అతని వెనుక ఆ ముగ్గురు..
ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందిన చాలా మంది ప్రముఖుల ప్రస్థానాన్ని గమనిస్తే నిజంగానే ఈ విషయం స్పష్టమవుతుంది. ప్రపంచ టెన్నిస్ రంగంలో సంచలన ఆటతీరుతో గ్రాండ్‌స్లామ్ పంటపండించుకుంటున్న స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ జీవితంలోనూ ఈ కోణం కనిపిస్తుంది. అయితే అతడి విజయాల వెనుక ఉన్నది ఒక్క మహిళ కాదు.. ఏకంగా ముగ్గురు. తల్లి, చెల్లి, ప్రియురాలి సహకారంతో నాదల్ ఏకంగా ప్రపంచ టెన్నిస్‌నే ఏలగలుగుతున్నాడు.
‘నా చిన్న వయసులోనే లెక్కలేనంత డబ్బు.. పేరు ప్రఖ్యాతులు వచ్చి పడ్డాయి. దీనివల్ల నా ఆట గతి తప్పకుండా, లక్ష్యం వైపు పయనించే వాతావరణాన్ని సృష్టించింది నా కుటుంబమే. ఒక రకంగా వారు లేకుండా ఈ సంపద, విజయాలు నాకు దక్కడం అసంభవం’ - ఫ్యామిలీపై నాదల్ మనోగతం.
అనా మరియా పెరీరా (తల్లి)
మైదానంలో చిచ్చరపిడుగులా చెలరేగుతూ బలమైన సర్వ్‌లు సంధించే నాదల్ నిజానికి చాలా భయస్తుడు. చూడ్డానికి యోధుడిలా ఉంటూ మెరుపుల్లాంటి షాట్‌లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేస్తాడు. కానీ తనకు నిజంగానే పిడుగులన్నా.. మెరుపులన్నా భయం. అంతెందుకు చీకటంటేనే జడుసుకుంటాడు. పడుకున్నా లైట్ వెలగాల్సిందే.. లేకపోతే టీవీ ఆన్‌లోనే ఉండాలి. మొత్తానికి అతనో సూపర్ సెన్సిటివ్. ఇలాంటి లక్షణాలున్న ఈ స్పెయిన్ హీరోని అతడి తల్లి అనా మరియా పెరీరా కంటికి రెప్పలా కాపాడుకుంది. విజయాల వైపు దృష్టి మరల్చేలా చేసింది. తనలో ధైర్యాన్ని పెంచి మంచి క్రీడాకారుడిగా తయారుచేసింది.
మరిబెల్ (చెల్లి)
నాదల్‌కు తన చెల్లి మరిబెల్ అంటే ప్రాణం. తనకు కూడా అంతే. సహజంగా అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే గిల్లికజ్జాలు.. ఒకరిపై మరొకరి చాడీలు వీరి మధ్య కనిపించవు. నాదల్ తనకు బాధ, సంతోషం ఏది కలిగినా చిన్నప్పటి నుంచీ చెల్లితోనే తొలుత పంచుకునేవాడు. తనకన్నా చిన్నదైనా చాలా పరిణతితో కూడిన సలహాలు ఇచ్చేదని నాదల్ చెబుతుంటాడు. తాము టీనేజ్‌లో ఉండగా అతడి స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు తననూ తీసుకెళ్లేవాడని.. ఇది ఇతరులకు వింతగా అనిపించినా తమ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా నిలుస్తుందని తెలిపింది.
మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో (ప్రియురాలు)
నాదల్ గురించి బాగా తెలిసిన మనిషి మరియా. స్వతహాగా ఆమె లైమ్‌లైట్‌లో ఉండాలని భావించదు. నాదల్ స్వభావం కూడా అంతేనని, సెలబ్రిటీ ప్రపంచంలో ఇమడలేనని అనుకుంటాడని మరియా చెప్పింది. ఇద్దరూ జంటగా కూడా బయట ఎక్కువగా కనిపించరు. వెనకాలే ఉంటూ నాదల్‌ను మున్ముందుకు పంపాలనే తాపత్రయం మరియాది. ఊహించని పరాజయం ఎదురైనప్పుడు. అతి పెద్ద విజయం సాధించినప్పుడు నాదల్ భావోద్వేగాలను నియంత్రించి తనని మళ్లీ మామూలు మనిషిని చేసే వ్యక్తి మరియా.