
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ హద్దు మీరితే భారత్ సైన్యం ఇప్పటికే రెడీగా ఉంది. అటు నావీ, ఇటు ఎయిర్స్ ఫోర్స్, మిలటరీ దళాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది గుర్ పత్వాంత్ సింగ్ పన్నూ.. భారత సైన్యంలో ఉన్న సిక్కు మతస్తులను ఉద్దేశించి ఒక వీడియో రీలీజ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ సైన్యం యుద్ధానికి దిగితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్కు మతస్తులు ఎవ్వరూ ఆ యుద్ధం పాల్గొనవద్దంటూ వివాదాస్పద వీడియో రిలీజ్ చేశారు.
యుద్ధానికి రంగం సిద్ధమైతే భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి మీరు నో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మనకు స్నేహ పూర్వక దేశమని, శత్రుదేశం కాదని పొగడ్తలు కురిపించారు. ఖలిస్తాన్ కు, సిక్కు మతస్తులకు పాకిస్తాన్ అనేది ఒక మిత్ర దేశమంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.