అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
→ చలి దృష్ట్యా ఇండోర్‌లో జరగనున్న కార్యక్రమం
→ ఆహూతులు 500 మందే; జాబితాలో అంబానీలు
→ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తేస్తూ తొలి సంతకం!
వాషింగ్టన్: రెండున్నర నెలల ఎదురుచూపులు ముగిశాయి. (Donald Trump,)డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం (Oath Taking Ceremonyప్రమాణస్వీకారం చేయబోతున్నారు. (Washington)వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టినా, గడ్డకట్టించే చలి కారణంగా రొటుండా హాల్ లోనికి మార్చారు. దాంతో రొనాల్డ్ రీగన్ తర్వాత గత 40 ఏళ్లలో ఇండోర్‌లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న తొలి నేతగా ట్రంప్ నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆహూతులను కూడా వేలనుంచి 500 లోపునకు కుదించారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
చైనా ఉపాధ్యక్షుడు హాన్‌జెంగ్‌తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరవనున్నారు. 2021 క్యాపిటల్ హిల్ దాడి నిందితులు కూడా కోర్టు ప్రత్యేక అనుమతితో కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం. ట్రంప్ శనివారం సాయంత్రమే కుటుంబసమేతంగా ఫ్లోరిడా నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్నారు. రాత్రి స్టెర్లింగ్‌లోని ఆయన సొంత నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మొదలైన ప్రమాణ స్వీకార వేడుకల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, ఆయన సతీమణి ఉషా చిల్లకూరితో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోసారి పగ్గాలు చేపడుతూనే ట్రంప్ తనదైన శైలిలో దూకుడు కనబరచనున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజే టిక్‌టాక్‌పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేయనున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు.
అంతేగాక ఏకంగా 100కు పైగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ట్రంప్ ఓడించడం తెలిసిందే. ఆయన 2017–21 మధ్య తొలి దఫా అమెరికా అధ్యక్షునిగా పనిచేశారు. ట్రంప్ అభిమానులకు పోటీగా ఆయన వ్యతిరేకులు కూడా శనివారం నుంచే వైట్‌హౌస్ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.
ఏప్రిల్‌లో భారత పర్యటన?
ఏప్రిల్‌లో ట్రంప్ భారత పర్యటన ఉండే అవకా శం కనిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వీ లైనంత త్వరగా భారత్‌లో పర్యటించాలని ఆయ న యోచిస్తున్నట్టు ఫైనాన్షియల్ డైలీ వెల్లడించింది. ‘‘దీనిపై ఆయన ఇప్పటికే తన సలహాదారులతో లోతుగా చర్చిస్తున్నారు. డిసెంబర్ చివర్లో క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఈ దిశగా ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగాయి’’ అని తెలిపింది. అంతకుముందే ప్రధాని మోదీని అమెరికాలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ఆహ్వానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు వివరించింది. చైనాపై టారిఫ్‌లు తప్పవన్న తన వ్యాఖ్యల తాలూకు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశంలో కూడా ట్రంప్ పర్యటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
కార్యక్రమానికి అతిరథులు
ప్రపంచ కుబేరులు, వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ దంపతులు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంబానీ దంపతులు శనివారం రాత్రే ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్‌లో పాల్గొన్నారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారు మాత్రమే ఉన్నారు.
ప్రమాణ స్వీకారం ఇలా...
→ ట్రంప్ ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద కార్యక్రమంలో, క్యాపిటల్ వన్ ఎరీనా ర్యాలీలో పాల్గొంటారు.
→ సోమవారం ఉదయం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలతో కార్యక్రమాలు మొదలవుతాయి.
→ అనంతరం దిగిపోనున్న అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు తేనీటి విందు ఇస్తారు.
→ తర్వాత అంతా కలిసి క్యాపిటల్ హిల్ భవనానికి చేరుకుంటారు.
→ లింకన్ బైబిల్‌పై ప్రమాణం చేసి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
→ తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండో టర్ములో తన ప్రాథమ్యాలను క్లుప్తంగా వివరిస్తారని భావిస్తున్నారు.
→ అనంతరం బైడెన్, కమలా హారిస్‌కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతారు.
→ తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తూ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తారు. అధ్యక్షునిగా తొలి ఆదేశాలు జారీ చేస్తారు.
→ అధికారిక విందు అనంతరం సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment