
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి చూపడంతోపాటు హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’నినాదాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక వసతులు, సంక్షేమంతో కూడిన సమతుల పాలన రాష్ట్రంలో సాగుతోందని తెలిపారు. హైదరాబాద్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్ది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్త ప్రాంగణాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పేరొందిన ‘మిస్ వరల్డ్’పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని, ఈ తరహా ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఓడరేవులతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని సీఎం వెల్లడించారు.
పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానం
పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనేం.. పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉంది. డిసెంబర్, 2023లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకుని ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.
లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాం. 2025లో దావోస్‌లో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ కట్టడి, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలోనూ మొదటి స్థానంలో ఉంది. 66 లక్షల మంది మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది.
హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్, పారిశ్రామిక రంగాలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్‌గా మారింది. ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా తయారైంది. మైక్రోసాఫ్ట్, కాగి్నజెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
ఏఐ లీడర్‌గా తీర్చిదిద్దుతాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీల్లో ప్రపంచంలోనే తెలంగాణను లీడర్‌గా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘తెలంగాణను ఏఐ లీడర్‌గా మార్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. ఏఐ సిటీలో భాగస్వామి అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపించాయి. ఏఐలో ప్రపంచ స్థాయి నిపుణులను తయా రు చేసేందుకు త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం.
పౌర సేవలను ఏఐతో అనుసంధానించి ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్లోబల్ కేపబిలిటి సెంటర్లకు హైదరా బాద్ హబ్‌గా మారింది. ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సొనాటా ప్రతినిధులు సమీర్ ధీర్, సుజిత్ మొహంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోహ్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సీఎం
దేశ క్రికెట్ చరిత్రలో విరాట్‌కోహ్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్లాఘించారు. క్రికెట్‌లో ఆయన సాధించిన విజయాలను పొగిడారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ఉన్నత క్రమశిక్షణ కలిగిన, కమిట్‌మెంట్ ఉన్న ఆటగాడిగా ఆయన సాధించిన పలు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. యువ క్రికెటర్లకు ఆయన ఒక మార్గదర్శి అని తెలిపారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తన తదుపరి దశ విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు.