రాజధానిలో కొత్త ఐటీ పార్క్‌ | Capitaland has come forward to Invest Rs 450 crore project in Hyderabad | Sakshi
Sakshi News home page

రాజధానిలో కొత్త ఐటీ పార్క్‌

Published Mon, Jan 20 2025 4:37 AM | Last Updated on Mon, Jan 20 2025 8:35 AM

Capitaland has come forward to Invest Rs 450 crore project in Hyderabad

క్యాపిటల్యాండ్‌ ఈడీ మనోహర్‌ కియాతానీకి జ్ఞాపికను అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సంస్థ సీఈవో గౌరీశంకర్, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌లో రూ. 450 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్‌

సింగపూర్‌లో రాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చలు, ఒప్పందం

ముగిసిన సీఎం సింగపూర్‌ పర్యటన.. చివరిరోజు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరిన రాష్ట్ర బృందం

సాక్షి, హైదరాబాద్‌: సింగపూర్‌కు చెందిన క్యాపిట ల్యాండ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పా­టు చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్‌ను తీర్చి­దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ఆదివారం క్యాపిటల్యాండ్‌ ప్రతినిధి బృందంతో నిర్వ­హించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేర­కు రాష్ట్ర ప్రభుత్వం, క్యాపిటల్యాండ్‌ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకు­న్నా­యి. 

క్యాపిట­ల్యాండ్‌ కొత్త ఐటీ పార్కు హైదరాబాద్‌ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్లూచిప్‌ కంపెనీలు కోరు­కునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పా­ర్కులో అందుబా­టులో ఉంచనున్నట్టు తెలిపా­రు. సీఎం రేవంత్‌ సార­థ్యంలో హైదరాబాద్‌ సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, అక్కడ తమ సంస్థ కార్యక­లాపాలను విస్త­రించటం ఆనందంగా ఉందని క్యాపిట­ల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో గౌరీ శంకర్‌ నాగభూషణం పేర్కొన్నారు.

ఇప్పటికే పలు పెట్టుబడులు..
క్యాపిటల్యాండ్‌ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్‌ పార్క్‌ (ఐటీపీహెచ్‌), అవాన్స్‌ హైదరాబాద్, సైబర్‌ పెర్ల్‌ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్‌ డేటా సెంటర్‌ ఈ ఏడాది మధ్యలో అందుబా­టులోకి రానుంది. ఐటీపీహెచ్‌ రెండో దశ కూడా ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. సింగపూర్‌లో జరిగిన ఈ చర్చల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఉన్నతాది­కారులు, క్యాపిటల్యాండ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనోహర్‌ కియాతానీ పాల్గొన్నారు.

మెరీనా బేలో సీఎం పడవ ప్రయాణం
సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌లోని మెరీనా బేలో ఫెర్రీ ప్రయాణం చేశారు. మెరీనా బే తీరంలో నిర్మించిన ఆకాశహర్మ్యాలను తిలకించి, వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పర్యాటకాభివృద్ధికి చేపట్టిన చర్యలను పరిశీలించారు.

ముగిసిన సింగపూర్‌ పర్యటన
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్‌ పర్యటన ముగిసింది. సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు అక్కడి నుంచి ఆదివారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు. సోమవారం దావోస్‌కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే లక్ష్యంతో దావోస్‌కు వెళుతున్నట్టు రాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. ఇక సింగపూర్‌లో తమ పర్యటన విజయవంతమైందని తెలిపింది. 
 


సింగపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో రూ.3,500 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ఒప్పందం, రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్‌ ల్యాండ్‌ ఒప్పందం కీలక అంశాలని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్‌ సెమీ కండక్టర్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెబుతున్నాయి.

చివరి రోజు వరుస సమావేశాలు
సింగపూర్‌ పర్యటనలో ఆదివారం సీఎం బృందం వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్‌ బిజినెస్‌ ఫెడరే­షన్‌ ప్రతిని­ధు­లతో చర్చలు జరిపింది. ఇండియన్‌ ఓషన్‌ గ్రూప్‌ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్‌ కంట్రీ హెడ్‌ లిమ్‌ హిమ్‌ చౌన్, డీబీఎస్‌ గ్రూప్‌ హెడ్‌ అమిత్‌ శర్మ, బ్లాక్‌ స్టోన్‌ సింగపూర్‌ సీనియర్‌ ఎండీ, చైర్మన్‌ గౌతమ్‌ బెనర్జీ, బ్లాక్‌ స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ సీని­యర్‌ ఎండీ పెంగ్‌ వీ టాన్, మెయిన్‌ హార్డ్‌ గ్రూప్‌ సీఈవో ఒమర్‌ షాజాద్‌తో భేటీ అయింది. హైదరాబాద్‌లో పెట్టుబడు­ల అవకా­శా­లు, ప్రభుత్వ విధానాలను వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement