈవెంట్లో తొలి సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్విట్జర్లాండ్ తరఫున ఫెడరర్ 6–4, 6–1తో టియాఫో (అమెరికా)పై నెగ్గాడు. తర్వాత మహిళల సింగిల్స్‌లో సెరెనా 4–6, 6–4, 6–3తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించడంతో స్కోరు 1–1తో సమమైంది.
ఇక నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెడరర్–బెన్సిచ్ జంట 4–2, 4–3 (5/3) సెరెనా–టియాఫొ జోడీపై గెలిచింది. కోర్టులో రాకెట్లు దూసిన దిగ్గజాలు మ్యాచ్ ముగిశాక తమ స్మార్ట్‌ఫోన్లతో సెల్ఫీ ముచ్చట తీర్చుకున్నారు. ఆటతో పాటు ఈ హేమాహేమీల ‘స్వీయచిత్రం’ అందర్నీ ఆకట్టి పడేసింది. అన్నట్లు వెంటనే ఇద్దరు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తమదైన శైలి క్యాప్షన్‌లతో పోస్ట్ చేయడంతో లెక్కలేనన్ని లైక్‌లు వస్తున్నాయి.