
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్‌ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.
భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడ
మరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్‌ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.
కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.