‘జోకర్’ తీన్‌మార్
మూడోసారి వింబుల్డన్ ట్రోఫీ కైవసం
♦ కెరీర్‌లో తొమ్మిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్
♦ ఫైనల్లో ఫెడరర్‌పై విజయం
లండన్ : అదే ప్రత్యర్థి. అదే ఫలితం. అదే దృశ్యం. గతేడాది వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఐదు సెట్‌ల పోరాటంలో ఫెడరర్‌ను ఓడించిన జొకోవిచ్ ఈసారి నాలుగు సెట్‌లలో ఆట కట్టించాడు. కోర్టు బయట, కోర్టు లోపల తన విలక్షణ శైలితో ఆకట్టుకొని ‘జోకర్’ అనే ముద్దుపేరును సొంతం చేసుకున్న ఈ సెర్బియా స్టార్ ముచ్చటగా మూడోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఆదివారం 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/1), 6-7 (10/12), 6-4, 6-3తో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్ ఫెడరర్‌కు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
సెమీస్‌లో ఆండీ ముర్రేను హడలెత్తించిన ఫెడరర్ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో పూర్తి విశ్వాసంతో కనిపించాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ఏడో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసింది.
టైబ్రేక్‌లో జొకోవిచ్ 6-3తో ఆధిక్యంలోకి వెళ్లి సెట్ విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన ఫెడరర్ ఆఖరికి 12-10తో టైబ్రేక్‌లో గెలిచి రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో ఫెడరర్‌కు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాలు వచ్చినా వృథా చేసుకున్నాడు. మరోవైపు జొకోవిచ్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. ఫెడరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకున్న జొకోవిచ్ ఈ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్‌లో జొకోవిచ్ మరింత చెలరేగిపోయి రెండుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు.
► ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో జొకోవిచ్ 200వ విజయాన్ని సాధించాడు.
► జొకోవిచ్‌కు కోచ్‌గా ఉన్న బోరిస్ బెకర్ 1985లో తొలిసారి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించాడు. 30 ఏళ్ల తర్వాత బెకర్ సమక్షంలోనే అతని శిష్యుడు జొకోవిచ్ మరోసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించాడు.
► ఈ విజయంతో జొకోవిచ్ (9) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు.
► ఈ ఏడాది ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అతను, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
► ఈ ఫలితంతో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్, ఫెడరర్ 20-20తో సమమయ్యారు.