world tennis
-
‘ఆ జ్ఞాపకాలన్నీ పదిలం’
మలాగా (స్పెయిన్): ‘ఒకటి మాత్రం నిజం...నేను నీపై గెలిచిన మ్యాచ్లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు ఎవరూ సవాల్ విసరలేదు. మట్టి కోర్టుపైన అయితే నీ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆడినట్లే అనిపించేది. అక్కడ నీ ముందు నిలబడితే చాలు అనిపించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా నువ్వే చేశావు. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చి కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది’ ... టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న రాఫెల్ నాదల్‌ను ఉద్దేశించి మరో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది. సుదీర్ఘ కాలం ఆటను శాసించిన వీరిద్దరిలో ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా... ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ కెరీర్ ముగిస్తే... 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెప్పాడు. కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాశాడు. ఆటను ఇష్టపడేలా చేశావు... ‘నువ్వు రిటైర్ అవుతున్న సందర్భంగా కొన్ని విషయాలు పంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం... అన్నీ ఒక పద్ధతిలో ఉండటం అంతా కొత్తగా అనిపించేది. నేను ఆ ప్రక్రియను కూడా ఇష్టపడేవాడిని. నాకు మూఢనమ్మకాలు లేవు కానీ నువ్వు ఇలా కూడా ఆకర్షించావు. టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్, యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు’ అని ఫెడరర్ అన్నాడు. ఆ రోజు మర్చిపోలేను... 2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి వీరిద్దరు 40 సార్లు తలపడ్డారు. ఇందులో నాదల్ 24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచారు. ‘నేను తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. 50 వేల మంది సమక్షంలో ఆడిన రికార్డు మ్యాచ్‌తో సహా మనం కలిసి ఆడిన రోజులన్నీ గుర్తున్నాయి. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేది’ అని ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు. నీతో స్నేహం వల్లే... మలార్కాలో 2016లో నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఫెడరర్ హాజరు కాగా... రెండేళ్ల క్రితం ఫెడరర్ చివరి టోర్నీ లేవర్ కప్‌లో అతని కోసం భాగస్వామిగా నాదల్ ఆడాడు. ‘అకాడమీ ప్రారంభోత్సవానికి నాకు నేనే ఆహా్వనం ఇచ్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలవంతం చేయలేని మంచితనం నీది. కానీ నేను రాకుండా ఎలా ఉంటాను. ఆ తర్వాత నీ అకాడమీలో నా పిల్లలు శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఎడంచేతి వాటం ఆటగాళ్లుగా తిరిగి రాకుండా చాలని మాత్రం కోరుకున్నాను. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలు’ అని ఫెడెక్స్ భావోద్వేగం ప్రదర్శించాడు. కమాన్ రఫా... కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వేళ నాదల్కు ఫెడరర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. ‘భావోద్వేగంతో మాటలు రాని పరిస్థితి రాక ముందే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నీ ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడు కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నీకు నా అభినందనలు. ఇప్పుడు, ఇకపై కూడా నీ పాత మిత్రుడు చప్పట్లతో గట్టిగా నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడనే విషయం మరచిపోవద్దు’ అని ఫెడరర్ ముగించాడు. -
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’..!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు కూడా తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే.. -
ఫైనల్లో రష్మిక భమిడిపాటి
ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రష్మిక 6–2, 6–1 స్కోరుతో రెండో సీడ్ లన్లనా తరారుడీ (థాయిలాండ్)పై విజయం సాధించింది. 57 నిమిషాల పాటు సాగిన పోరులో ఆద్యంతం రష్మిక ఆధిపత్యం కొనసాగింది. తరారుడీ ఒక ఏస్ కొట్టినా ఐదు డబుల్ ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించింది. మరో భారత క్రీడాకారిణి జీల్ దేశాయ్ కూడా ఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్‌లో జీల్ 3–6, 6–4, 7–5 స్కోరుతో భారత్‌కే చెందిన మూడో సీడ్ రుతుజ భోసలేను ఓడించింది. 2 గంటల 31 నిమిషాల పాటు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన జీల్ విజేతగా నిలిచింది. రుతుజ 2 ఏస్‌లు కొట్టగా, జీల్ ఒక ఏస్ సంధించింది. జీల్ 7 డబుల్ ఫాల్ట్‌లతో పోలిస్తే 10 డబుల్ ఫాల్ట్‌లు చేసిన రుతుజ ఓటమిపాలైంది. -
క్వార్టర్ ఫైనల్లో రష్మిక
మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నిలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికసింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నిలో గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల రష్మిక4–6, 7–5, 7–5తో నాలుగో సీడ్ వైదేహి (గుజరాత్)ను ఓడించింది. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మికనాలుగు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రష్మికతన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–0, 6–3తో కశిష్ భాటియా–వన్షిత (భారత్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల పోరాటం ఈ టోర్నిలో ముగిసింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల 4–6, 3–6తో రుతుజా భోస్లే (భారత్) చేతిలో ఓడిపోయింది. -
ఫైనల్లో బోపన్న జోడీ
ఏబీఎన్ ఆమ్రో ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–4తో కెవిన్ క్రాయిట్జ్–టిమ్ పుయిట్జ్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. -
వరల్డ్ టీమ్ టెన్నిస్‌లో వీనస్
వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ప్రపంచ టీమ్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో పాల్గోనుంది. తొమ్మిది జట్లు తలపడే ఈ టోర్నీలో ఆమె బరిలోకి దిగడం ఇది 15వ సారి. తాజాగా ఆమె వాషింగ్టన్ కాజిల్స్ తరఫున పోటీపడనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ వచ్చే నెల 12న ప్రారంభం కానుంది. సాధారణంగా దేశంలోని పలు నగరాల్లో ఈ పోటీలు జరిగేవి. అయితే ఈసారి కరోనా మహమ్మారి దృష్ట్యా ఒకే వేదికలో (వెస్ట్ వర్జీనియా) అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇది డబ్ల్యూటీఏ, ఏటీపీ పరిధిలోని టోర్నీ కాదు. కాబట్టి ఇక్కడి గెలుపోటములతో ఎలాంటి పాయింట్లు జతకావు. ర్యాంకింగ్ ప్రభావితం కాదు. ఔట్‌డోర్ కోర్టులో జరిగే పోటీలకు 500 మంది ప్రేక్షకుల్ని, ఇండోర్ కోర్టులో జరిగే పోటీలకు 250 మందిని అనుమతిస్తారు. వర్షం కురిస్తే మ్యాచ్‌ల్ని ఇండోర్ కోర్టుల్లో నిర్వహిస్తారు. ఫేస్ మాస్క్‌లుంటేనే ప్రేక్షకులకు ఎంట్రీ ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. గతవారం 40వ పడిలోకి ప్రవేశించిన వీనస్ 2011లో అరుదైన కీళ్ల వ్యాధితో బాధపడుతోంది. అప్పట్నుంచి అడపాదడపా కొన్ని ఎంపిక చేసిన టోర్నీల్లోనే ఆడుతోంది. ఈమె ఖాతాలో ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. సోదరి సెరెనాతో కలిసి 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలు కూడా గెలుచుకుంది. -
'ఈ విజయం ఎంతో మధురం'
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టైటిల్ విజయం తనకు ఎంతో మధురమైనదని ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జొకోవిచ్ అన్నాడు. రెండో ర్యాంకర్ రోజర్ ఫెడరర్‌తో జరిగిన ఫైనల్ సమరంలో సెర్బియా స్టార్ జొకోవిచ్ విజయం సాధించాడు. మ్యాచ్ విజయానంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. 'నేనో భర్తను, తండ్రిని. ఈ విజయం మరింత మధురమైనది' అని అన్నాడు. జొకోవిచ్ యూఎస్ ఓపెన్ గెలవడమిది రెండో సారి. ఈ ఏడాది తన ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ జమచేసిన జొకోవిచ్ తన కెరీర్లో పదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. -
ఫెడరర్ కన్నా నాదల్ ఉత్తమం: అగస్సీ
సింగపూర్: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో రోజర్ ఫెడరర్ది ప్రత్యేక స్థానం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న రికార్డు ఈ స్విస్ దిగ్గజం పేరిట ఉంది. అయితే టెన్నిస్‌లో ఫెడరర్కన్నా స్పెయిన్ బుల్ రాఫెల్ నాదలే ఆల్ టైమ్ బెస్ట్ అని మాజీ ఆటగాడు ఆండ్రీ అగస్సీ తేల్చాడు. అత్యంత పోటీ వాతావరణంలో తలపడుతూ విజయాలు సాధిస్తుండడమే దీనికి కారణమని ఎనిమిది గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకున్న అగస్సీ చెప్పాడు. ‘నంబర్‌వన్ నాదలే. ఆ తర్వాతే ఫెడరర్. ఎందుకంటే తను జొకోవిచ్, ముర్రే, ఫెడరర్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లతో తలపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ కాలాన్ని ఒక రకంగా టెన్నిస్ స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. అతను ఇంకా సాధించాల్సింది ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా ప్రతీ గ్రాండ్‌స్లామ్‌ను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది అది కూడా సాధించే అవకాశం ఉంది’ అని అగస్సీ వివరించాడు. -
అతని వెనుక ఆ ముగ్గురు..
ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందిన చాలా మంది ప్రముఖుల ప్రస్థానాన్ని గమనిస్తే నిజంగానే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రపంచ టెన్నిస్ రంగంలో సంచలన ఆటతీరుతో గ్రాండ్‌స్లామ్ పంటపండించుకుంటున్న స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ జీవితంలోనూ ఈ కోణం కనిపిస్తుంది. అయితే అతడి విజయాల వెనుక ఉన్నది ఒక్క మహిళ కాదు.. ఏకంగా ముగ్గురు. తల్లి, చెల్లి, ప్రియురాలి సహకారంతో నాదల్ ఏకంగా ప్రపంచ టెన్నిస్‌నే ఏలగలుగుతున్నాడు. ‘నా చిన్న వయసులోనే లెక్కలేనంత డబ్బు.. పేరు ప్రఖ్యాతులు వచ్చి పడ్డాయి. దీనివల్ల నా ఆట గతి తప్పకుండా, లక్ష్యం వైపు పయనించే వాతావరణాన్ని సృష్టించింది నా కుటుంబమే. ఒక రకంగా వారు లేకుండా ఈ సంపద, విజయాలు నాకు దక్కడం అసంభవం’ - ఫ్యామిలీపై నాదల్ మనోగతం. అనా మరియా పెరీరా (తల్లి) మైదానంలో చిచ్చరపిడుగులా చెలరేగుతూ బలమైన సర్వ్‌లు సంధించే నాదల్ నిజానికి చాలా భయస్తుడు. చూడ్డానికి యోధుడిలా ఉంటూ మెరుపుల్లాంటి షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేస్తాడు. కానీ తనకు నిజంగానే పిడుగులన్నా.. మెరుపులన్నా భయం. అంతెందుకు చీకటంటేనే జడుసుకుంటాడు. పడుకున్నా లైట్ వెలగాల్సిందే.. లేకపోతే టీవీ ఆన్‌లోనే ఉండాలి. మొత్తానికి అతనో సూపర్ సెన్సిటివ్. ఇలాంటి లక్షణాలున్న ఈ స్పెయిన్ హీరోని అతడి తల్లి అనా మరియా పెరీరా కంటికి రెప్పలా కాపాడుకుంది. విజయాల వైపు దృష్టి మరల్చేలా చేసింది. తనలో ధైర్యాన్ని పెంచి మంచి క్రీడాకారుడిగా తయారుచేసింది. మరిబెల్ (చెల్లి) నాదల్కు తన చెల్లి మరిబెల్ అంటే ప్రాణం. తనకు కూడా అంతే. సహజంగా అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే గిల్లికజ్జాలు.. ఒకరిపై మరొకరి చాడీలు వీరి మధ్య కనిపించవు. నాదల్ తనకు బాధ, సంతోషం ఏది కలిగినా చిన్నప్పటి నుంచీ చెల్లితోనే తొలుత పంచుకునేవాడు. తనకన్నా చిన్నదైనా చాలా పరిణతితో కూడిన సలహాలు ఇచ్చేదని నాదల్ చెబుతుంటాడు. తాము టీనేజ్‌లో ఉండగా అతడి స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు తననూ తీసుకెళ్లేవాడని.. ఇది ఇతరులకు వింతగా అనిపించినా తమ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా నిలుస్తుందని తెలిపింది. మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో (ప్రియురాలు) నాదల్ గురించి బాగా తెలిసిన మనిషి మరియా. స్వతహాగా ఆమె లైమ్‌లైట్‌లో ఉండాలని భావించదు. నాదల్ స్వభావం కూడా అంతేనని, సెలబ్రిటీ ప్రపంచంలో ఇమడలేనని అనుకుంటాడని మరియా చెప్పింది. ఇద్దరూ జంటగా కూడా బయట ఎక్కువగా కనిపించరు. వెనకాలే ఉంటూ నాదల్‌ను మున్ముందుకు పంపాలనే తాపత్రయం మరియాది. ఊహించని పరాజయం ఎదురైనప్పుడు. అతి పెద్ద విజయం సాధించినప్పుడు నాదల్ భావోద్వేగాలను నియంత్రించి తనని మళ్లీ మామూలు మనిషిని చేసే వ్యక్తి మరియా. -
టెన్నిస్‌లో తెలుగు వెలుగులు
సౌజన్య సంచలనం ఐటీఎఫ్ టోర్నీ టైటిల్ సొంతం ఫైనల్లో రెండో సీడ్ ప్రార్థనపై గెలుపు కెరీర్లో రెండో సింగిల్స్ టైటిల్ ఔరంగాబాద్: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సౌజన్య 5-7, 6-4, 6-4తో రెండో సీడ్ ప్రార్థన తోంబరే (భారత్)ను బోల్తా కొట్టించింది. 20 ఏళ్ల సౌజన్యకిది కెరీర్లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. గతేడాది ఈజిప్టులో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో ఆమె తొలిసారి విజేతగా నిలిచింది. 3 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌజన్య కీలకదశలో పాయింట్లు సాధించి నెగ్గింది. విజేతగా నిలిచిన సౌజన్యకు 12 డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ పాయింట్లు, 1,560 డాలర్ల (రూ. 95 వేలు) ప్రైజ్‌మనీ లభించాయి. విజేత ప్రాంజల ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నమెంట్లో సత్తాచాటింది. చండీగఢ్‌లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-3 ఈవెంట్లో ఆమె టైటిల్ సాధించింది. తాజా టైటిల్ విజయంతో ఆమె ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 92వ స్థానానికి చేరింది. చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ పోరులో టాప్ సీడ్ ప్రాంజల 3-6, 6-2, 6-3తో థాయ్‌లాండ్‌కు చెందిన బున్యవి తంచయివత్పై చెమటోడ్చి గెలిచింది. డేవిస్ కప్ జట్టులో సాకేత్ ముంబై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువ సంచలనం సాకేత్ మైనేనికి భారత డేవిస్‌కప్ జట్టులో స్థానం లభించింది. ఆసియా, ఓసియానియా గ్రూప్-1లో భాగంగా ఇండోర్‌లో జనవరి 31 నుంచి చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది. లియాండర్ పేస్ వ్యక్తిగత కారణాలతో దూరం కాగా... మహేశ్ భూపతిని సెలక్టర్లు మరోసారి పట్టించుకోలేదు. రోహన్ బోపన్న తిరిగి జట్టులోకి వచ్చాడు. బోపన్నతో కలిసి డబుల్స్ ఆడేందుకు సాకేత్‌ను జట్టులోకి తీసుకున్నారు. సోమ్‌దేవ్, యూకీ బాంబ్రీ సింగిల్స్ ఆడతారు. జీవన్, సనమ్సింగ్లను రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు. నిజానికి జీవన్‌ను ఎంపిక చేస్తారని భావించినా... సెలక్టర్లు అనూహ్యంగా సాకేత్‌కు అవకాశం ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆడిన ప్రతిసారీ జీవన్‌పై గెలవడం సాకేత్‌కు కలిసొచ్చింది.