ఫెడరర్ కన్నా నాదల్ ఉత్తమం: అగస్సీ
సింగపూర్: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో రోజర్ ఫెడరర్‌ది ప్రత్యేక స్థానం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న రికార్డు ఈ స్విస్ దిగ్గజం పేరిట ఉంది. అయితే టెన్నిస్‌లో ఫెడరర్‌కన్నా స్పెయిన్ బుల్ రాఫెల్ నాదలే ఆల్ టైమ్ బెస్ట్ అని మాజీ ఆటగాడు ఆండ్రీ అగస్సీ తేల్చాడు. అత్యంత పోటీ వాతావరణంలో తలపడుతూ విజయాలు సాధిస్తుండడమే దీనికి కారణమని ఎనిమిది గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకున్న అగస్సీ చెప్పాడు.
‘నంబర్‌వన్ నాదలే. ఆ తర్వాతే ఫెడరర్. ఎందుకంటే తను జొకోవిచ్, ముర్రే, ఫెడరర్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లతో తలపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ కాలాన్ని ఒక రకంగా టెన్నిస్ స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. అతను ఇంకా సాధించాల్సింది ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా ప్రతీ గ్రాండ్‌స్లామ్‌ను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది అది కూడా సాధించే అవకాశం ఉంది’ అని అగస్సీ వివరించాడు.