వాషింగ్టన్: ఇటీవల రష్యాలో వివాదాస్పదమైన అక్కడి ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని మృతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్పందించారు. ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయమై తాజాగా ఆయన ఒక పోస్టు పెట్టారు. నావల్ని మృతిని అమెరికాలో తాను చేస్తున్న న్యాయపోరాటాలతో ట్రంప్ పోల్చారు. నావల్ని మృతి అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తనను మరింత అప్రమత్తం చేసిందన్నారు.
ఇదిలాఉంటే ఇదే పోస్టులో ట్రంప్ అమెరికా ప్రస్తుత స్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఒక విఫలమవుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించారు. ‘రాడికల్ లెఫ్ట్ రాజకీయ నాయకులు, జడ్జ్‌లు, ప్రాసిక్యూటర్లు, అంతా కలిసి దేశాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నారు. అక్రమ వలసదారులకు తెరచుకున్న సరిహద్దులు, ఎన్నికల్లో రిగ్గింగ్, కోర్టుల అసందబద్ధ నిర్ణయాలు అన్నీ కలిసి అమెరికాను నాశనం చేస్తున్నాయి. దేశాన్ని పతనం దిశగా నడిపిస్తున్నాయి’అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఫిబ్రవరి 16న రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉండొచ్చన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. నావల్ని మృతిపై రష్యాలో అతడి అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పలు చోట్ల నిరసరన తెలుపుతున్న నావల్ని అభిమానులను అక్కడి ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టులు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment