నాదల్‌కు ఫెడరర్ భావోద్వేగ లేఖ
మలాగా (స్పెయిన్): ‘ఒకటి మాత్రం నిజం...నేను నీపై గెలిచిన మ్యాచ్‌లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు ఎవరూ సవాల్ విసరలేదు. మట్టి కోర్టుపైన అయితే నీ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆడినట్లే అనిపించేది. అక్కడ నీ ముందు నిలబడితే చాలు అనిపించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది.
నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా నువ్వే చేశావు. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చి కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది’ ... టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న రాఫెల్ నాదల్‌ను ఉద్దేశించి మరో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది.
సుదీర్ఘ కాలం ఆటను శాసించిన వీరిద్దరిలో ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా... ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ కెరీర్ ముగిస్తే... 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెప్పాడు. కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్‌లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాశాడు.
ఆటను ఇష్టపడేలా చేశావు...
‘నువ్వు రిటైర్ అవుతున్న సందర్భంగా కొన్ని విషయాలు పంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం... అన్నీ ఒక పద్ధతిలో ఉండటం అంతా కొత్తగా అనిపించేది. నేను ఆ ప్రక్రియను కూడా ఇష్టపడేవాడిని. నాకు మూఢనమ్మకాలు లేవు కానీ నువ్వు ఇలా కూడా ఆకర్షించావు. టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్, యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు’ అని ఫెడరర్ అన్నాడు.
ఆ రోజు మర్చిపోలేను...
2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి వీరిద్దరు 40 సార్లు తలపడ్డారు. ఇందులో నాదల్ 24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచారు. ‘నేను తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. 50 వేల మంది సమక్షంలో ఆడిన రికార్డు మ్యాచ్‌తో సహా మనం కలిసి ఆడిన రోజులన్నీ గుర్తున్నాయి. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేది’ అని ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు.
నీతో స్నేహం వల్లే...
మలార్కాలో 2016లో నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఫెడరర్ హాజరు కాగా... రెండేళ్ల క్రితం ఫెడరర్ చివరి టోర్నీ లేవర్ కప్‌లో అతని కోసం భాగస్వామిగా నాదల్ ఆడాడు. ‘అకాడమీ ప్రారంభోత్సవానికి నాకు నేనే ఆహా్వనం ఇచ్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలవంతం చేయలేని మంచితనం నీది. కానీ నేను రాకుండా ఎలా ఉంటాను. ఆ తర్వాత నీ అకాడమీలో నా పిల్లలు శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఎడంచేతి వాటం ఆటగాళ్లుగా తిరిగి రాకుండా చాలని మాత్రం కోరుకున్నాను. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్‌లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలు’ అని ఫెడెక్స్ భావోద్వేగం ప్రదర్శించాడు.
కమాన్ రఫా...
కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న వేళ నాదల్‌కు ఫెడరర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. ‘భావోద్వేగంతో మాటలు రాని పరిస్థితి రాక ముందే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నీ ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడు కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నీకు నా అభినందనలు. ఇప్పుడు, ఇకపై కూడా నీ పాత మిత్రుడు చప్పట్లతో గట్టిగా నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడనే విషయం మరచిపోవద్దు’ అని ఫెడరర్ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment