వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది | Union Minister Kumaraswamy Said Jagan Government Opposed The Privatization Of Visakha Steel | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ప్రభుత్వం వల్లే ప్రైవేటీకరణ ఆగింది

Published Sat, Jan 18 2025 10:31 AM | Last Updated on Sat, Jan 18 2025 11:08 AM

Union Minister Kumaraswamy Said Jagan Government Opposed The Privatization Of Visakha Steel

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను జగన్‌ సర్కారు వ్యతిరేకించింది

పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు 

విశాఖ ఉక్కుపై మీడియాతో కేంద్రమంత్రి కుమారస్వామి వెల్లడి 

అప్పట్లో ఎన్నో ఆందోళనలు, నిరసనలు కూడా చేపట్టారు 

అందుకే వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదు.. 

రూ.11,440 కోట్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రికి అభ్యంతరాలున్నాయి 

విలీనం, ఉద్యోగుల వీఆర్‌ఎస్‌పై స్పష్టత కరువు

సాక్షి, న్యూఢిల్లీ: ‘కోవిడ్‌ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే, దీనికి వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.

దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించింది.’ అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై పౌర విమానయాన  శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి కుమార­స్వామి శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే.. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ఉన్నంత వరకూ కర్మాగారం అభివృద్ధిలో నడిచింది. 2016–17లో 7.3 మిలియన్‌ల ఉత్పత్తికి ప్రయత్నాలు చేసినప్పటి నుంచి నష్టాలు ప్రారంభయ్యాయి. 2018–19, 2020–21లో రూ.930 కోట్లు లాభాలు వచ్చాయి. 2021 కోవిడ్‌ సమయంలో ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన గొంతు వినిపించింది. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేసింది. అంతేకాదు.. ఉద్యమాలు, ఆందోళనలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి.. అప్పటి ప్రభుత్వంవల్లే వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ జరగలేదు.

ఆర్థిక మంత్రికి అభ్యంతరాలున్నాయి
నేను కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక సమీక్షలు చేసి విశాఖ ఉక్కుకు సాయంచేయాలనే విషయాన్ని ప్రధాని, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లా. అయితే, ఈ ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా, వాటిని పక్కనపెట్టి చివరి అవకాశంగా రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు. దీంతో రెండేళ్లలోనే స్టీల్‌ప్లాంట్‌ను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడాన్ని నేను సవాలుగా తీసుకున్నా.

ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ
‘విశాఖ ఉక్కు కర్మాగారానికి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి రూ.10 వేల కోట్లుకు పైగా పెట్టుబడిని మద్దతుగా ఇచ్చేందుకు గురువారం జరిగిన కేబి­నెట్‌ సమావేశంలో నిర్ణయించాం. ఆ­త్మ­­నిర్భర భారత్‌ సాధించడంలో ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రాముఖ్య­తను అర్థంచేసుకుని ఈ చర్య చేపట్టాం’ అని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ‘ఎక్స్‌’లో తెలిపారు.  

విలీనం, ఉద్యోగుల వీఆర్‌ఎస్‌పై దాటవేత..
ఇదిలా ఉంటే.. ఉద్యోగుల్ని వీఆర్‌ఎస్‌ తీసుకోమంటున్నారు.. సెయిల్‌ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందంటూ మీడియా ప్రస్తావించగా.. కుమారస్వామి దాటవేసే ప్రయత్నం చేశారు. వీఆర్‌ఎస్‌పై త్వరలో యూనియన్‌ నేతలతో మాట్లాడతామన్నారు. ఇక ప్రతి అంశాన్ని దశల వారీగా చర్చించి, పరిష్కరించేందుకు ముందుకెళ్తామన్నారు.

అలాగే, ప్యాకేజీ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో రూ.26,114.82 కోట్లు అప్పుల్లో ఉన్నట్లు ఉంది. ఇదే అంశంపై కేంద్రమంత్రిని మీడియా ప్రశ్నించగా.. ‘రూ.26,114.82 కోట్లు కాదు రూ.35 వేల కోట్లు రుణభారం ఉంది. దీనిని అధిగమించేందుకు అంచెలంచెలుగా ముందుకెళ్తాం. ప్రస్తుతం ఇచ్చిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో కర్మాగారాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం’ అన్నారు. ప్యాకేజీకి.. ఉన్న రుణభారానికి సంబంధంలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం తమకెంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తంచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement