
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్‌గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.
ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి. కశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్‌లల మధ్య చాలాకాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందింనవారు, స్పాన్సర్లు... పహల్‌గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషింనవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి.
మతం అడగడం సిగ్గుచేటు
ప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్‌లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూర కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.
భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది.
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.
చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి.
ఇదీ చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
భారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.
భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవులు మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు.
-జహారా బేగం
వ్యాసకర్త సామాజిక కార్యకర్త, యూఎస్‌ఏ