భావోద్వేగంతో‘బుల్‌’ గుడ్‌బై | Rafael Nadal Career Ends As Netherlands Defeat Spain In Davis Cup | Sakshi
Sakshi News home page

భావోద్వేగంతో‘బుల్‌’ గుడ్‌బై

Published Wed, Nov 20 2024 12:44 PM | Last Updated on Thu, Nov 21 2024 3:36 AM

Rafael Nadal Career Ends As Netherlands Defeat Spain In Davis Cup

టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రాఫెల్‌ నాదల్‌

ఓటమితో కెరీర్‌ ముగింపు

డేవిస్‌కప్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ పరాజయం  

22 గ్రాండ్‌స్లామ్‌లు... 36 మాస్టర్‌ సిరీస్‌–1000 ట్రోఫీలు... 25 ఏటీపీ–500 టైటిల్స్‌... 10 ఏటీపీ–250 టైటిల్స్‌... 2 ఒలింపిక్‌ స్వర్ణాలు... 209 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌...1250 రాకెట్లు...300 కిలోమీటర్ల స్ట్రింగ్‌...16500 మీటర్ల ఓవర్‌గ్రిప్‌... ఇదీ కోర్టులో రాఫెల్‌ నాదల్‌ టెన్నిస్‌ ప్రయాణం! సుదీర్ఘంగా సాగిన ఈ అద్భుత ప్రస్థానం ముగిసింది. 

స్వదేశంలో, సొంత అభిమానుల సమక్షంలో ‘స్పెయిన్‌ బుల్‌’ నాదల్‌ కెరీర్‌ చివరి మ్యాచ్‌ ఆడేశాడు. ఆఖరి పోరులో పరాజయం పలకరించినా... ఈ మ్యాచ్‌ తుది ఫలితంకంటే అతని నిష్క్రమణే టెన్నిస్‌ ప్రపంచాన్ని భావోద్వేగంలో ముంచింది... కన్నీళ్లపర్యంతమవుతూ నాదల్‌ అభిమాన ఆటకు గుడ్‌బై చెప్పాడు.

మలాగా (స్పెయిన్‌): ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన దిగ్గజాలలో ఒకడైన రాఫెల్‌ నాదల్‌ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్‌కప్‌ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ 1–2తో నెదర్లాండ్స్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. 

స్పెయిన్‌ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్‌ వాన్‌ డి జాండ్‌షుల్ప్‌ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో అల్‌కరాజ్‌ 7–6 (7/0), 6–3తో గ్రీక్‌స్పూర్‌ను ఓడించి 1–1తో సమం చేశాడు. 

నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్‌ జోడీ వాన్‌ డి జాండ్‌షుల్ప్‌–వెస్లీ కూల్‌హాఫ్‌ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్‌ ద్వయం అల్‌కరాజ్‌–మార్సెల్‌ గ్రానోలర్స్‌ను ఓడించింది. స్పెయిన్‌ నిష్క్ర మణతో నాదల్‌కు ఇదే చివరి పోరుగా మారింది. నాదల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు కుటుంబసభ్యులందరూ వచ్చారు.  

అంతా అతనే... 
మ్యాచ్‌ ఆరంభానికి ముందు స్పెయిన్‌ జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో 38 ఏళ్ల నాదల్‌ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుమారు 10 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం అంతా ఎరుపు వర్ణం పులుముకున్న తర్వాత అతను ఆటలోకి అడుగు పెట్టాడు. కోర్టులో ప్రతి షాట్‌కు అభిమానులు ‘రా...ఫా...రా...ఫా....’ అంటూ జేజేలు పలుకుతూ ప్రోత్సహిస్తుండగా అతను పోటీ పడ్డాడు. 

అయితే ఊహించినట్లుగానే గతంలోలా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను వరుస సెట్‌లలో ఓడిపోయాడు. నాదల్‌ కొట్టిన ఫోర్‌హ్యాండ్‌ నెట్‌ను తాకడంతో అతని ఓటమి ఖాయమైంది. స్పెయిన్‌ ఓటమి తర్వాత నాదల్‌ స్టేడియం అంతా కలియతిరిగాడు. ఆటగాళ్లు, కోచ్‌లను కౌగిలించుకొని భావోద్వేగభరితమైన అతను అభిమానుల చప్పట్ల హోరు మధ్య ప్రసంగం పూర్తి చేసుకొని వీడాడు.

వరుసగా 19 ఏళ్ల పాటు...
2024: 0
2023: 0
2022: 4 
2021: 2 
2020: 2 
2019: 4 
2018: 5
2017: 6
2016: 2 
2015: 3 
2014: 4 
2013: 10 
2012: 4 
2011: 3 
2010: 7 
2009: 5
2008: 8 
2007: 6 
2006: 5 
2005: 11 
2004: 1 
మొత్తం  92
రాఫెల్‌ నాదల్‌ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచాడు. పోలాండ్‌లోని సొపోట్‌ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్‌ ఓపెన్‌ టోర్నీలో నాదల్‌ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్‌ కనీసం ఒక్క టైటిల్‌ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్‌ టైటిల్‌ గెలవలేకపోయాడు.

అంకెల్లో నాదల్‌ కెరీర్‌
1080 సింగిల్స్‌ విభాగంలో గెలిచిన మ్యాచ్‌లు 
227 సింగిల్స్‌ విభాగంలో ఓడిన మ్యాచ్‌లు 
910 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో  కొనసాగిన వారాలు 
209 ప్రపంచ నంబర్‌వన్‌గా  కొనసాగిన వారాలు 
92 కెరీర్‌ మొత్తంలో నెగ్గిన సింగిల్స్‌ టైటిల్స్‌ 
63 క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్‌ టైటిల్స్‌ 
22 మొత్తం నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌: 14, ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌: 2; వింబుల్డన్‌: 2, యూఎస్‌ ఓపెన్‌: 4) 
2 గెలిచిన ఒలింపిక్స్‌ స్వర్ణాలు (2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సింగిల్స్‌; 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్‌) 
4 డేవిస్‌కప్‌ టీమ్‌ టైటిల్స్‌(2004, 2009, 2011, 2019)
కెరీర్‌లో సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ13,49,46,100 డాలర్లు  (రూ. 1138 కోట్లు)

భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. అయితే ప్రశాంతమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నా. నా విజయాల సంఖ్య, టైటిల్స్, రికార్డుల గురించి అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఊరు మలొర్కా నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా, తన కలలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడిన ఒక చిన్న కుర్రాడిగా నేను గుర్తుండిపోవాలని కోరుకుంటాను. 

ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్‌లో ఎంతో మంది మిత్రులను సంపాదించుకోగలిగాను. డేవిస్‌ కప్‌లో తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టిన నేను ఇప్పుడూ ఓడి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. నా చివరి మ్యాచ్‌ చాలా కఠినంగా అనిపించింది. నిజానికి ఎవరూ ఇలాంటి క్షణం రావాలని కోరుకోరు. 

నేను టెన్నిస్‌ ఆడే విషయంలో అలసిపోలేదు. కానీ నా శరీరం అలసిపోయింది. ఇక ఆడటం సాధ్యం కాదని చెప్పేసింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరించాలి. నిజాయితీగా చెప్పాలంటే ఒక హాబీగా మొదలు పెట్టిన ఆటలో ఇంత గొప్ప కెరీర్‌ నిర్మించుకోగలగడాన్ని నేను గొప్పగా భావిస్తున్నా. పైగా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ కాలం ఆడగలిగాను. – వీడ్కోలు ప్రసంగంలో రాఫెల్‌ నాదల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement