
యుద్ధ భయం నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్‌లో సరిపడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్న ఓ కుటుంబం
భారత్‌ను నిలువరించండి
అరబ్ దేశాలకు విజ్ఞప్తులు
రాయబారులతో షరీఫ్ భేటీ
ఉగ్రవేటలో మేం భారత్‌తోనే
పాక్‌కు అమెరికా స్పష్టీకరణ
మీ గడ్డపై ముష్కరులు: వాన్స్
వారి వేటలో భారత్‌కు తోడ్పడండి
దాయాదికి ఉపాధ్యక్షుని హితవు
మాది ‘ఉగ్ర’చరిత్రే: బిలావల్
ఎనిమిదో రోజూ పాక్ కాల్పులు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.
పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.
‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది.
అదేమీ రహస్యం కాదు: బిలావల్
పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్‌పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.
‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది.
హాకింగ్‌కు విఫలయత్నాలు
పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్‌సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు.

ఐదు సెక్ట్టర్లలో కాల్పులు
పాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్‌లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.
అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్‌గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.
కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది.