రెండో సెట్ గెలవకుంటే...
పారిస్: జొకోవిచ్‌తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తాను రెండో సెట్ గెలవకుంటే ట్రోఫీ నెగ్గలేకపోయేవాడినని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అన్నాడు. ఆటలో అలుపొచ్చినట్లే కెరీర్ కూడా ముగింపుకొస్తుందని చెప్పుకొచ్చాడు. ఎక్కడైనా మార్పు అనేది తథ్యమని... అది సహజమని అన్నాడు. పాత తరం నిష్ర్కమిస్తుంటే కొత్త తరం దాన్ని భర్తీ చేస్తుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో గ్రేటెస్ట్ స్టార్లతో కూడిన తమ శకం ముగింపు దశకు చేరుకుందని స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ వెల్లడించాడు. వయసు పైబడుతున్న ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ముర్రే (బ్రిటన్), నాదల్‌లతో కూడిన ‘గోల్డెన్ ఎరా’కు శుభం కార్డు తప్పదని స్వయంగా 28 ఏళ్ల నాదలే అంటున్నాడు.
పాత నీరు పోతే కొత్త నీరు సహజమన్న చందంగా దిగ్గజ చతుష్టయాన్ని భర్తీ చేసే కుర్రాళ్లు త్వరలోనే తెరమీదికి వస్తారని రాఫెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో 14వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని అందుకున్న ఈ స్పెయిన్ సంచలనం మార్పును ఆహ్వానించాలని... నేర్పును అందిపుచ్చుకోవాలని ఒక విధంగా యువతకు సందేశాత్మక ధోరణిలో మాట్లాడాడు. 2005లో 19వ యేట ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిమ్యాచ్ ఆడిన ఈ దిగ్గజం ఒక్కసారి మినహా 66 సార్లు విజయబావుటా ఎగురవేశాడు.