Jokovic
-
ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన ఫెడరర్
ప్రత్యర్థి అనుభవలేమి... సులువుగా ఓటమిని అంగీకరించకూడదన్న నైజం... కాస్తంత అదృష్టం... వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మళ్లీ బతికిపోయాడు. తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఈ మాజీ చాంపియన్ గట్టెక్కాడు. ప్రపంచ 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్‌తో మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ ఐదు సెట్లలో విజయాన్ని అందుకొని 15వసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తో ఫెడరర్ తలపడతాడు. మెల్బోర్న్: కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో అడ్డంకిని అధిగమించాడు. మంగళవారం 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 2–6, 2–6, 7–6 (10/8), 6–3తో అన్‌సీడెడ్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై తీవ్రంగా చెమటోడ్చి గెలుపొందాడు. ఈ టోరీ్న లోని మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచి గట్టెక్కిన ఫెడరర్... క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. తన 22 ఏళ్ల కెరీర్లో ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2003లో సిన్సినాటి టోర్నీలో స్కాట్ డ్రెపర్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనూ ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్ గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో తలపడతాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)తో వావ్రింకా (స్విట్జర్లాండ్); ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఆడతారు. సాండ్‌గ్రెన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ నాలుగో సెట్లో స్కోరు 4–5 వద్ద తన సర్వీస్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను... అనంతరం ఇదే సెట్లోని టైబ్రేక్‌లో 3–6 వద్ద మూడు మ్యాచ్ పాయింట్లను... 6–7 వద్ద మరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. స్కోరు 8–8తో సమంగా ఉన్నపుడు సాండ్‌గ్రెన్ వరుసగా రెండు తప్పిదాలు చేయడంతో చివరకు ఫెడరర్ టైబ్రేక్‌ను 10–8తో గెలిచి సెట్‌ను దక్కించుకున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం ఐదో సెట్లో సాండ్‌గ్రెన్ ఆటతీరుపై ప్రభావం చూపింది. చివరి సెట్లో సాండ్‌గ్రెన్ పూర్తిగా డీలా పడ్డాడు. ఆరో గేమ్‌లో సాండ్‌గ్రెన్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చివరకు 6–3తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని విజయాన్ని అందుకున్నాడు. ►ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్ నెగ్గిన మ్యాచ్‌ల సంఖ్య 102. తాజా గెలుపుతో ఫెడరర్ ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును (వింబుల్డన్‌లో 101 విజయాలు) సవరించాడు. ►ఓవరాల్‌గా ఫెడరర్ తన కెరీర్లో 46వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్–15; వింబుల్డన్–13; ఫ్రెంచ్ ఓపెన్–8; యూఎస్ ఓపెన్–10 సార్లు) సెమీఫైనల్ చేరాడు. ►కెన్ రోజ్‌వెల్ (42 ఏళ్ల 68 రోజులు–1977లో) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (38 ఏళ్ల 178 రోజులు) గుర్తింపు పొందాడు. జొకోవిచ్ ఎనిమిదోసారి... మరో క్వార్టర్ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (7/1)తో 32వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 26–23తో ఆధిక్యంలో ఉన్నాడు. తొలిసారి సెమీస్‌లో బార్టీ, సోఫియా మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బార్టీ 7–6 (8/6), 6–2తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై... సోఫియా 6–4, 6–4తో ఆన్స్ జెబూర్ (ట్యూనిషియ)ఫై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో పేస్–ఒస్టాపెంకో జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)–జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పేస్–ఒస్టాపెంకో ద్వయం 2–6, 5–7తో జేమీ ముర్రే (బ్రిటన్)–బెథానీ మాటెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
‘జోకర్’ తీన్మార్
మూడోసారి వింబుల్డన్ ట్రోఫీ కైవసం ♦ కెరీర్లో తొమ్మిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ♦ ఫైనల్లో ఫెడరర్‌పై విజయం లండన్ : అదే ప్రత్యర్థి. అదే ఫలితం. అదే దృశ్యం. గతేడాది వింబుల్డన్ టోర్నమెంట్లో ఐదు సెట్ల పోరాటంలో ఫెడరర్‌ను ఓడించిన జొకోవిచ్ ఈసారి నాలుగు సెట్లలో ఆట కట్టించాడు. కోర్టు బయట, కోర్టు లోపల తన విలక్షణ శైలితో ఆకట్టుకొని ‘జోకర్’ అనే ముద్దుపేరును సొంతం చేసుకున్న ఈ సెర్బియా స్టార్ ముచ్చటగా మూడోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఆదివారం 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/1), 6-7 (10/12), 6-4, 6-3తో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 18 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 48 లక్షలు), రన్నరప్ ఫెడరర్‌కు 9 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 24 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్‌లో ఆండీ ముర్రేను హడలెత్తించిన ఫెడరర్ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో పూర్తి విశ్వాసంతో కనిపించాడు. ఆరో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ఏడో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేక్‌లో జొకోవిచ్ 6-3తో ఆధిక్యంలోకి వెళ్లి సెట్ విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన ఫెడరర్ ఆఖరికి 12-10తో టైబ్రేక్‌లో గెలిచి రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో ఫెడరర్‌కు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాలు వచ్చినా వృథా చేసుకున్నాడు. మరోవైపు జొకోవిచ్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. ఫెడరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి తన సర్వీస్‌లను నిలబెట్టుకున్న జొకోవిచ్ ఈ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్లో జొకోవిచ్ మరింత చెలరేగిపోయి రెండుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ► ఈ గెలుపుతో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో జొకోవిచ్ 200వ విజయాన్ని సాధించాడు. ► జొకోవిచ్‌కు కోచ్‌గా ఉన్న బోరిస్ బెకర్ 1985లో తొలిసారి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించాడు. 30 ఏళ్ల తర్వాత బెకర్ సమక్షంలోనే అతని శిష్యుడు జొకోవిచ్ మరోసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించాడు. ► ఈ విజయంతో జొకోవిచ్ (9) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ► ఈ ఏడాది ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అతను, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ► ఈ ఫలితంతో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్, ఫెడరర్ 20-20తో సమమయ్యారు. -
పట్టు వదలని ‘వావ్రి’మార్కుడు!
సాక్షి క్రీడావిభాగం ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు ముందు జొకోవిచ్పై వావ్రింకా గెలుస్తాడని భావించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ పక్కా ప్రణాళికతో వావ్రింకా ప్రపంచ నంబర్‌వన్‌ను కంగుతినిపించాడు. నిజానికి ఈ టోర్నీ అంతటా వావ్రింకా చాలా నిలకడగా ఆడాడు. ప్రిక్వార్టర్స్‌లో 12వ సీడ్ సిమోన్‌ను చిత్తు చేసిన వావ్రింకా... క్వార్టర్స్‌లో ఫెడరర్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత లోకల్ స్టార్ సోంగాపై గెలిచి... ఫైనల్లో జొకోవిచ్ భరతం పట్టాడు. క్లే కోర్టుల మీద తన ఆటతీరు మెరుగ్గా ఉంటుందని వావ్రింకా భావిస్తాడు. కారణం తను ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్స్ బాగా ఆడతాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్‌లో టెన్నిస్ అంటే ఫెడరర్ మాత్రమే. ఈసారి ఫ్రెంచ్ టైటిల్‌తో 30 ఏళ్ల వావ్రింకాకు కూడా ఫెడరర్ స్థాయి వచ్చేసింది. దీనికోసం అతను చాలా కష్టపడ్డాడు. వ్యవసాయ కుటుంబం: వావ్రింకా తండ్రి వోల్ఫ్రామ్ వ్యవసాయం చేస్తారు. వావ్రింకా ముత్తాత చెక్ రిపబ్లిక్ నుంచి స్విట్జర్లాండ్‌కు వలస వచ్చారు. తల్లి ఇసాబెల్ది స్విస్. వావ్రింకా తల్లిదండ్రులిద్దరూ ఆర్గానిక్ ఫామ్ ఏర్పాటు చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో వికలాంగులైన చిన్నారులకు సాయం చేస్తారు. వావ్రింకా అన్న టెన్నిస్ కోచ్. 15 ఏళ్ల వయసులో వావ్రింకా చదువుకు గుడ్‌బై చెప్పేసి పూర్తిగా టెన్నిస్ మీద దృష్టి కేంద్రీకరించాడు. జూనియర్ స్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు పలు టైటిళ్లు సాధించిన స్టాన్... జూనియర్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానం సంపాదించగలిగాడు. 17 ఏళ్ల వయసులో 2002లో ప్రొఫెషనల్ టెన్నిస్ మొదలుపెట్టాడు. జొకోవిచ్పై గెలిచి తొలి టైటిల్: 2006లో వావ్రింకా క్రొయేషియా ఓపెన్‌లో తొలి ఏటీపీ టైటిల్ సాధించాడు. యాదృచ్ఛికంగానే అయినా అప్పుడు కూడా ఫైనల్లో జొకోవిచ్‌పైనే గెలిచాడు. అదే ఏడాది ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి దూసుకొచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెడరర్‌తో కలిసి డబుల్స్‌లో స్విస్‌కు స్వర్ణం అందించాడు. 2010 వరకూ నాలుగేళ్ల పాటు ఒక్క టైటిల్ కూడా గెలవకపోయినా... పలు టోర్నీల్లో సెమీస్, ఫైనల్ వరకూ వచ్చి ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. 2010లో హసన్ గ్రాండ్‌ప్రి, 2011లో చెన్నై ఓపెన్‌లో టైటిల్స్ గెలిచాడు. 2012లో ఒక్క టైటిల్ కూడా దక్కలేదు. 2013లో ఒక ఏటీపీ టైటిల్ సాధించాడు. 2014లో చెన్నై ఓపెన్ టైటిల్ గెలిచిన వావ్రింకా... అదే జోరులో తొలిసారి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో) టైటిల్ సాధించాడు. తాజాగా ఫ్రెంచ్ విజయంతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. కుటుంబానికి దూరం: 2009లో వావ్రింకా వుయోలౌడ్ అనే మోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తోంది. 2010లో వావ్రింకాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో టైటిల్స్ లేక ఆట గాడితప్పి వావ్రింకా ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. టెన్నిస్‌పై దృష్టి పెట్టేందుకు వావ్రింకా భార్యకు దూరంగా ఉంటున్నాడని స్విస్ మీడియాలో 2011లో తొలిసారి కథనం వచ్చింది. తర్వాత మళ్లీ కొంతకాలం కలిసి ఉన్నా... ఈ ఏప్రిల్‌లో భార్య నుంచి పూర్తిగా విడిపోతున్నట్లు వావ్రింకా ప్రకటించాడు. వాళ్ల సరసన చేరినట్లే(నా)! తాజాగా వావ్రింకా నాలుగో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ప్రస్తుతం జొకోవిచ్, ఫెడరర్, ముర్రే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నాదల్ పదో ర్యాంక్‌కు పడిపోయినా అతన్ని తక్కువ అంచనా వేయలేం. ఈ నలుగురి సరసన చేరే స్థాయి తనకు లేదని అంటున్నాడు వావ్రింకా. ‘నా స్థాయికి నేను రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం సంతోషంగా ఉంది. ఆ నలుగురూ దిగ్గజాలు. వారిని అందుకోవడం చాలా కష్టం’ అని చెప్పాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఈ నలుగురితో పాటు వావ్రింకాను మినహాయిస్తే... మిగిలిన (నిషికోరి, బెర్డిచ్, ఫెరర్, సిలిచ్) వాళ్లందరిపై ఫ్రెంచ్ చాంపియన్ది పైచేయి. కాబట్టి అతన్ని ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్కు ప్రధాన పోటీ దారుగా టెన్నిస్ ప్రపంచం భావిస్తోంది. -
జొకోవిచ్ X వావ్రింకా
♦ నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ♦ సా. గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : తన ఖాతాలో లోటుగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకునేందుకు జొకోవిచ్... మరో సంచలన విజయంతో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో వావ్రింకా.... నేడు జరిగే పురుషుల సింగిల్స్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్ ఫైనల్లో ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను చిత్తు చేసి... హోరాహోరీ సెమీఫైనల్లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై 6-3, 6-3, 5-7, 5-7, 6-1తో నెగ్గిన జొకోవిచ్ ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవడానికి ఒకే ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్ అందని ద్రాక్షగా ఉంది. 2012, 2014లలో అతను ఫైనల్‌కు చేరుకున్నా నాదల్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి నాదల్, ఫెడరర్, ముర్రే అడ్డులేకపోవడంతో జొకోవిచ్ లక్ష్యం నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ప్రిక్వార్టర్స్‌లో బెర్డిచ్, క్వార్టర్స్‌లో ఫెడరర్, సెమీస్‌లో సోంగాను ఓడించిన వావ్రింకా అదే దూకుడును ఫైనల్లో కనబర్చాలనే పట్టుదలతో ఉన్నాడు. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించిన వావ్రింకా మంచి ఫామ్‌లో ఉన్న జొకోవిచ్‌ను నిలువరించి ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ విజేతగా నిలుస్తాడో లేదో వేచి చూడాలి. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 18-3తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు. -
హోరాహోరీగా రెండో సెమీస్
♦ ఆధిక్యంలో జొకోవిచ్ ♦ మ్యాచ్ నేటికి వాయిదా వావ్రింకా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో శనివారమే తేలనుంది. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ వెలుతురు మందగించిన కారణంగా నేటికి వాయిదా పడింది. అప్పటికి జొకోవిచ్ తొలి రెండు సెట్లను 6-3, 6-3తో సొంతం చేసుకోగా... మూడో సెట్‌ను ముర్రే 7-5తో నెగ్గాడు. నాలుగో సెట్లో ఇద్దరూ 3-3తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌ను కొనసాగించేందుకు తగినంత వెలుతురు లేకపోవడంతో నిర్వాహకులు ఆటను నిలిపి వేశారు. శనివారం ఇదే స్కోరు నుంచి మ్యాచ్‌ను కొనసాగిస్తారు. సెమీఫైనల్‌కు చేరే క్రమంలో తన ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు నెగ్గి మరోసారి మ్యాచ్‌ను మూడు సెట్లలో ముగిస్తాడనిపించింది. అయితే మూడో సెట్లో ముర్రే అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 11వ గేమ్‌లో మ్యాచ్‌లోనే తొలిసారి జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయి ప్రమాదం నుంచి గట్టెక్కిన ముర్రే స్కోరును 3-3తో సమం చేశాడు. -
ముర్రే, జొకోవిచ్ ముందంజ
వింబుల్డన్ టెన్నిస్ లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే, టాప్ సీడ్ జొకోవిచ్‌లు వింబుల్డన్ తొలి రౌండ్‌ను అలవోకగా అధిగమించారు. సోమవారం తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో ముర్రే 6-1, 6-4, 7-5 తేడాతో బెల్జియంకు చెందిన డేవిడ్ గాఫిన్‌పై గెలుపొందగా, జొకోవిచ్ 6-0, 6-1, 6-4తో ఆండ్రీ గులుబెవ్ (కజకిస్థాన్)పై సునాయాస విజయం సాధించాడు. గాఫిన్‌పై తొలి రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మూడో సీడ్ ముర్రేకు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. మొత్తంగా రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ముర్రే ఎనిమిది ఏస్‌లు, 28 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 2010 రన్నరప్, ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7 (5-7), 6-1, 6-4, 6-3 తేడాతో రుమేనియాకు చెందిన విక్టర్ హనెస్కుపై గెలిచాడు. ఏడోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-0, 6-7 (3-7), 6-1, 6-1తో తన దేశానికే చెందిన కారెనో బుస్టాపై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. నా లీ, క్విటోవా సునాయాసంగా.. మహిళల సింగిల్స్‌లో గతేడాది సెమీఫైనలిస్టు, రెండో సీడ్ చైనా క్రీడాకారిణి నా లీ, మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా, మాజీ ప్రపంచ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకాలు రెండో రౌండ్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నా లీ తొలి రౌండ్లో 7-5, 6-2తో పోలెండ్‌కు చెందిన పౌలా కనియాపై గెలుపొందగా, ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-0తో తన దేశానికే చెందిన లవకోవాపై నెగ్గింది. 8వ సీడ్ అజరెంకా 6-3, 7-5తో బారోని (క్రొయేషియా)పై నెగ్గింది. ఐదుసార్లు చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లో 6-4, 4-6, 6-2తో మరియా టోరో ఫ్లొర్ (స్పెయిన్)పై గెలుపొందింది. కిరిలెంకో (రష్యా) 6-2, 7-6 (8-6)తో స్టీఫెన్స్ (అమెరికా)పై నెగ్గగా, స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 4-6 తేడాతో విక్‌మేయర్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలైంది. -
రెండో సెట్ గెలవకుంటే...
పారిస్: జొకోవిచ్‌తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తాను రెండో సెట్ గెలవకుంటే ట్రోఫీ నెగ్గలేకపోయేవాడినని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అన్నాడు. ఆటలో అలుపొచ్చినట్లే కెరీర్ కూడా ముగింపుకొస్తుందని చెప్పుకొచ్చాడు. ఎక్కడైనా మార్పు అనేది తథ్యమని... అది సహజమని అన్నాడు. పాత తరం నిష్ర్కమిస్తుంటే కొత్త తరం దాన్ని భర్తీ చేస్తుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో గ్రేటెస్ట్ స్టార్లతో కూడిన తమ శకం ముగింపు దశకు చేరుకుందని స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ వెల్లడించాడు. వయసు పైబడుతున్న ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ముర్రే (బ్రిటన్), నాదల్‌లతో కూడిన ‘గోల్డెన్ ఎరా’కు శుభం కార్డు తప్పదని స్వయంగా 28 ఏళ్ల నాదలే అంటున్నాడు. పాత నీరు పోతే కొత్త నీరు సహజమన్న చందంగా దిగ్గజ చతుష్టయాన్ని భర్తీ చేసే కుర్రాళ్లు త్వరలోనే తెరమీదికి వస్తారని రాఫెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో 14వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని అందుకున్న ఈ స్పెయిన్ సంచలనం మార్పును ఆహ్వానించాలని... నేర్పును అందిపుచ్చుకోవాలని ఒక విధంగా యువతకు సందేశాత్మక ధోరణిలో మాట్లాడాడు. 2005లో 19వ యేట ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిమ్యాచ్ ఆడిన ఈ దిగ్గజం ఒక్కసారి మినహా 66 సార్లు విజయబావుటా ఎగురవేశాడు. -
రద్వాన్‌స్కాకు చుక్కెదురు
న్యూయార్క్: సీడెడ్ క్రీడాకారిణులకు ఈసారి యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కలసిరావడంలేదు. ఇప్పటికే టాప్-10 సీడింగ్స్లోని ముగ్గురు క్రీడాకారిణులు సారా ఎరాని, కరోలిన్ వొజ్నియాకి, పెట్రా క్విటోవా మూడో రౌండ్లోపు నిష్ర్కమించగా... నాలుగో రౌండ్లో మరో ముగ్గురు వారి సరసన చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), ఎనిమిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), తొమ్మిదో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) ఓటమి పాలయ్యారు. మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఐదో సీడ్ నా లీ (చైనా) తమ జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో 24వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-4, 6-4తో రద్వాన్స్కాపై; 18వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 4-6, 6-3, 7-6 (7/3)తో కెర్బర్‌పై; నా లీ 6-0, 6-3తో జంకోవిచ్‌పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-4, 6-1తో 15వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కార్లా నవారోతో సెరెనా; మకరోవాతో నా లీ తలపడతారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో కామిలా జియార్జి (ఇటలీ)పై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, ముర్రే పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తోపాటు మాజీ విజేతలు జొకోవిచ్ (సెర్బియా), హెవిట్ (ఆస్ట్రేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో మూడో సీడ్ ముర్రే 7-6 (7/2), 6-2, 6-2తో మాయెర్ (జర్మనీ)పై, టాప్ సీడ్ జొకోవిచ్ 6-0, 6-2, 6-2తో సౌసా (పోర్చుగల్)పై, హెవిట్ 6-3, 7-6 (7/5), 3-6, 6-1తో డాన్స్కాయ్ (రష్యా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బెర్డిచ్ 6-0, 6-3, 6-2తో బెనెట్యూ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-7 (1/7), 7-6 (9/7)తో బగ్ధాటిస్ (సైప్రస్)పై, 21వ సీడ్ యూజ్నీ (రష్యా) 6-3, 6-2, 2-6, 6-3తో 12వ సీడ్ టామీ హాస్ (జర్మనీ)పై. ఇస్టోమిన్ (ఉజ్బెకిస్థాన్) 6-3, 6-4, 2-6, 3-6, 6-1తో 20వ సీడ్ సెప్పి (ఇటలీ)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-వాసెలిన్ (ఫ్రాన్స్) జోడి 4-6, 4-6తో 12వ సీడ్ ఫ్లెమింగ్-ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడింది