ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీలో సింగపూర్ సంస్థ ఐటీఈ పాఠ్యాంశాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందం
సంస్థ అందిస్తున్న కోర్సులు, ఉన్న సదుపాయాలు పరిశీలన
20 రంగాలకు చెందిన నిపుణులు, సంస్థ సిబ్బందితో చర్చలు
రాష్ట్ర విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణపై ఎంఓయూ
ఒప్పందంతో లాభం ఇలా..
⇒ ఐటీఈ పాఠాలను స్కిల్స్ వర్సిటీలో బోధిస్తారు.
⇒ టెన్త్ విద్యార్థులు మొదలుకుని చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగ నైపుణ్యాలపై సింగపూర్ సంస్థ శిక్షణనిస్తుంది.
⇒ ‘స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈకి 5 వేల పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉండగా, ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు.
⇒ ప్రస్తుత ఒప్పందంతో స్కిల్స్ వర్సిటీలో వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్‌తో పాటు క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు.
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకారం, శిక్షణకు సంబంధించి.. సింగపూర్ ప్రభుత్వ విద్యాసంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ), రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఈ పరస్పర అవగాహన (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్స్ యూనివర్సిటీలో బోధించనున్నారు.
శుక్రవారం సింగపూర్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ టీమ్’కు అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎల్విఎస్‌ఎస్ సుబ్బారావుతో కూడిన ప్రతినిధి బృందం ఐటీఈ ప్రాంగణాన్ని సందర్శించింది.
కోర్సులు, సదుపాయాల పరిశీలన ఐటీఈ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అధునాతన సదుపాయాలను రాష్ట్ర బృందం పరిశీలించింది. అక్కడ శిక్షణ ఇస్తున్న సుమారు 20 రంగాలకు చెందిన నిపుణులు, సంస్థ సిబ్బందితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలోని స్కిల్స్ యూనివర్సిటీకి సహకరించాలని ఐటీఈ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కోరారు. వర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిం చేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహిస్తున్న కోర్సులను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. చర్చల అనంతరం ఐటీఈ, స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ కుదిరింది. ఒప్పంద పత్రాలపై స్కిల్స్ వర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ అకడమిక్, అడ్మిన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు.
సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ
ఐటీఈతో భాగస్వామ్యం.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక వనరులు, పర్యాటకం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక సహకారానికి మార్గం సుగమం చేస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తుందని అధికారులు ప్రకటించారు. పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి( Revanth Reddy), మంత్రి శ్రీధర్‌బాబు బృందం భేటీ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment