వాషింగ్టన్:ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా(America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్(MAGA) ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు.
‘నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలుపెడతాం.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. టిక్‌టాక్ యాప్‌ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్‌టాక్ యాప్‌లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. అధికారం చేపట్టకముందే ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ఎఫెక్ట్ కాదు. మీ అందరి ఎఫెక్ట్’అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు.
కాగా, గతేడాది నంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సోమవారం(జనవరి 20)న రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
ఇదీ చదవండి: నేడే ట్రంప్ పట్టాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment