
న్యూఢిల్లీ: భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం గురువారం సడలించింది. ఏప్రిల్ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాఘా–అటారీ సరిహద్దు గుండా తిరిగి వెళ్లేందుకు అనుమతించింది. ‘ఈ ఉత్తర్వులను సమీక్షించాం.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాక్ పౌరులు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి భారత్ విడిచి పాకిస్తాన్‌కు వెళ్లొచ్చు’అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం ఆదేశించిన ఆరు రోజుల్లో 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ–వాఘా సరిహద్దు పోస్ట్ ద్వారా భారత్‌ను వీడారు. ఇక పాకిస్తాన్ నుంచి 1,617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరిలో దీర్ఘకాలం వీసా కలిగిన 224 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు విమానాశ్రయాల ద్వారా మూడో దేశం గుండా పాక్ వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి.
